లండన్: భారత్‌తో చారిత్రక లార్డ్స్ మైదానంలో జరిగిన రెండో టెస్టులో అవమానకర రీతిలో ఓటమి పాలైన ఇంగ్లండ్ జట్టుపై విమర్శల వర్షం కురుస్తోంది. గెలవాల్సిన మ్యాచ్‌లో చేజేతులా పరాజయం చవిచూడడంపై తీవ్ర స్థాయిలో విమర్శలను ఎదుర్కొంటోంది. సొంత తప్పిదంతోనే మ్యాచ్‌ను కోల్పోవాల్సి వచ్చిందని బ్రిటీష్ మీడియాతో సహా ఆ దేశ క్రికెట్ అభిమానులు, మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పిస్తున్నారు. చేతుల్లోకి వచ్చిన మ్యాచ్‌ను పక్కకు పెట్టి, ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లపై కవ్వింపులకు దిగడాన్ని వీరు తప్పుపడుతున్నారు. సాఫీగా సాగుతున్న మ్యాచ్‌ను చేజేతులా క్లిష్టంగా మార్చుకున్న ఘనత ఇంగ్లండ్‌కు దక్కుతుందని బ్రిటీష్ మీడియా స్థాయిలో విమర్శలు గుప్పించింది. ఆటను నమ్ముకోకుండా దొడ్డిదారిన గెలుపు అందుకోవాలని ప్రయత్నించడం వల్లే ఇలాంటి పరిస్థితి ఎదురైందని పలువురు మాజీ క్రికెటర్లు విమర్శించారు. అంతేగాక ఈ మ్యాచ్‌లో ఆరంభం నుంచే ఇంగ్లండ్ వ్యూహం సరిగా లేదని వారు పేర్కొంటున్నారు.
టాస్ గెలిచి కూడా బ్యాటింగ్ తీసుకోక పోవడం పెద్ద పొరపాటని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. లార్డ్స్ పిచ్‌పై నాలుగో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయడం తేలికేం కాదనే విషయాన్ని కెప్టెన్ రూట్ మరవడం ఆశ్చర్యంగా ఉందని వారు పేర్కొన్నారు. ఈ మ్యాచ్‌లో భారత్ అసాధారణ ఆటతో చారిత్రక విజయం సాధించడాన్ని బ్రిటీష్ మీడియా స్వాగతించింది. టీమిండియా విజయానికి అన్ని విధాలుగా అర్హురాలని మీడియా పేర్కొంది. ఇక ఇంగ్లండ్ టీమ్ ఇప్పటికైనా తన పద్ధతిని మార్చుకోవాలని మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. లేకుంటే సిరీస్‌ను కోల్పోవడం ఖాయమని వారు జోస్యం చెబుతున్నారు.
Ex cricketers slams England’s team for defeated by India