వనపర్తి ః రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అక్టోబర్ 1వ తేది నాటికి 18 సంవత్సరాలు పూర్తవుతున్న ప్రతి యువత తన పేరును ఓటరు జాబితాలో నమోదు చేయించుకునే విధంగా విస్తృత అవగాహన, ప్రచారం చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. సోమవారం ఉదయం ప్రజావాణి హాల్లో అందరూ జిల్లా అధికారులకు ఎన్నికల సన్నద్ధతపై పలు సూచనలు చేశారు. జిల్లాలో 18 సంవత్సరాలు నిండి ఓటరు జాబితాలో పేరు నమోదు లేకుండా ఏ ఒక్కరు లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి తహసిల్దార్, డిటిలు, ఎంపిఓలు, పంచాయతి సెక్రటరీలు ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
అదే విధంగా స్వీప్ యాక్టివిటిలు విస్తృతంగా నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి కళాశాల వద్ద ఓటు నమోదు అవగాహన సదస్సులు నిర్వహించి ఫారం 6 ద్వారా దరఖాస్తులు తీసుకోవాలని సూచించారు. అదే విధంగా ఎవరైనా ఓటరు ఇక్కడి నుంచి వేరే నియోజకవర్గానికి మారినా లేదా చనిపోయిన వారి పేర్లు ఓటరు జాబితాలో క్షుణ్ణంగా పరిశీలించి తొలగించాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల సందర్భంగా ప్రతి అధికారితమ విధులను నియమ నిబంధనలు అనుసరించి మాత్రమే నిర్వర్తించాల్సి ఉంటుందని అనుమానాలు ఉంటే ఒకటికి రెండు సార్లు నివృత్తి చేసుకోవాలని సూచించారు.
ప్రతి పోలింగ్ స్టేషన్‌లో ఎన్నికల నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవాలని ముఖ్యంగా ప్రతి పోలింగ్ స్టేషన్‌కు ర్యాంపులు ఉండాలని తెలిపారు. అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్, సిపిఓ వెంకటరమణ, డిఆర్‌డిఓ పిడి నరసింహు లు, జెడ్పి సిఈఓలు శ్రవణ్ కుమార్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.