లక్నో: ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరో 24 గంటల్లో వెలువడనున్న నేపథ్యంలో ఎన్నికల్లో ఉపయోగించిన ఎలెక్ట్రానిక్ వోటింగ్ యంత్రాలలో(ఇవిఎంలు) అవకతవకలు చోటుచేసుకుంటున్నాయని సమాజ్‌వాది పార్టీ ఆరోపించింది. కాగా..ఇవిఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌రూము వెలుపల సమాజ్‌వాది పార్టీ కార్యకర్తలు పహరాను ముమ్మరం చేశారు. ఇవిఎంలను రవాణా చేసే ప్రక్రియలో ప్రొటోకాల్‌ను పాటించలేదని ఒక అధికారి ఒప్పుకున్న వీడియోను ఆ పార్టీ తన ట్విటర్ హ్యాండిల్‌లో అప్‌లోడ్ చేసింది. ఇవిఎంలు ట్యాంపరింగ్ అయ్యే అవకాశం లేకపోలేదని కూడా ఆ అధికారి ఆ వీడియోలో అంగీకరించారు.
అనేక జిల్లాలలో ఇవిఎంలలో అక్రమాలు చేసుకున్నట్లు తమకు ఫిర్యాదులు అందుతున్నాయని, ఇవి ఎవరి ఆదేశాల మేరకు జరుగుతున్నాయని సమాజ్‌వాది పార్టీ తన ట్వీట్‌లో ప్రశ్నించింది. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అధికారులపై ఒత్తిడి వస్తోందా.. దీనికి ఇసి దయచేసి వివరణ ఇవ్వాలి అంటూ ఆ పార్టీ నిలదీసింది. కగా..మంగళవారం ఆ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా ఇవిఎంలోని ఓట్లను చోరీ చేసేందుకు అధికార బిజెపి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఇవిఎంలను తీసుకువెళుతున్న ఒక వాహనాన్ని వారణాసిలో అధికార బిజెపి నేతలు అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు.