నాగర్‌కర్నూల్ ః ప్రతి ఈవిఎంను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. వాటిల్లో ఏ దశలోనే ఎటువంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రానున్న ఎన్నికల కోసం నిర్వహిస్తున్న ఈవిఎంల మొదటి స్థాయి తనిఖీని, ఈవిఎంలను భద్రపరిచే తీరును, ఈవిఎం గోడౌన్‌ను శనివారం కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నాగర్‌కర్నూల్ జిల్లాలో వివిధ రాజకీయ పార్టీల సమక్షంలో ఈవిఎంల మొదటి స్థాయి తనిఖీని చేపట్టారు. ఈవిఎంల గోడౌన్‌లోకి వెళ్లి ఈవిఎం బ్యాలెట్ యూనిట్, కంట్రోలింగ్ యూనిట్, వివి పాట్ యంత్రాలను మొదటి దశలో పరిశీలించారు. ఈవిఎంలను భద్రపరిచే గదిని, సమస్యలు తలెత్తిన ఈవిఎంలను వేరుగా భద్రపరిచే విధానాన్ని, భద్రతా సిబ్బంది నిబంధనలను, బ్యారికేడింగ్ విధానాలను కలెక్టర్ పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట ఎన్నికల విభాగం డిటి రాఘవేందర్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.