Monday, January 20, 2025

ప్రాణాలతో బయటపడతానని ఊహించలేదు

- Advertisement -
- Advertisement -

అది అత్యంత కఠినమైన, దారుణమైన జైలు జీవితం
విడుదల అనంతరం విలేకరులతో ప్రొఫెసర్ సాయిబాబా

నాగపూర్: అత్యంత దారుణమైన జైలు జీవితాన్ని గడిపినప్పటికీ సజీవంగా తాను జైలు నుంచి విడుదల కావడం ఆశ్చర్యంగా ఉందని ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా అన్నారు. గురువారం ఉదయం నాగపూర్ కేంద్ర కారాగారం నుంచి విడుదలయ్యారు. అభియోగాలను నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని స్పష్టం చేస్తూ ప్రొఫెసర్ సాయిబాబాకు విధించిన యావజ్జీవ కారాగార శిక్షను బాంబే హైకోర్టు మంగళవారం కొట్టివేసిన దరిమిలా సాయిబాబా జైలు నుంచి విడుదలయ్యారు.

తాను సజీవంగా బయటకు వచ్చే అవకాశాలు లేనే లేవని విలేకరులతో మాట్లాడుతూ ఆయన వ్యాఖ్యానించారు. తన ఆరోగ్యం బాగాలేదని, తాను మాట్లాడే పరిస్థితిలో లేనని, ముందు వైద్య చికిత్స చేసుకోవలసి ఉందని, ఆ తర్వాతే మాట్లాడగలనని చెబుతూ విలేకరులతో మాట్లాడేందుకు ఆయన తొలుత నిరాకరించారు. నడవలేని స్థితిలో వీల్ చెయిర్‌కే పరిమితమైన సాయిబాబా న్యాయవాదులు, విలేకరుల నుంచి వచ్చిన అభ్యర్థనలను దృష్టిలో పెట్టుకుని తన మనసు మార్చుకున్నానని తెలిపి అనంతరం విలేకరులతో మాట్లాడేందుకు అంగీకరించారు.

త్వరలోనే డాక్టర్లను కలుస్తానని ఆయన చెప్పారు. తన ఎనిమిది సంవత్సరాల అత్యంత దుర్భరమైన జైలు జీవితాన్ని గుర్తు చేసుకుంటూ అది అత్యంత దారుణమైన, కఠినమైనదిగా అభివర్ణించారు. జైలులో తనకు ఏవీ అండుబాటులో లేవని ఆయన తెలిపారు. నా అంతట నేను లేచి నిలబడలేను..వీల్ చెయిర్ నుంచి కదలలేను..సొంతంగా టాయిలెట్‌కు వెళ్లలేను. స్నానం చేయలేను..ఈరోజు నేను జైలు నుంచి ప్రాణంతో బయటపడడం ఆశ్చర్యంగా ఉంది..అసలు నేను జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలు లేనే లేవు అని ఆయన అన్నారు. తనపై బూటకపు కేసు నమోదు చేశారని ఆయన చెప్పారు. వాస్తవాలు, సాక్ష్యాలు, చట్టబద్ధత లేని కేసుగా ఉన్నత న్యాయస్థానం ఒకసారి కాదు..రెండుసార్లు నిర్ధారించిందని ఆయన గుర్తు చేశారు.

అయినప్పటికీ ఇంత సుదీర్ఘకాలం పాటు ఈ కేసు విచారణ ఎందుకు సాగిందని ఆయన ప్రశ్నించారు. తనతోపాటు తన సహ నిందితులతమ పదేళ్ల జీవితాన్ని కోల్పోయామని, దీన్ని ఎవరు తిరిగిస్తారని ఆయన నిలదీశారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలోని ప్రత్యేక కోర్టు విధించిన కారాగార శిక్షతో 2017 నుంచి నాగపూర్ జైలులో సాయిబాబా ఖైదీగా ఉన్నారు. అంతకుముందు 2014 నుంచి 2016 వరకు జైలులో ఉన్న సాయిబాబాకు ఆ తర్వాత బెయిల్ లభించింది. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని, దేశంపై యుద్ధం చేసేందుకు దారితీసే కార్యకలాపాలు సాగిస్తున్నారని ఆరోపిస్తూ నమోదైన కేసులో ప్రొఫెసర్ సాయిబాబాతోపాటు ఒక జర్నలిస్టు, ఒక జెఎన్‌యు వ్యిర్థితోసహా ఐదుగురికి గడ్చిరోలి సెషన్స్ కోర్టు 2017 మార్చిలో యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. కాగా..ఈ తీర్పును బాంబే హైకోర్టుకు చెందిన నాగపూర్ బెంచ్ మంగళవారం కొట్టివేస్తూ యుఎపిఎ కింద వీరిపై ప్రాసిక్యూషన్‌కు అనుమతించడం చట్టవిర్ధుమని స్పష్టం చేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News