మన తెలంగాణ/ఎంజిఎం : వరంగల్ ఎంజిఎం ఆస్పత్రిలో అత్యవసర విభాగాల్లో మాజీ ఐఎఎస్ ఆకునూరి మురళి సోమవారం ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఎంజిఎం ఆస్పత్రి అత్యవసర విభాగాలతోపాటు పది విభాగాలను సందర్శించి రోగుల సమస్యలను, వైద్యులు రోగులకు అందిస్తున్న చికిత్సల గురించి అడిగి తెలుసుకున్నారు. ఉత్తర తెలంగాణలో పేదలకు పెద్దదిక్కుగా ఉన్న ఎంజిఎం ఆస్పత్రిలో వసతులు సరిగా లేకపోవడం వల్ల రోగులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆస్పత్రిలో వైద్యులు లేక కేవలం పిజి విద్యార్థులతో రోగులకు వైద్యసేవలు నిర్వహిస్తున్నారన్నారు.
Also read: భార్యాభర్తలిద్దరికీ పిఎం కిసాన్ సాయం.. కేంద్ర ప్రభుత్వం స్పష్టత
దీనివలన పిజి వైద్యులు మానసికంగా ఒత్తిడికి గురై తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఇంత పెద్ద ఆస్పత్రిలో ఎంఆర్‌ఐ స్కానింగ్ సెంటర్ లేకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. అత్యవసర విభాగంలో చాలా మంది వైద్యులు 17 మంది వైద్య సిబ్బంది ఉండగా అందులో నలుగురు కూడా లేరని, ప్రభుత్వ వైద్యులు రూ.లక్షల్లో జీతం తీసుకుంటూ ప్రైవేటు క్లినిక్‌లకు మక్కువ చూపుతున్నారన్నారు. వైద్యులపై పూర్తిస్థాయి పర్యవేక్షణ చేపట్టి క్షేత్రస్థాయిలో రోగులకు వైద్యం అందేవిధంగా వ్యవహరించాలని కోరారు.