95వ అకాడమీ అవార్డుల వేడుక అమెరికా లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ అవార్డుల్లో ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ మూవీ అత్యధికంగా ఏడు ఆస్కార్ అవార్డులను గెలుచుకోవడం విశేషం. ఇక మనదేశానికి బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’, ఒరిజినల్ సాంగ్ విభాగంలో ‘ఆర్‌ఆర్‌ఆర్’లోని ‘నాటు నాటు…’ పాట ఆస్కార్ అవార్డులను దక్కించుకున్నాయి. ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ షార్ట్ ఫిల్మ్‌ను దర్శకురాలు కార్తికి గోన్సాల్వెస్ నిర్మాత గునీత్ మోగ్న రూపొందించారు.
ఇక ఈ వేడుకలో ఉత్తమ చిత్రంగా ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’ ఆస్కార్ అవార్డును అందుకోగా, ఉత్తమ దర్శకుడి అవార్డును ఈ చిత్ర దర్శకులు డానియల్ క్వాన్, డానియల్ స్కీనెర్ట్ అందుకున్నారు. ఇక ఉత్తమ నటుడిగా ‘ది వేల్’ చిత్రానికి గాను బ్రెండన్ ఫ్రేజర్, ఉత్తమ నటిగా ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’ చిత్రానికి గాను మిచెల్ యో ఆస్కార్ అవార్డులను సొంతం చేసుకున్నారు. జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన ‘అవతార్‌ః ది వే ఆఫ్ వాటర్’ చిత్రానికి ఆస్కార్ వరించింది. బెస్ట్ విజువల్ ఎఫెక్ట్ విభాగంలో ఈ చిత్రం ఆస్కార్ గెలుచుకుంది.