- తారుమారుకు ఆస్కారం లేనివి
- ఝార్ఖండ్‌లో సిఇసి జ్ఞానేశ్ కుమార్
రామ్‌గఢ్ (ఝార్ఖండ్): ఎలక్ట్రానిక్ వోటింగ్ యంత్రాలు (ఇవిఎంలు) ‘సురక్షితమైనవి’ అని, ‘తారుమారుకు ఆస్కారం లేనివి’ అని ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఇసి) జ్ఞానేశ్ కుమార్ శనివారం స్పష్టం చేశారు. భారత్‌లో వినియోగించే ఇవిఎంలను ఇంటర్నెట్, బ్లూటూత్ లేద ఇన్‌ఫ్రారెడ్‌తో అనుసంధానం చేయలేరని, వాటిని ఏవిధంగాను తారుమారు చేయడం సాధ్యం కాదని సిఇసి చెప్పారు. ఝార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లాలో మీడియా సిబ్బందితో జ్ఞానేశ్ కుమార్ మాట్లాడుతూ, ‘భారత్‌లో ఇవిఎంలను ఎన్నికల ప్రక్రియ కోసం ఉపయోగిస్తున్నాం. ఇవిఎంలపై చట్టపరమైన పరిశీలన జరిగింది. భారత్‌లో ఉపయోగించే ఇవిఎంలను ఇంటర్నెట్‌కు గాని, బ్లూటూత్‌కు గాని, ఇన్‌ఫ్రారెడ్‌కు గాని అనుసంధానం చేయజాలరు. ఇవిఎంలను ఏవిధంగాను దేనికీ అనుసంధానం చేయలేరు. అందువల్ల వాటితో తారుమారు చేయడం సాధ్యం కాదు. కనుక భారత ఇవిఎంలు భద్రమైనవి’ అని స్పష్టం చేశారు. ఐదు కోట్లకు పైగా వివిప్యాట్ స్లిప్‌లను లెక్కించినట్లు, ఎటువంటి వ్యత్యాసాల గురించీ ఇంత వరకు ఫిర్యాదులు రానట్లు ఆయన తెలియజేశారు. ఝార్ఖండ్‌లో మూడు రోజుల పర్యటన నిమిత్తం సిఇసి కుమార్ శుక్రవారం రాంచీ చేరుకున్నారు. సిఇసి శనివారం రామ్‌గఢ్‌లో ఎన్నికల అధికారులతో భేటీ జరిపారు. ‘ఇక్కడ రిటర్నింగ్ అధికారులు, వాలంటీర్లతో ముఖాముఖి సాగించాను. వారితో సమావేశం అనంతరం ఝార్ఖండ్‌లో ప్రజాస్వామ్యం పునాది బలంగా ఉందనే భావన నాకు కలిగింది’ అని ఆయన చెప్పారు. దేశంలో 18 ఏళ్లు నిండిన ప్రతి పౌరుడూ వోటర్ కావాలని సిఇసి పిలుపు ఇచ్చారు. ఎపిక్ కార్డులకు సంబంధించి అప్పీల్ ఏదీ జిల్లా ఎన్నికల అధికారి లేదా ముఖ్య ఎన్నికల అధికారి (సిఇఒ) వద్ద పెండింగ్‌లో లేదని, అంటే ఝార్ఖండ్‌లో వోటర్ల జాబితా పట్ల వోటర్లు, ఇతరులు 100 శాతం సంతృప్తితో ఉన్నారని అర్థం అని కుమార్ చెప్పారు.