టీమిండియాపై ఆగని ప్రశంసలు
ఆస్ట్రేలియాపై గెలుపుతో పొగడ్తల వర్షం
ముంబై: ఆస్ట్రేలియా సిరీస్‌ను ముగించుకుని టీమిండియా ఇప్పటికే స్వదేశానికి చేరుకుంది. అయితే భారత్ సాధించిన చారిత్రక విజయంపై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసల వర్షం కొనసాగుతూనే ఉంది. ఆస్ట్రేలియాను వారి సొంత గడ్డపై చిత్తుగా ఓడించడంపై భారత క్రికెట్ జట్టును పలువురు విదేశీ ఆటగాళ్లు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇంగ్లండ్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికాలతో పాటు ఆస్ట్రేలియాకు చెందిన పలువురు దిగ్గజాలు కూడా టీమిండియా విజయంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రపంచ క్రికెట్‌లోనే అత్యంత బలమైన జట్టుగా పేరున్న ఆస్ట్రేలియాను వారి సొంత గడ్డపై ఓడించడం ఏ జట్టుకైన చాలా కష్టమని, అయితే యువ ఆటగాళ్లతో కూడిన భారత జట్టు ప్రతికూల పరిస్థితుల్లోనూ సంచలన విజయం సాధించడంపై ప్రపంచ వ్యాప్తంగా అభినందల వర్షం కురుస్తోంది. రెగ్యూలర్ కెప్టెన్ విరాట్ కోహ్లితో సహా చాలా మంది కీలక ఆటగాళ్లు గాయాలతో సిరీస్‌కు దూరమైనా టీమిండియా అసాధారణ పోరాట పటిమతో సాధించిన విజయాన్ని చాలా మంది మాజీ క్రికెట్ దిగ్గజాలు ప్రశంసిస్తున్నారు. ఆస్ట్రేలియాకు చెందిన మాజీ క్రికెటర్లు చాపెల్ సోదరులు, మాజీ కెప్టెన్లు మైఖేల్ క్లార్క్, స్టీవ్‌వా, అలర్ బోర్డర్, మార్క్ టైలర్ తదితరులు టీమిండియాపై ప్రశంసల వర్షం కురిపించారు. పూర్తిగా కొత్త ఆటగాళ్లతో బరిలోకి దిగినా భారత్ చారిత్రక విజయం సాధించడంపై వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తీవ్ర ఒత్తిడిలోనూ జట్టును గెలుపు పథంలో నడిపించిన తాత్కాలిక కెప్టెన్ అజింక్య రహానెను వారు అభినందించారు. దాదాపు మూడు దశాబ్దాలుగా గబ్బా స్టేడియంలో అజేయంగా కొనసాగుతున్న ఆస్ట్రేలియాపై టీమిండియా సాధించిన విజయాన్ని వారు కొనియాడారు.
ఈ సిరీస్‌లో భారత ఆటగాళ్లు పోరాడిన తీరుపై వారు ప్రశంసలు కురిపించారు. మరోవైపు పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు కూడా ఇంజమాముల్ హక్, వసీం అక్రమ్, జావేద్ మియాందాద్, జహీర్ అబ్బాస్, షోయబ్ అక్తర్, యూనిస్ ఖాన్ తదితరులు కూడా టీమిండియాను అభినందనలతో ముంచెత్తారు. ఆస్ట్రేలియా గడ్డపై ఇలాంటి విజయం సాధించడం చాలా అద్భుతమని వారు పేర్కొన్నారు. ఇక ఇంగ్లండ్‌కు చెందిన మైఖేల్ వాన్, నాసేర్ హుస్సేన్, గ్రేమ్ స్వాన్, అలెక్ స్టివర్ట్, ఇయాన్ బోథమ్‌లు కూడా భారత జట్టు విజయంపై ఆనందం వ్యక్తం చేశారు. దక్షిణాఫ్రికా దిగ్గజాలు స్మిత్, కలిస్, డొనాల్డ్, షాన్ పొలాక్, మార్క్ బౌచర్ తదితరులు కూడా టీమిండియా సాధించిన చారిత్రక విజయాన్ని ప్రశంసించారు.
Ex Cricketers praise on Team India