న్యూఢిల్లీ: హర్యానాకు చెందిన మాజీ కాంగ్రెస్ నాయకుడు కుల్దీప్ బిష్ణోయ్ తన భార్య రేణుక బిష్ణోయ్‌తో కలసి గురువారం బిజెపిలో చేరారు. హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ కుమారుడైన కుల్దీప్ బిష్ణోయ్ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ఎంపీగా పనిచేశారు. ఆయన భార్య రేణుక కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సమక్షంలో బిష్ణోయ్ దంపతులు కాషాయ కండువా కప్పుకున్నారు. బిష్ణోయ్ రాక రాష్ట్రంలో తమ పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేస్తుందని ముఖ్యమంత్రి ఖట్టర్ ఈ సందర్భంగా తెలిపారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో బిష్ణోయ్ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని, బిజెపిని బలపరిచారని ఆయన అన్నారు. దేశం గురించి, పేదల సంక్షేమం గురించి ఎల్లప్పుడూ ఆలోచించే నరేంద్ర మోడీని భారతదేశ అత్యుత్తమ ప్రధానిగా చెప్పడంలో తప్పు లేదని ఈ సందర్భంగా బిష్ణోయ్ కీర్తించారు. రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ వోటింగ్‌కు పాల్పడినందుకు కాంగ్రెస్ నుంచి బహిష్కృతుడైన బిష్ణోయ్(53) బుధవారం హర్యానా అసెంబ్లీకి రాజీనామా చేశారు.
Ex Congress Leader Kuldeep Bishnoi Joins BJP