Thursday, January 23, 2025

ఆర్థిక కోటాకు విజయం!

- Advertisement -
- Advertisement -

ఆర్థికంగా వెనుకబడిన వర్గాల(ఇడబ్లుఎస్) కు కల్పించిన 10 శాతం రిజర్వేషన్లు రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధం కావని, అవి చెల్లుబాటు అవుతాయని ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సోమవారం నాడు ఇచ్చిన మెజారిటీ (3:2) తీర్పు అనేక కోణాల్లో ప్రత్యేకమైనది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ, విద్యా రంగంలోనూ 10 శాతం ఇడబ్లుఎస్ రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రధాని మోడీ ప్రభుత్వం 2019లో పార్లమెంటులో బిల్లును ఆమోదింప చేసుకున్నది. ఇందుకోసం రాజ్యాంగం 15, 16 అధికరణలకు 6వ క్లాజును చేర్చింది. మైనారిటీ విద్యా సంస్థలు మినహా ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ ప్రైవేటు బడుల్లో కూడా ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయని చెప్పింది. దానితో రూ. 8 లక్షల మేరకు వార్షికాదాయం కలిగిన వారు ఈ రిజర్వేషన్లకు అర్హులని నిర్ణయించారు. ఇప్పటికే రిజర్వేషన్లు పొందుతున్న ఎస్‌సి, ఎస్‌టి, బిసిలలోని పేదలు ఈ రిజర్వేషన్లకు అనర్హులని ఈ బిల్లు పేర్కొన్నది.

ఇది చట్టం అయిన వెనువెంటనే రాజ్యాంగ విహితం కాదంటూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. రిజర్వేషన్లు అన్నీ కలిసి 50 శాతం మించరాదన్న సుప్రీంకోర్టు నియమానికి ఈ సవరణ విరుద్ధమని పేర్కొంటూ డిఎంకె మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. రిజర్వేషన్లు అనేవి కులం ఆధారంగా ఇవ్వదగినవే గాని, వ్యక్తి ఆర్థిక స్థితి పై ఆధారపడి కేటాయించదగినవి ఎంత మాత్రం కాదని డిఎంకె తన పిటిషన్‌లో పేర్కొన్నది. ఈ చట్టం మీద స్టే ఇవ్వడానికి నిరాకరించిన సుప్రీంకోర్టు పిటిషన్లను విచారణకు స్వీకరించడానికి 2019 ఫిబ్రవరి 8న అంగీకరించింది. 2020 ఆగస్టులో ఈ కేసును ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించారు. ఈ ధర్మాసనంలో న్యాయమూర్తులు యుయు లలిత్ (ప్రస్తుత భారత ప్రధాన న్యాయమూర్తి), దినేశ్ మహేశ్వరి, బేలా త్రివేది, జెబి పార్దివాలా, ఎస్ రవీంద్ర భట్ వున్నారు. ఇందులో న్యాయమూర్తులు మహేశ్వరి, త్రివేది, పార్దివాలాలు 103వ సవరణ చెల్లుబాటు అవుతుందని తీర్పు ఇవ్వగా, అందుకు విరుద్ధమైన తీర్పును న్యాయమూర్తులు లలిత్, రవీంద్ర భట్‌లు ఇచ్చారు.

అందువల్ల 103వ రాజ్యాంగ సవరణ చెల్లుబాటు అవుతుంది. అంతేకాదు అది రాజ్యాంగ మౌలిక స్వరూపానికి అనుగుణమైనదే అని మెజారిటీ తీర్పు స్పష్టం చేయడం వల్ల సాంఘికంగా, విద్యా విషయకంగా వెనుకబడిన వర్గాలకు మాత్రమే రిజర్వేషన్లు వర్తిస్తాయన్న పరిమితి తొలగిపోతుంది. ఎస్‌సి, ఎస్‌టిల, సాంఘికంగా, విద్యా విషయకంగా వెనుకబడిన ఇతర తరగతుల అభివృద్ధి కోసం ప్రత్యేక సదుపాయాలను కల్పించడానికి భారత రాజ్యాంగంలోని 15 (4) అధికరణం వీలు కల్పిస్తున్నది. పర్యవసానంగా ఇంత వరకు ఆ వర్గాలకు మాత్రమే రిజర్వేషన్లను కల్పిస్తూ వచ్చారు. కుల వ్యవస్థ వల్ల బాధితులై శతాబ్దాలుగా అక్షరానికి దూరమైన వారిని సామాజిక అధోగతి నుంచి బయటకు తీసుకు రావడానికే రిజర్వేషన్లు అనే స్థితి ఇంత వరకు కొనసాగుతూ వచ్చింది. తాజా తీర్పుతో విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు కులంతో నిమిత్తం లేదని ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు సైతం అర్హులేనని రూఢి అవుతున్నది. అన్ని రిజర్వేషన్లూ కలిపి 50 శాతానికి మించరాదని సుప్రీంకోర్టు 1992లో విధించిన హద్దును కూడా ఈ తీర్పు చెరిపి వేస్తున్నది. ఆర్థికంగా వెనుకబడిన వారికి కల్పించిన 10 శాతం రిజర్వేషన్లను కలిపితే మొత్తం రిజర్వేషన్లు 59.5 శాతానికి చేరుకున్నాయి.

అందుచేత 50 శాతం పరిమితి ఇక చెల్లుబాటుకు నోచుకోలేదు. ఈ కేసు విచారణ సందర్భంగా మూడు ప్రధానాంశాలు ముందుకు వచ్చాయి. అందులో మొదటిది 103వ సవరణ రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధమా? రెండవది ఇడబ్లుఎస్ కోటా నుంచి ఎస్‌సి, ఎస్‌టి, బిసిలలోని పేదలను మినహాయించడం మౌలిక స్వరూపానికి విరుద్ధమా? 50 శాతం పరిమితిని ఉల్లంఘించడం కూడా మౌలిక స్వరూపానికి ఉల్లంఘనేనా? మెజారిటీ తీర్పు ఇచ్చిన ముగ్గురు న్యాయమూర్తులు ఈ మూడు అంశాలూ మౌలిక స్వరూపానికి ఎంత మాత్రం విరుద్ధం కావని స్పష్టం చేశారు. మెజారిటీకి భిన్నంగా తీర్పులు ఇచ్చిన ఇద్దరు న్యాయమూర్తులు ఆర్థిక ప్రాతిపదికగా రిజర్వేషన్లు ఇవ్వడాన్ని తప్పు పట్టలేదు, కాని వాటి నుంచి ఎస్‌సి, ఎస్‌టి, బిసిలలోని పేదలను మినహాయించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. 103వ సవరణ రాజ్యాంగం నిషేధించిన వివక్షను పాటిస్తున్నదని వారు అభిప్రాయపడ్డారు. 50 శాతం హద్దు తొలగిపోయినందున ఇక నుంచి మరి కొన్ని వర్గాలకు కూడా రిజర్వేషన్లు కల్పించుకొనే అవకాశం ఏర్పడుతుంది. ఆ వర్గాల నుంచి ఆ డిమాండ్ ఊపు అందుకుంటుంది. తమిళనాడులో అమల్లో వున్న 69 శాతం రిజర్వేషన్లకు ఆక్షేపణ తొలగిపోతుంది. మొత్తానికి సామాజిక సోషలిజం లక్షంగా సాగిన రిజర్వేషన్ల చరిత్ర ఇప్పుడు కొత్త మలుపు తిరుగుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News