నవీపేట్ : రాష్ట్రంలో వ్యవసాయానికి సాగునీరు అందిస్తున్నామని ప్రస్తుత బిఆర్‌ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర రైతులకు సాగునీరు అందుతుందంటే కారణం అది గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కట్టిన ప్రాజెక్టుల వల్లనేనని మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి అన్నారు. ప్రస్తుత బిఆర్‌ఎస్ ప్రభుత్వానికి కాలేశ్వరం పేరుతో లక్షల కోట్ల కమిషన్లు దండుకోవడం తప్ప రైతులకు సాగునీరు అందించే ఉద్దేశం లేదని ఆయన ఎద్దేవా చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో రైతులకు ప్రజలకు సాగు , తాగునీరు అందిస్తున్న భారీ, మధ్య తరహా, చిన్న నీటి పారుదల ప్రాజెక్టులు అన్నీ కూడా గత ప్రభుత్వాలు నిర్మించినవే తప్ప బిఆర్‌ఎస్ కట్టిన ప్రాజెక్టు ఒకటి కూడా లేదని ఆయన పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ రంగానికి చేసిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేయాలని ఉద్దేశంతో సుదర్శన్‌రెడ్డి కాంగ్రెస్ హయాంలో నిర్మించిన కోస్లి లిఫ్ట్ ఇరిగేషన్ ,ఎర్రకుంట చెరువుతో పాటు అలీసాగర్ లిప్ట్ ఇరిగేషన్‌ను సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వ్యవసాయ రంగంపై ఆధారపడ్డ నిజామాబాద్ జిల్లాను సస్యశ్యామలం చేసే ఉద్దేశంతో తాను మంత్రిగా ఉన్నప్పుడు కోస్లి లిఫ్ట్ ఇరిగేషన్ ,ఎర్రకుంట చెరువుతో పాటు అలీసాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ మరియు గుత్ప ఎత్తిపోతల ప్రాజెక్టును నిర్మించడం జరిగిందని ప్రస్తుతం వీటి ద్వారానే ఉమ్మడి జిల్లాలోని పంట పొలాలకు సాగునీరు అందుతుందని ఆయన అన్నారు. ప్రస్తుతం ఉన్న బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు జిల్లాకు సంబంధించి రైతుల సమస్యల పరిష్కారం కోసం గాని తాగునీరు , సాగునీరు సమస్య పరిష్కారం కోసం కృషి చేయడం మానేసి ఇప్పటి దాకా గత కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని తమ ఖాతాలోకి వేసుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు.
తాము నిర్మించిన నీటి ప్రాజెక్టులలో కొన్ని సంవత్సరాలుగా నిర్వహణ సరిగా లేక మోటార్ పని చేయడం లేదని అలాగే అందులో పని చేస్తున్న సిబ్బందికి సరిగా జీతాలు ఇవ్వడం లేదని వేల కోట్ల కరెంటు బిల్లులు ఆయా నీటి ప్రాజెక్టుల కింద బకాయిలు పేరుకుపోయాయని ఆయన అన్నారు. ప్రాజెక్టులు కట్టడం ఎలాగో చేతకాలేదు. కనీసం గత ప్రభుత్వాలు నిర్మించిన ప్రాజెక్టులనైన సరిగా నిర్వహణ చేపట్టి రైతుల అభివృద్ధ్దికి పాటుపడాల్సింది పోయి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందని విమర్శిస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో అని చెప్పడానికి సాక్షాలు ఇప్పుడున్న నీటి ప్రాజెక్టులే అని ఆయన అన్నారు. దశాబ్ది ఉత్సవాల పేరిట బిఆర్‌ఎస్ నిర్వహించిన నీటి ఉత్సవాలను కూడా గత కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన చెరువులు చెక్ డ్యాములు లిప్ట్ ఇరిగేషన్‌లు ప్రాజెక్టుల పైననే నిర్వహించారని ఆయన ఎద్దేవా చేశారు.
కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్‌రెడ్డి, టిపిసిసి ఉపాధ్యక్షులు నిజామాబాద్ అర్బన్ ఇంచార్జి తాహెర్ బిన్‌హందాన్, టిపిసిసి ప్రధాన కార్యదర్శి నగేష్‌రెడ్డి, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ముప్ప గంగారెడ్డి, ఎన్‌ఎస్‌యుఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు వేణురాజ్, పిసిసి డిసిసి ప్రధాన కార్యదర్శి జావిద్, నవీపేట్, రెంజల్, ఎడపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు సుధాకర్‌రావు, మోవీన్ ఖాన్, పులి శ్రీనివాస్, బోధన్ టౌన్ అధ్యక్షులు పాషాబాయ్, గంగాధర్ గౌడ్, సర్పంచులు శ్రీనివాస్, లాలు, నరేందర్ రెడ్డి, బోధన్ వర్కింగ్ ప్రెసిడెంట్ నరేందర్ రెడ్డి, అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఫర్హాన్, గోవర్ధన్, రవి, విష్ణు, గంగా కృష్ణ, సాయిబాబా, శేఖర్ కురుమ శ్రీను, కిరణ్, గయాసుద్దీన్, సలీం ఖలీద్, నవీపేట్ మండల ముఖ్య నాయకులు మోస్రా సాయిరెడ్డి, నేతి కుంట గోపాల్, భగవాన్ సంజీవరెడ్డి, పోశెట్టి, సాయిలు, షేక్ బాబా, బిక్కు, కిరణ్, రమేష్, ఆనంద్, కోస్లి సాయిలు, గోవర్ధన్ రెడ్డి, బాలచందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.