Sunday, January 12, 2025

కర్నాటక మాజీ సిఎం ఎస్‌ఎం కృష్ణ కన్నుమూత

- Advertisement -
- Advertisement -

కర్ణాటక మాజీముఖ్యమంత్రి ఎస్‌ఎం కృష్ణ (92) కన్ను మూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, మంగళవారం తెల్లవారు జామున బెంగళూరు లోని సదాశివనగర్‌లో తుదిశ్వాస విడిచారు. ఐదు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కృష్ణ , కేంద్ర, రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు. తన హయాంలో బెంగళూరును భారత సిలికాన్ వ్యాలీగా ప్రపంచానికి సరికొత్తగా పరిచయం చేశారు.

30 ఏళ్లకే అసెంబ్లీలో అడుగుపెట్టి…
కర్ణాటక లోని మండ్య జిల్లా సోమనహళ్లిలో 1932 మే 1న సోమనహళ్లి మల్లయ్య కృష్ణ జన్మించారు. 1962లో తొలిసారి ఎన్నికల్లో అరంగేట్రం చేశారు. ఆ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా మద్దూర్ నియోజకవర్గం నుంచి గెలుపొంది 30 ఏళ్లకే అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత కొంతకాలం పాటు ప్రజా సోషలిస్ట్ పార్టీలో పనిచేసి అనంతరం కాంగ్రెస్‌లో చేరారు.

అనేక చట్టపదవుల్లో …
హస్తం పార్టీలో సీనియర్ నేతగా కొనసాగిన కృష్ణ, పలు కీలక పదవులు నిర్వర్తించారు. 19992004 మధ్య కర్ణాటక 19 వ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ సమయం లోనే బెంగళూరులో ఐటీ రంగం అభివృద్ధికి విశేష కృషి చేశారు. ఆ తర్వాత 2004 డిసెంబర్ నుంచి 2008 మార్చి వరకు మహారాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం యూపీఎ హయాంలో 2009 2012 మధ్య విదేశాంగ మంత్రిగా వ్యవహరించారు. 1989 నుంచి 1993 వరకు కర్ణాటక శాసనసభ స్పీకర్‌గా పనిచేశారు.

1971 నుంచి 2014 వరకు పలుమార్లు లోక్‌సభ, రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 199394లో కర్ణాటక డిప్యూటీ సీఎం గానూ వ్యవహరించారు. రాష్ట్ర శాసన మండలి సభ్యుడిగా ఉన్నారు. దాదాపు 50 ఏళ్లు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎస్‌ఎం కృష్ణ , 2017లో బీజేపీలో చేరారు. గత ఏడాది రాజకీయాల నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించారు. ఆయన సేవలను గుర్తించి 2023లో కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ పురస్కారంతో సత్కరించింది.

నాడు అమెరికా అధ్యక్షుడు మెచ్చిన వేళ…
రాజకీయాల్లోకి రాకముందు 1960లో ఎస్‌ఎం కృష్ణ తన 28 ఏళ్లవయసులో అమెరికాలో న్యాయవిద్యను అభ్యసించారు. ఆ సమయంలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో డెమోక్రటిక్ అభ్యర్థిగా జాన్ ఎఫ్ కెనడీ పోటీ చేశారు. ఆ సమయంలో ఎస్‌ఎం కృష్ణ కెనడీకి లేఖ రాశారు. భారత అమెరికన్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పార్టీ ప్రచారం కోసం వ్యూహాలు చెబుతానన్నారు. అవి కెనడీకి నచ్చడంతో ఆయన తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

ఆ మరుసటి ఏడాది అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాత కెనడీ, కృష్ణ సహకారాన్ని అభినందిస్తూ ఓ లేఖ రాశారు. ఎన్నికల్లో ప్రచారంలో అద్భుతంగా పనిచేశారని , తన గెలుపునకు ఎంతగానో కృషి చేశారని మెచ్చుకున్నారు. జార్జి వాషింగ్టన్ యూనివర్శిటీ లా స్కూల్‌లో విద్యను పూర్తి చేసిన తరువాత భారత్‌కు వచ్చిన ఎస్‌ఎం కృష్ణ తన రాజకీయ ప్రయాణాన్ని మొదలు పెట్టారు. ఆయనకు భార్య ప్రేమ, ఇద్దరు కుమార్తెలు శాంభవి, మాళవిక (కేఫ్ కాఫీ డే సీఈఒ) ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News