Monday, January 20, 2025

మరోసారి ఇవిఎంల వివాదం

- Advertisement -
- Advertisement -

ఇవిఎంల వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. దేశంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల ద్వారా పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైన 1982 నుంచి వివాదాలు కొనసాగుతూనే వున్నాయి. తాజాగా సుప్రీం కోర్టు ఇచ్చిన నోటీసుపై మరోసారి ఇవిఎంల పని తీరుపై చర్చను లేవదీసింది. వచ్చే లోక్‌సభ ఎన్నికలకు ముందే ఇవిఎంలకు అనుబంధంగా ఉన్న వివిప్యాట్‌ల స్లిప్‌లను కూడా సమాంతరంగా లెక్కించాలని సుప్రీం కోర్టు ఎన్నికల సంఘాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. మే నెలలో జరగబోయే విచారణకు ముందు ఇసి తన నిర్ణయాన్ని ప్రకటించాలని సుప్రీంకోర్టు ఏప్రిల్ 1న జారీ చేసిన నోటీసులో పేర్కొన్నది.

అయితే ఇప్పటి దాకా కేంద్రం గాని, ఎన్నికల సంఘం గాని వివిప్యాట్‌లను కూడా ఇవిఎంలతో పాటు లెక్కిస్తామని ప్రకటించలేదు. దీనిపై కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ఆదేశానుసారమే ఎన్నికల సంఘం నడుచుకుంటున్నదని సుప్రీం కోర్టులో పిటిషన్ వేసిన పిటిషనర్ ఆరోపిస్తున్నారు. ఇప్పటి దాకా ఇవిఎంలో బ్లూ బటన్‌తో నొక్కిన ఓట్లను ఎలక్ట్రానిక్‌గా లెక్కిస్తున్నారు. ఇందులో పారదర్శకత, జవాబుదారీతనం లేదని పిటిషనర్‌తో పాటు పలు పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఇవిఎంతో పాటు వివిప్యాట్‌లో సీల్డ్ బాక్స్‌లో పడిన అన్ని ఓట్లను ప్రత్యక్షంగా లెక్కించాలని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇప్పటి దాకా ఇవిఎంలో నమోదైన మొత్తం ఓట్లను కాకుండా ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్‌కు ర్యాండమ్‌గా 5 శాతం ఓట్లనే నేరుగా లెక్కిస్తున్నారు.

In some places... the EVMs were struck

దీని వల్ల ఇవిఎంలలో గోల్‌మాల్ జరిగే అవకాశముందని 21 రాజకీయ పార్టీలు వాదిస్తున్నాయి. ఇవిఎంలను హ్యాక్ చేసి తమకు అనుకూలంగా తీర్పును మలుచుకునే అవకాశాలు ఉన్నందున వివిప్యాట్‌లను కూడా లెక్కిస్తే అనుమానాలు తీరుతాయని పార్టీలు చాలా కాలం నుంచి డిమాండ్ చేస్తున్నాయి. కేరళలోని పరూర్ అనే ప్రాంతంలో తొలిసారిగా ఇవిఎం మిషన్ల ద్వారా ఓటింగ్ ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం ప్రవేశపెట్టింది. అంతకు ముందు బ్యాలెట్లతోనే ఎన్నికలు జరిగేవి. దీని వల్ల ఖర్చుతో పాటు కౌంటింగ్ కూడా కష్టతరమవుతుందని, దీనికి బదులు ఓటర్లకు సౌలభ్యం, ప్రభుత్వానికి తక్కువ వ్యయంతో పోలింగ్ ప్రక్రియను పూర్తి చేయవచ్చనే భావనతో ఎన్నికల సంఘం ఇవిఎంలను ప్రవేశపెట్టింది. అయితే బాగా అభివృద్ధి చెందిన అమెరికా, జర్మనీ లాంటి దేశాల్లోనే పూర్తి స్థాయిలో కాకుండా 70 శాతం దాకా బ్యాలట్లతోనే పోలింగ్‌ను నిర్వహిస్తున్నారు.

కాని మన దేశంలోనే ఇవిఎంలతో 100 శాతం పోలింగ్ జరుపుతున్నారని, వీటిని ఏదో ఒక దశలో మార్చే అవకాశముందని వివిధ రాజకీయ పక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇవిఎం అంటే దీనికి ఒక కంట్రోల్ యూనిట్, బ్యాలటింగ్ యూనిట్, దానికి అనుబంధంగా వివిప్యాట్ ఉంటుంది. ఒక ఓటర్ పోలింగ్ బూత్‌లోకి వెళ్ళిన తర్వాత ఇవిఎంపై బ్లూ బటన్‌ను నొక్కి తనకు నచ్చిన అభ్యర్థికి, పార్టీకి ఓటు వేయవచ్చు. పక్కనే వివిప్యాట్‌లో ఓటర్‌కి తాను ఏ పార్టీకి, అభ్యర్థికి ఓటు వేశానో 7 సెకెన్ల పాటు దృశ్య రూపంలో కనిపిస్తుంది. ఆ తర్వాత ఆ వివిప్యాట్ స్లిప్ ఆటోమేటిక్‌గా ముద్రణ అయిన తర్వాత సీల్డ్ బాక్స్‌లోకి వెళుతుంది. అయితే ఇందులో పడిన అన్ని ఓట్లను ఎన్నికల సంఘం లెక్కించడం లేదు. ఇవిఎం బటన్ల ద్వారా నొక్కిన ఓట్లను లెక్కించి ర్యాండమ్‌గా ఓటర్ వేసిన ఓట్లు సరైనవా కాదా అని నిర్ధారించడానికి 5 శాతం మాత్రమే స్లిప్‌లను లెక్కిస్తున్నారు.

ఈ యంత్రాలను ప్రభుత్వ రంగంలోని బిఇఎల్, ఇసిఐఎల్‌లు ఉత్పత్తి చేసి ఎన్నికల సంఘానికి సరఫరా చేస్తున్నాయి. విద్యుత్ అవసరం లేకుండా మారుమూల పల్లెల్లో కూడా బ్యాటరీతో నడిచే యంత్రాలలోని ఓట్లను తారుమారు చేస్తున్నారని, ముఖ్యంగా దేశంలో గడిచిన పదేళ్లుగా అధికారంలో ఉన్న బిజెపి సెలెక్టివ్‌గా ట్యాంపర్ చేస్తున్నదని సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్‌లో పార్టీలు, కొందరు పిటిషనర్లు ఆరోపించారు. పూర్తి పారదర్శకతతో ఓటర్ తీర్పు తారుమారు కాకుండా ఉండాలంటే ఎలక్ట్రానిక్ రూపంలోనే కాకుండా వివిప్యాట్‌ల స్లిప్‌లను కూడా లెక్కించి బేరీజు వేస్తే తీర్పులో గోల్‌మాల్ జరిగే అవకాశం లేదనే పిటిషన్‌పై సుప్రీం కోర్టు మొత్తం పిటిషన్ పూర్వాపరాలను విచారించిన తర్వాత వివిప్యాట్‌లను కూడా లెక్కించాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది.

అయితే కేంద్ర ప్రభుత్వం, ఇసి సుప్రీం కోర్టు ఆదేశంపై తమ నిర్ణయం ఏమిటి అనేది తెలియజేయాలి. నిజానికి ఇవిఎంలలో గోల్‌మాల్ లేదనుకుంటే కేంద్రం వివిప్యాట్‌ల లెక్కింపునకు ఇసికి ఆదేశాలు ఇవ్వాలి. కాని ఆదేశాలు ఇసికి అందుతాయా లేదా ఇసి నిర్ణయం బయటికి వస్తుందా లేదా అనే సందేహాలు సర్వత్రా నెలకొన్నాయి. ఇవిఎంలను ప్రవేశపెట్టిన నాటి నుంచి ఏదో ఒక వివాదం చుట్టుముడుతూనే ఉన్నా కేంద్రం, ఎన్నికల సంఘం ఇవిఎంలతోనే ఎన్నికల ప్రక్రియను కొనసాగిస్తుండడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News