కూటికి గతిలేనివాడు చోరీ చేశాడంటే పోనీలే అనుకోవచ్చు. ముఖ్యమంత్రిగా పనిచేసిన పెద్దమనిషే చౌర్యానికి పాల్పడితే ఏమనాలి? కర్ణాటకలో అదే జరిగింది. మాజీ ముఖ్యమంత్రి హెచ్ డి కుమారస్వామి దీపావళి సందర్భంగా తన ఇంటికి వీధిలో ఉన్న ఓ కరెంటు పోల్ నుంచి అక్రమ కనెక్షన్ తో విద్యుత్ తీసుకున్నారు. దీనిని గమనించిన కొందరు.. సోషల్ మీడియాలో ఫోటోలతో సహా పోస్టులు పెట్టడంతో మాజీ ముఖ్యమంత్రిగారి నిర్వాకం బయటపడింది. దీంతో బెస్కోమ్ (బెంగళూరు ఎలక్ట్రిసిటీ సప్లయ్ కంపెనీ లిమిటెడ్) అధికారులు రంగంలోకి దిగి, కుమారస్వామిపై కేసు నమోదు చేశారు. అంతేకాదు, కుమారస్వామి ఇంటికి వెళ్లి విద్యుత్ చౌర్యం జరిగిన మాట నిజమేనని నిర్ధారించుకుని, వారం రోజుల్లోగా 68 వేల రూపాయల జరిమానా కట్టాలంటూ నోటీసులు జారీ చేశారు.
విద్యుత్ చౌర్యం గురించి సోషల్ మీడియాలో పోస్టులు రాగానే, కుమారస్వామి పరిస్థితి కుడితిలో పడిన ఎలుకలా మారింది. మింగలేక కక్కలేక సతమతమయ్యారు. చివరకు జరిగిన సంఘటనపై విచారం వ్యక్తం చేస్తూ ఓ ప్రకటన జారీ చేశారు. ఇది తనకు తెలియకుండా జరిగిందనీ, దీపావళి పండుగకు ఇంటిని అలంకరించే పని చేపట్టిన కాంట్రాక్టర్ నిర్వాకమని పేర్కొన్నారు. పైగా ఆ సమయంలో తాను బెంగళూరులో లేరని చెప్పారు. ఇదంతా కాంగ్రెస్ ఆడుతున్న నాటకమని, తాను చట్టపరంగా ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవడానికైనా సిద్ధమని తెలిపారు.