విదేశాంగ శాఖ మాజీ మంత్రి కె నట్వర్ సింగ్ సుదీర్ఘ కాలం అస్వస్థత అనంతరం శనివారం రాత్రి పొద్దుపోయిన తరువాత మరణించినట్లు కుటుంబ వర్గాలు వెల్లడించాయి. ఆయన వయస్సు 93 సంవత్సరాలు. నట్వర్ సింగ్ ఢిల్లీ సమీపంలోని గురుగ్రామ్‌లో మేదాంత ఆసుపత్రిలో కన్ను మూసినట్లు, రెండు వారాల క్రితం ఆయనను ఆ ఆసుపత్రిలో చేర్పించినట్లు వారు తెలిపారు. నట్వర్ సింగ్ 1931లో రాజస్థాన్ భరత్‌పూర్ జిల్లాలో జన్మించారు. ఆయన కెరీర్ దౌత్యవేత్త. నట్వర్ సింగ్ తన రాజకీయ జీవితంలో దౌత్యపరంగా అపార అనుభవాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఒక మహారాజా జీవితం నుంచి విదేశాంగ వ్యవహారాల్లో సూక్ష్మ నైపుణ్యాల వరకు అంశాలపై ఆయన విస్తృతంగా రచనలు చేశారు. తన విశిష్ట కెరీర్‌లో ఆయన పలు పదవులు అధిష్ఠించారు. దేశానికి నట్వర్ సింగ్ చేసిన సేవలకు గుర్తింపుగా ఆయనకు 1984లో పద్మ భూషణ్ పురస్కారం ప్రదానం చేశారు.
‘ఆయన కుమారుడు ఆసుపత్రిలో ఉన్నారు. ఢిల్లీలో జరపదలచిన అంత్యక్రియల కోసం మరి కొంత మంది కుటుంబ సభ్యులు ఆయన సొంత రాష్ట్రం నుంచి వస్తున్నారు’ అని కుటుంబ ప్రతినిధి ఒకరు శనివారం రాత్రి పొద్దుపోయిన తరువాత ‘పిటిఐ’తో చెప్పారు. కాంగ్రెస్ మాజీ ఎంపి అయిన నట్వర్ సింగ్ అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వ హయాంలో 2004-05 కాలంలో విదేశాంగ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆయన పాకిస్తాన్‌లో హైకమిషనర్‌గా కూడా వ్యవహరించారు. ఆయన 1966 నుంచి 1971 వరకు ప్రధాని ఇందిరా గాంధీ కార్యాలయంలో బాధ్యతలు నిర్వర్తించారు. నట్వర్ సింగ్‌కు వెటరన్ రాజకీయ నాయకుడు రణ్‌దీప్ సుర్జేవాలా ‘ఎక్స్’ పోస్ట్‌లో నివాళి అర్పించారు. నట్వర్ సింగ్ ‘ది లెగసీ ఆఫ్ నెహ్రూ: ఎ మెమోరియల్ ట్రిబ్యూట్’, ‘మై చైనా డైరీ 1956-88’తో సహా పలు గ్రంథాలు రచించారు. ఆయన ఆత్మకథ ‘వన్ లైఫ్ ఈజ్ నాట్ ఇనఫ్’.