Wednesday, January 22, 2025

ఇడబ్ల్యుఎస్‌తో శాశ్వత అసమానతలు

- Advertisement -
- Advertisement -

భారతదేశం విభిన్న కులాలు, మతాలు, సంస్కృతులు, భాషలతో మిళితమైనది. కుల వ్యవస్థ సామాజిక వ్యవస్థగా ఉన్న ఈ దేశంలో మెజారిటీ కులాలకు అంటే బహుజనులైన షెడ్యూల్డ్ క్యాస్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్, వెనుకబడిన తరగతుల వారికి విద్యను, సంపదను సామాజిక గౌరవాన్ని, రాజకీయ ప్రవేశాన్ని నిషేధించి తరతరాల బానిసలుగా, అంటరానివారిగా అణచివేయబడ్డారు. ఈ కాలంలో 100కు 100 శాతం రిజర్వేషన్లపై కేవలం ఎస్‌సి, ఎస్‌టి, బిసి కులాలు కానటువంటి మిగిలిన ఇతర కులాలవారు అంటే ఇప్పు డు అగ్రకులాలుగా చలామణవుతున్నవారు మాత్రమే గుత్తాధిపత్యాన్ని చలాయిస్తూ, అనుభవిస్తూ వస్తున్నారు.

భారత రాజ్యాంగాన్ని 1950 జనవరి 26న దేశ ప్రజలు ఆమోదించుకున్న క్రమంలో ప్రపంచంలో మొట్టమొదటి సారిగా వెనుకబాటుతనం (Back wardness) అనే పదాన్ని సృష్టించిన రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ భారతదేశంలో సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన కులాలను గుర్తించి వారి వెనుకబాటుతనాన్ని ప్రామాణికంగా తీసుకుని ఆర్టికల్ 15, 16 ప్రకారం అణచివేయబడ్డ అంటరాని కులాలకు వారివారి జనాభా దామాషా ప్రకారం ప్రాతినిధ్యం (రిజర్వేషన్) ఎస్‌సి, ఎస్‌టిలకు ఇవ్వటం జరిగింది. తదుపరి 1979 లో వేసిన బిపి మండల్ కమిషన్ రిపోర్ట్ ప్రకారం వెనుకబడిన కులాల వారికి 1990 నుండి రెప్రజెంటేషన్ ఇవ్వటం జరుగుతుంది. ప్రస్తుతం ఒసి (Other Communiti es) అంటే ఇతర కులాలుగా చెప్పుకుంటున్న వారిలో పేదలు ఉన్నారని ఎటువంటి సర్వే కానీ, కమిషన్ కానీ, పరిశోధన కానీ చెయ్యకుండానే దేశ చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా కేవలం ఒక్క రోజులోనే పార్లమెంటు ఉభయ సభల్లో రాజ్యాంగ (103వ సవరణ) చట్టం 2019ను ఆమోదించి తర్వాతి రోజు రాష్ట్రపతిచే ఆర్థిక బలహీన వర్గాలకు (ఇడబ్లుఎస్) రిజర్వేషన్ గెజిట్ విడుదల చేసి వెనువెంటనే అమ లు చేయాలని కేంద్ర, రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేశారు.

రాజ్యాంగంలో వెనుగుబాటుతనం ప్రామాణికంగా తీసుకుంటే ఇక్కడ పేదరికాన్ని ప్రామాణికంగా తీసుకుని రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరించినట్లు ఉంది. వెనుకబాటుతనానికి, పేదరికానికి మధ్య తేడాను పరిశీలిస్తే వెనుకబాటుతనం అనేది కుల వ్యవస్థలో భాగంగా సామాజిక రుగ్మతతో తరతరాలు వారసత్వంగా వస్తూనే ఉంటుంది. దీనికి అంతంలేదు. కానీ మరో పక్క పేదరికం అనేది కొన్ని సంవత్సరాల తరువాత మారి ధనికులు అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే 1996లో ఇతర కులాలలో పేదరికం అధ్యయనం చేయడానికి మేజర్ ఎస్‌ఆర్ సిన్హా కమిటీ వేస్తే ఆ కమిటీ పేదరికం ప్రాతిపదికగా రిజర్వేషన్ ఇవ్వటం కుదరదని, వారికి కొన్ని సంక్షేమ పథకాలను కల్పించి వారి జీవన స్థితిగతులను మెరుగుపరచవచ్చు అని ప్రతి ప్రతిపాదించారు.

రాజకీయంగా వారి రాజకీయ లబ్ధి కోసం నిర్ణయాలు తీసుకుంటే కోర్టులలో అవి నిలబడవు అని, కోర్టులు కొట్టివేస్తాయని ప్రజల నమ్మకం. కానీ అందుకు విరుద్ధంగా 8 నవంబర్ 2022న దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఐదుగురు జడ్జీలు గల ధర్మాసనంలో 3:2 నిష్పత్తిలో ఇడబ్ల్యుఎస్ రిజర్వేషన్స్ రాజ్యాంగ అనుకూలమేనని సమర్థించటం దేశంలో పెద్ద చర్చకు దారితీసింది. ఇదే అత్యున్నత న్యాయస్థానం రిజర్వేషన్ల వాటా 50 శాతం దాటకూడదని ఇంద్రసహాణీ కేసులో 1992లో తీర్పునిస్తూ రిజర్వేషన్స్‌కు ఆర్థిక అంశాలను ప్రామాణికంగా తీసుకోలేమని మండల్ కమిషన్ రిపోర్ట్ ప్రకారం 52 శాతం జనాభా ఉన్న ఒబిసిలకు రిజర్వేషన్లను కేవలం 27 శాతానికి కత్తిరించారు.

ఇప్పుడు అదే అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును తుంగలో తొక్కి పేదరికాన్ని ప్రామాణికంగా తీసుకుని ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసి కులా లు కాకుండా మిగిలిన ఇతర కులాలలో ఉన్న పేదలకు మాత్రమే వర్తించే విధంగా చేసిన రాజ్యాంగ (103వ సవరణ)చట్టం 2019 ఇడబ్ల్యుఎస్ 10% కోటాను సమర్ధించింది. దేశంలో గత రెండు దశాబ్దాలుగా నిరుద్యోగ వృద్ధి, ఆర్థిక అభద్రతాభావం పెరుగుతూ కుల ప్రాతిపదికన సంపద అసమానతలు తీవ్రమవుతున్నందున దీనిపై పునః సమీక్షించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత సమకాలీన సమాజంలోఉన్న అసమానతలు ఒక్కరి జీవిత కాలంలో ఉత్పన్నమైనవి కావు అదే విధంగా వివిధ అంతరాలుగా విడిపోయి ఉన్న కులాలు వారి సామర్థ్యం ఆశయం కృషి వల్ల కాదు అది కేవలం వారసత్వాలు. విద్య, సామాజిక, ఆర్థిక, రాజకీయ వెనుకబాటుతనాల అసమానతలు తరతరాలుగా కులం ఆధారంగా, వారసత్వంగా బదిలీ చేయబడుతున్నాయి.

ఆర్థిక స్థితిగతులను కోలవటానికి సంపద మెరుగైన కొలమానం. సంపదను కులం వారసత్వ సంపదగా ఎలా బదిలీ చేస్తుందో 2021 లో విడుదల చేసిన ఆలిండియా అప్పు (debt), పెట్టుబడి (investment) సర్వే 2019ను పరిశీలిస్తే అర్థమవుతుంది. భూమి, పశువులు, భవనాలు వ్యవసాయ యంత్రా లు, రవాణాతో పాటు ఆర్థిక విషయాలైన షేర్స్ డిపాజిట్స్, గృహస్థులు స్వీకరించదగిన మొత్తం ఆదాయం పరిగణనలోకి తీసుకుని చేసిన సర్వేలో భారత దేశంలో అసమానతలు 1990 నుండి 2020 మధ్య బాగా పెరిగినాయి మరి ముఖ్యంగా 2000 సంవత్సరం తర్వాత మొదటిగా సంపద వ్యత్యాసాలు రెండవదిగా ఆదాయం, వినియోగ అసమానతలు విపరీతంగా పెరుగుతూ పోతున్నాయి. సంపద అసమానతలు గిని సూచికలో (gini index) (ఒక దేశం లేదా ఒక ప్రాంతంలో ఆర్థిక అసమానతల తీరును విశ్లేషించే సూత్రం ‘0’ ఉంటే సమాన పంపిణీ జరిగినట్లు) 1992లో 0.62గా 2002లో 0.63 గా 2012లో 0.67 గా, 2019లో 0.69 గా పెరుగుతూ ఉన్నాయి. భారత దేశంలో సగటు తలసరి ఆదాయం 2019లో ఇతర కులాలలో అంటే ఒసిలలో రూ. 8,03,977గా, ఒబిసిలలో రూ. 4,09,792 గా, ఎస్‌సిలలో రూ. 2,28,388గా, ఎస్‌టిలలో రూ. 2,32,349 గాను ఉంది. సరాసరిన ఒసి కులాల సంపద ఎస్‌టిలకంటే నాలుగు రెట్లు ఎక్కువగాను ఎస్‌సిల కంటే మూడు రెట్లు ఎక్కువగాను ఒబిసిల కంటే రెండు రెట్లు ఎక్కువగా ఉన్నది.

దేశం మొత్తం సంపదలో 45 శాతం ఒసిల ఆధీనంలో 40% ఒబిసిల ఆధీనంలో కేవలం 10% ఎస్‌సిల ఆధీనంలో 5% ఎస్‌టిల ఆధీనంలో ఉన్నది. ఒసి కులాలు సంపదలో మెజార్టీ భాగాన్ని పొందటమే కాకుండా అగ్ర క్వింటైల్ (quintile) కూడా అసమానంగా కేంద్రీకృతమై ఉన్నాయి. అగ్ర క్వింటైల్ 55% సంపద ఒసిల ఆధీనంలోనూ 36% సంపద ఒబిసిల ఆధీనంలోనూ 5% ఎస్‌సిల ఆధీనంలోనూ 3% ఆదివాసీల ఆధీనంలోనూ దేశంలో వారివారి కులాల నిష్పత్తికి విరుద్ధంగా సంపదలు కేంద్రీకృతమై ఉన్నాయి. దీనికి వ్యక్తిగత ఆదాయాలు లేక పొదుపులు బట్టి కాకుండా చారిత్రక వారసత్వ సంపద అసమానతలు కొనసాగుతున్నాయి ఇది దేశ సామాజిక వ్యవస్థలో మెజారిటీ కులాలను అంటే బహుజనులను సమస్తాగతంగా బహిష్కరించడమే కారణం.

సంపద అంతరానికి మూలం చరిత్రాత్మకమైనది, వారసత్వంగా వచ్చినది. వీటిలో ముఖ్యంగా సంపద 60%, భూమి 22%, భవనాలు 7%, ఇందులో కూడా భూమి, భవనాలు ఎక్కువగా వారసత్వంగా సంక్రమిస్తున్నాయి ముఖ్యంగా భూ అసమానత బ్రిటిష్ వలస రాజ్యాల కాలం వరకు సుదీర్ఘ చరిత్రను కలిగి ఉన్న వలస రాజ్యాల జోక్యంతో భూ యాజమాన్య హక్కులు కొన్ని ఒసి కులాలకు మాత్రమే దక్కాయి వలస రాజ్యాల తరువాత కూడా భూమి వారి కబంధ హస్తాల్లో ఉంటూ 1990లో వచ్చిన రియల్ ఎస్టేట్ బూమ్ వల్ల రేట్లు పెరిగి వారి సంపద బిల్డింగ్స్ రెట్టింపు చేసుకుంటూ విలువను పెంచుకుంటున్నారు. ఈ విధంగా అసమానతలు మరింతగా పెరిగిపోతూ ఉన్నాయి.ఈ విధంగా సంపద కులం ఆధారంగా వారసత్వంగా కొనసాగించబడుతున్నప్పుడు కుల తటస్థ లేక కులాన్ని విస్మరించిన ప్రభుత్వ విధానమైన ఇడబ్ల్యుఎస్ వారసత్వంగా వస్తున్న అసమానతలను ఎలా రూపుమాపుతుంది.

ప్రభుత్వ గణాంకాల ప్రకారం దేశంలో నిరుపేదరికాన్ని అనుభవిస్తున్న వారు ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసి, మైనారిటీలు అయితే ఆర్థికంగా బలహీన వర్గాలలో వీరిని తీసుకోకపోవడం పట్ల ఉద్దేశపూర్వకంగా వివక్ష చూపటమే అవుతుంది. సామాజికంగా, విద్యాపరంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా అభివృద్ధి చెందిన వారికి ఇడబ్ల్యుఎస్ క్రింద 10% వాటా ఇవ్వటం కూడా ఉద్దేశపూర్వకంగానే దోచిపెట్టడం అవుతుంది. రిజర్వేషన్స్ అంటే పేదరిక నిర్మూలన పథకం కాదు. అవి శతాబ్దాల సూక్ష్మ వాదనలను తిరస్కరించటం, నిశ్చయాత్మక చర్య అన్న డా. అంబేడ్కర్ మాటలను పెడచెవిన పెడితే భవిష్యత్తులో మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసిలకు కేవలం రిప్రజెంటేషన్ ద్వారా మాత్రమే విద్య, ఉద్యోగ అవకాశాలను పొందటానికి మార్గము అవి కూడా అరకొరగానే అమలవుతున్నాయి.

కానీ వారికి సంవత్సర ఆదాయం రూ. 2,50,000 లకు పైన ఉంటే వారు అనర్హులు. కాని ఇడబ్ల్యుఎస్ కోటా ప్రకారం ఒసి కులాలకు చెందినవారు సంవత్సరానికి రూ. 8,00,000 ఆదాయం, 5 ఎకరాల లోపు వ్యవసాయ భూమి, 1000 చదరపు అడుగుల ఇల్లు, 100 చదరపు యాడ్స్‌లో స్థలంలోపు ఉన్నవారు కూడా అర్హులుగానే ప్రకటించారు. అంటే భారతదేశంలో కులాన్ని బట్టి పేదరిక ప్రమాణాలు మారిపోతున్నాయి. ఇదే కొనసాగితే భవిష్యత్తులో సామాజిక విద్య ఆర్థిక రాజకీయ సాంస్కృతిక అసమానతలు శాశ్వతంగా ఉండిపోతాయి. కావున భారత రాజ్యాంగ పీఠికలో నిర్దేశించిన లక్ష్యాలైన సామాజిక రాజకీయ ఆర్థిక సమానత్వం కోసం రాజ్యాంగ విలువలకు విరుద్ధంగా తీసుకొచ్చిన రాజ్యాంగ (103వ సవరణ) చట్టం 2019ను వెనుకకు తీసుకుంటే మంచిది. ఇంత పెద్ద సామాజిక ఆర్థిక విపత్తు సంభవించడానికి కారణం దేశంలో మెజారిటీ బహుజనులైన ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసిలకు ఉన్నత న్యాయస్థానాలైన రాష్ట్ర హైకోర్టులలో, సుప్రీంకోర్టులో, ప్రధాన రాజకీయ పదవులైన రాష్ట్ర ముఖ్యమంత్రి, దేశ ప్రధాన మంత్రులకు రిప్రజెంటేషన్ లేదు.

అదే విధంగా దేశం కోసం సరిహద్దుల్లో ప్రాణాలు ఇస్తున్న సైనికులు అందరూ బహుజనులే అయినప్పటికీ రక్షణ రంగంలోనీ కీలక పదవులకు ఎస్‌సి, ఎస్‌టి, బిసిలకు రిప్రజెంటేషన్ లేదు అని తెలుసుకుంటే బహుజనుల చైతన్యం మరో సామాజిక ఉద్యమానికి నాంది పలుకుతుంది. ఏ సమాజంలోనైనా అసమానత స్థాయికి ప్రధాన కారణం రాజకీయ విధానం ఎందుకంటే థామస్ పికేటి చెప్పినట్లు ‘చరిత్రలో సంపద పంపిణీ ఎప్పుడు లోతైన రాజకీయంగా ఉంది దానిని ఆర్థిక యంత్రాంగంతో తగ్గించలేము’. భారతదేశ సమాజం వివిధ కులాలతో నిండి ఉన్న కుల సమాజం కాబట్టి దేశ జనాభా లెక్కలను కులాల వారీగా లెక్కించి దేశ సంపదలో అందరికీ సమాన వాటానిస్తూ, అన్ని రంగాలలో వారి వారి కులాల జనాభా దామాషా ప్రకారం అంటే ఒసిలకు 15%, ఒబిసిలకు 52%, ఎస్‌సిలకు 15%, ఎస్‌టిలకు 8%, మతం మార్చుకున్న మైనారిటీలకు 10% రిప్రజెంటేషన్ ప్రజాస్వామ్యబద్ధంగా ఇవ్వటం ద్వారా అందరికీ సమాన అవకాశాలు దక్కి అందరూ దేశ అభివృద్ధిలో భాగస్వాములు అవుతూ సమ సమాజ నిర్మాణం దిశగా పయనిస్తూ ప్రపంచంలోనీ అగ్ర దేశాల సరసన భారతదేశాన్ని నిలబడతారు.

డా బోరుగడ్డ సుబ్బయ్య
9492704401

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News