మన తెలంగాణ/హైదరాబాద్ : నేటి నుంచి స్వతంత్ర భారత వజ్రోత్సవాలు రాష్ట్రంలో అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి. ఇందుకు సర్వం సిద్దమైంది. పదిహేను రోజుల పాటు జరగనున్న ఈ వేడుకలను సోమవారం ఉదయం 11.30 గంటలకు సిఎం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ వజ్రోత్సవ వేడుకలకుగానూ ఇప్పటికే పలు ప్రభుత్వ భవనాలు, చారిత్రక కట్టడాలు, మ్యూజియంలను ప్రకాశవంతమైన రంగురంగుల విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. అవి త్రివర్ణ విద్యుత్ కాంతులతో దగదగలాడుతున్నాయి.
కాగా స్వాతంత్య్ర సమరం ఇతివృత్తంగా రాష్ట్రవ్యాప్తంగా కవి సమ్మేళనాలను, ముషాయిరాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. వనమహోత్సవం పేరుతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించి ఫ్రీడం పార్కులను ఏర్పాటు చేయనుంది. స్వాతంత్య్ర స్పూర్తిని రగలించే విధంగా పెద్దఎత్తున బెలూన్ల ప్రదర్శన, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో రక్తదాన శిబిరాలను దవాఖానాల్లో, అనాథ శరణాలయాల్లో, జైల్లల్లో, వృద్ధాశ్రమాలల్లో పండ్లు స్వీట్లు పంపిణీ చేసే కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రధాన బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఎయిర్ పోర్టులు, స్టార్ హోటల్లు, షాపింగ్ మాల్స్‌లలో ప్రత్యేకాలంకరణలను చేపట్టారు.
ఏర్పాట్లును పరిశీలించిన సిఎస్, డిజిపి ఇతర ఉన్నతాధికారులు
భారత స్వతంత్ర వజ్రోత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించే హెచ్‌ఐసిసిలో ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌తోపాటు పలువురు ఉన్నతాధికారులు మరోసారి పరిశీలించారు. డిజిపిమహేందర్ రెడ్డి, సిఎం ఒఎస్‌డి దేశపతి శ్రీనివాస్, మున్సిపల్ శాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ లతోపాటు వివిధ శాఖల ఉన్నతాధికారులతో కలసి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సిఎం కెసిఆర్ జాతీయ పతాకావిష్కరణతో ప్రారంభమయ్యే ఈ వేడుకలను అత్యంత ఘనంగా, దేశ భక్తి ఉట్టిపడే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్ చైర్మన్ లు, జెడ్పిటీసీలు, ఎంపిపిలు ఇతర ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారని తెలిపారు. దీని కోసం ఇప్పటికే ప్రతి ఒక్కరికీ ప్రత్యేక పాసులు జారీ చేశామన్నారు. జిల్లాల నుండి వచ్చే జెడ్పిటిసిలు, ఎంపిపి లకు నేరుగా రావడానికి ప్రత్యేకంగా వాహన సదుపాయాలను ఏర్పాటు చేశామన్నారు.
ఈ కార్యక్రమాల్లో భాగంగా 75 వీణ కళాకారులచే దేశ భక్తి గీతాల వాయిద్య ప్రదర్శన, స్వతంత్ర సమర యోధులను తలుచుకునే శాస్త్రీయ నృత్య ప్రదర్శన, ఫుజన్ డాన్స్ కార్యక్రమాలుంటాయని పేర్కొన్నారు. అనంతరం సిఎం సందేశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమాల నిర్వహణకు భారీ స్టేజిని ఏర్పాటు చేశామని వివరించారు. మార్గానికి చేరుకునే అన్ని దారులను జాతీయ జండాలతో అలంకణ పూర్తి అయిందన్నారు. నగరంలోని అన్ని జంక్షన్లను, ప్రభుత్వ కార్యాలయాలను విధ్యుత్ దీపాలతో అలంకరించి పండగ శోభ కలిగే విధంగా తీర్చిదిద్దే పనులు పూర్తి అయ్యాయన్నారు. సిఎస్‌తోపాటు జిఎడి కార్యదర్శి శేషాద్రి, సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర, పంచాయితీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ సుల్తానీయా, అడిషనల్ డిజి జితేందర్, ఇంటలిజెన్స్ అడిషల్ డిజి అనిల్ కుమార్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.
ప్రారంభోత్సవ కార్యక్రమ వివరాలు
ఉదయం11.30గంటలకు సిఎం కెసిఆర్ ప్రాంగణానికి చేరుకుంటారు. అనంతరం జాతీయ పాతాకావిష్కరణ,గాంధీజీ, భరతమాత విగ్రహాలకు పుష్పమాలాంకరణ జరగుతుంది. అనంతరం సాంస్కతిక కార్యక్రమాలు75 మంది వీణా కళాకారులచే
వీణా వాయిద్య ప్రదర్శన
సాండ్ ఆర్ట్ ప్రదర్శన , దేశ భక్తి ప్రబోధ నృత్య కార్యక్రమం, ఫుజన్ ప్రదర్శన, లేజర్ షో ఉంటుంది. అనంతరం సిఎంతో పాటు పలువురి నేతల ప్రసంగాలు ఉంటాయి.