Monday, December 23, 2024

దశాబ్ది ఉత్సవాలకు సర్వం సిద్ధం

- Advertisement -
- Advertisement -
  • ముస్తాబయిన కలెక్టరేట్
  • 22 వరకు వివిధ కార్యక్రమాలు
  • రేపు సంగారెడ్డికి హోం మంత్రి రాక

సంగారెడ్డి: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు సంగారెడ్డి జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు జిల్లాలో ఏర్పాట్లు జరిగాయి. సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా అంబరాన్ని తాకే విధంగా తెలంగాణ అవతరణ ఉత్సవాలను నిర్వహించేందుకు ఈ మేరకు కొద్ది రోజులుగా మంత్రి హరీశ్‌రావు ఉమ్మడి మెదక్ జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఏయే కార్యక్రమాలను ఏవిధంగా నిర్వహించాలన్న అంశంపై సూచనలిచ్చారు. ఈ మేరకు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరిగాయి. శుక్రవారం అవతరణ దినోత్సవం మొదలుకుని 20 రోజుల పాటు ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.

అంటే 22 వరకు వివిధ కార్యక్రమాలను భారీ ఎత్తున నిర్వహించనున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పథకాల లబ్దిదారుల వివరాలను దీని కోసం సేకరించారు. నియోజకవర్గాల వారీగా ఉత్సవాలు ఎలాంటి ఆటంకం కలగకుండా నిర్వహించేందుకు నియోజకవర్గ స్థాయి ప్రత్యేక అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల సమన్వయం ద్వారా దశాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. అందుకు అనుగుణంగా ఆయాశాఖల అధికారులకు బాధ్యతలు అప్పగించారు. మండల స్థాయిలో ఎంపిడిఓలు, తహశీల్దార్‌లు వ్యవసాయ అధికారులను కూడా భాగస్వాములను చేయడం ద్వారా ఎక్కడా ఎలాంటి లోటు పాట్లు లేకుండా చేస్తున్నారు.

రైతు వేదికలను అలంకరించడం, దశాబ్ది ఉత్సవాల లోగో ఏర్పాటు, ప్రభుత్వ పథకాల ప్రదర్శన,గీతాలాపనలు ఉండేలా చూస్తున్నారు. రైతు దినోత్సవాలకు రైతులు పెద్దఎత్తున తరలి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. పంటల ఉత్పత్తి, ముందస్తు వరి సాగు తదితర అంశాలపై రైతులకు అవగామన కల్పించాలన్నారు. రైతు బంధు లబ్ధిదారుల విజయాల గురించి కూడా వివరించబోతున్నారు. నాడు నేడు జరిగిన ప్రగతిని అందరికి అర్థమయ్యేలా వివరించాలని సూచించారు. ఇక శుక్రవారం సంగారెడ్డి కలెక్టరేట్‌లో రాష్ట్రావతరణ వేడుకలకు అంతా సిద్దమయింది.

రాష్ట్ర హోం శాఖ మంత్రి వేడుకలకు ముఖ్య అతిథిగా హజరవుతున్నారు. ఉదయం 8.30 గంటలకు హైదరాబాద్ నుంచి సంగారెడ్డి కలెక్టరేట్‌కు వస్తారు. తెలంగాణ తల్లికి పుష్పమాలంకరణ చేయడంతో పాటు అమర వీరుల స్థూపానికి నివాళులర్పిస్తారు. ఆ తర్వాత జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించిన అనంతరం జిల్లాలో జరిగిన ప్రగతిపై సందేశమిస్తారు. తర్వాత విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయి. దీని కోసం జిల్లా కలెక్టరేట్‌ను అందంగా ముస్తాము చేశారు. విద్యుద్ దీపాలతో అలంకరించారు. సంగారెడ్డి చౌరస్తా నుంచి పాత బస్టాండ్ వరకు డివైడర్‌లపై విద్యుత్ దీపాలను అమర్చారు. ఈ దీపాల వెలుగులో దశాబ్ది ఉత్సవాలకు కొత్త కళ వచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News