న్యూఢిల్లీ : పోలింగ్‌లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు (ఈవిఎం) హ్యాకింగ్‌కు గురవుతున్నాయంటూ టెస్లా సీఈఒ ఎలాన్ మస్క్ చేసిన ఆరోపణలు దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. అయితే ఈ వ్యవహారంపై తాజాగా కాంగ్రెస్ నేత శ్యామ్ పిట్రోడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈవీఎం మిషన్లను హ్యాక్ చేయడానికి, ఫలితాలను తారుమారు చేయడానికి అవకాశం ఉన్నట్టు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. “ఎలక్ట్రానిక్స్, ఐటీ, సాఫ్ట్‌వేర్, కాంప్లెక్స్ సిస్టంల రంగాల మీద సుమారు అరవై ఏళ్ల పాటు నేను పనిచేశాను. అదే విధంగా నేను ఈవీఎం యంత్రాల వ్యవస్థను కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేశాను.
ఈవీఎంలను హ్యాక్ చేయటం సాధ్యం అవుతుంది. దీనివల్ల ఫలితాలు మారిపోతాయి.ఇలాంటి సమయంలో సంప్రదాయ పాత బ్యాలెట్ ఓటింగ్ విధానమే చాలా ఉత్తమమైనది. ఓట్ల ప్రక్రియలో ఎటువంటి అవకతవకలు జరగవు. బ్యాలెట్ విధానాన్నే ఎన్నికల్లో అనుసరించాలి” అని అన్నారు. పోలింగ్‌లో ఉపయోగించే ఈవీఎం మిషన్లతోపాటు , వీవీప్యాట్ స్లిప్స్ కోసం వీవీ ప్యాట్ యంత్రాలు కూడా అమర్చబడి ఉన్నాయి. వీవీప్యాట్ యంత్రాల సాయంతో కూడా ఈవీఎంలను హ్యాక్ చేయడానికి అవకాశం ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది ” అని అన్నారు.