Monday, November 18, 2024

అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి : ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎంతో కీలకమైన ఓటు హక్కును అర్హులైన ప్రతి ఒక్కరూ వినియోగించుకునేలా చూడాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ పిలుపునిచ్చారు. సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని శనివారం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్, గేటెడ్ కమ్యూనిటీ ప్రతినిధులు, సభ్యులకు అవగాహన సమావేశం నిర్వహించారు. కొత్త ఓటర్ల నమోదు, ఓటర్ల జాబితాలో ఏవైనా తప్పిదాలు ఉంటే వాటిని సరి చేసుకోవడం, చిరునామా మార్పు, పోలింగ్ శాతాన్ని పెంచాల్సిన ఆవశ్యకత తదితర అంశాలపై వారికి అవగాహన కల్పించారు.

సీ.ఈ.ఓ వికాస్ రాజ్ తో పాటు అదనపు సీఈఓ లోకేష్ కుమార్, సంయుక్త సీఈఓ సర్ఫరాజ్ అహ్మద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, జీ హెచ్ ఎం సి కమిషనర్ రోనాల్ రోస్, రంగారెడ్డి కలెక్టర్ హరీష్ తదితరులు అవగాహన కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. ఈ సంద ర్భంగా సీ.ఈ.ఓ వికాస్ రాజ్ మాట్లాడుతూ, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా పేర్లు నమోదు చేసుకునేలా చొరవ చూపాలని రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్, గేటెడ్ కమ్యూనిటీ ప్రతినిధులను కోరారు.

ఈ దిశగా ఎన్నికల సంఘం చేపడుతున్న చర్యలకు పూర్తి సహకారం అందించాలన్నారు. ఓటర్లు ఎంతో సులభంగా ఆన్ లైన్ విధానం ద్వారా ఓటరు జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించడం జరిగిందన్నారు. ఆఫ్ లైన్ విధానంలోనూ నిర్ణీత నమూనా ఫారాలను నింపి బి ఎల్ ఓ లకు లేదా సంబంధిత అధికారులకు అందించవచ్చని సూచించారు.హైదరాబాద్ మహా నగరానికి దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల నుండి ఉద్యోగ, ఉపాధి అవసరాల రీత్యా పెద్ద సంఖ్యలో ప్రజలు వలస వస్తుంటారని గుర్తు చేశారు. వీరిలో అర్హులైన ప్రతి ఒక్కరు ఎన్నికల ప్రక్రియలో పాల్గొని 100% పోలింగ్ నమోదు అయ్యేలా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

ఓటు ప్రాధాన్యత గురించి విస్తృత స్థాయిలో చర్చ జరుపుతూ ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని హితవు పలికారు. ఓటరు జాబితాలో పేర్ల నమోదు, మార్పులు చేర్పులకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే 1950 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫిర్యాదు చేస్తే, తప్పనిసరిగా నిర్ణీత గడువు లోపు సమస్యను పరిష్కరిస్తామని అన్నారు. ఓటర్ల నమోదు కోసం సంబంధిత అధికారులు నిర్ణీత నమూనా ఫారాలను వారే స్వయంగా స్వీకరిస్తారని,అసోసియేషన్ల ప్రతినిధులు కొత్త ఓటర్ల నుండి సేకరించకూడదని సూచించారు. ఈ సందర్భంగా రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్, గేటెడ్ కమ్యూనిటీల ప్రతినిధులు ప్రస్తావించిన పలు సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో సైబరాబాద్ అదనపు పోలీస్ కమి షనర్ అవినాష్ మహంతి, జీహెచ్‌ఎంసి పరిధిలోని ఈ.ఆర్.ఓలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News