Sunday, December 22, 2024

భారతీయులారా..క్షమించండి: మాల్దీవుల మాజీ అధ్యక్షుడు నషీద్

- Advertisement -
- Advertisement -

భారత్‌తో దౌత్య వివాదం కారణంగా చోటు చేసుకున్న పరిణామాలపై మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మహమ్మద్ నషీద్ ఆందోళన వ్యక్తం చేశారు. తమ దేశం తరఫున భారతదేశ ప్రజలకు క్షమాపణ చెప్పారు. ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్న నషీద్ శనివారం మీడియాతో మాట్లాడుతూ ఈ విధంగా స్పందించారు.‘ ఈ దౌత్య వివాదం, బాయ్‌కాట్ పిలుపు వల్ల మాల్దీవులపై తీవ్ర ప్రభావం పడింది. ఈ పరిణామాలతో నేను తీవ్రంగా ఆందోళన చెందాను. దీనిపై మాల్దీవుల ప్రజల తరఫున క్షమాపణలు చెప్తున్నాను. ఈ సెలవులకు భారతీయులు మా దేశానికి రావాలని కోరుకుంటున్నాను. వారికిఎప్పటిలాగే మాల్దీవుల ఆతిథ్యం ఉంటుంది. దానిలో ఎలాంటి మార్పూ ఉండదు’ అని నషీద్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పారు. ‘ భారత దళాలు మా దేశం వీడి వెళ్లాలని అధ్యక్షుడు ముయిజ్జు కోరినప్పుడు భారత్ బాధ్యతాయుతంగా వ్యవహరించింది. తన బలాన్ని ప్రదర్శించాలని అనుకోలేదు.

‘ సరే చర్చిద్దాం’ అంటూ సంయమనం పాటించింది’ అంటూ కొనియాడారు. బాయ్‌కాట్‌కు కారణమైన వారిని వెంటనే తొలగిస్తూ ప్రస్తుత మాల్దీవుల అధ్యక్షుడు తీసుకున్న చర్యలను ఆయన ప్రశంసించారు. ఈ విభేదాలను పరిష్కరించుకోవలసిన అవసరం ఉందని కూడా నషీద్ అభిప్రాయపడ్డారు. కాగా, తాను గత రాత్రి ప్రధాని నరేంద్ర మోడీని కలిసినట్లు నషీద్ చెప్పారు. ప్రధాని మోడీకి తాను పెద్ద మద్దతుదారునని ఆయన చెప్తూ, ప్రధాని మోడీకి అంతా మేలు జరగాలని తాను ఆకాంక్షించినట్లు చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ కొద్ది నెలల క్రితం లక్షదీవులలో పర్యటించడంపై మాల్దీవుల నేతలు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలపై భారత్‌నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయింది.‘బాయ్‌కాట్ మాల్దీవులు’ హ్యాష్‌ట్యాగ్‌తో నెటిజన్లు మండిపడ్డారు.

ఇంత వివాదం నడుస్తున్నా.. చైనా అనుకూల నేతగా పేరుబడ్డ మాల్దీవుల కొత్త అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు మాత్రం డ్రాగన్‌కు దగ్గరవుతున్నారు. కొద్ది రోజలు క్రితం రెండు దేశాల మధ్య సైనిక సహకారంపై ఒప్పందంజరిగింది. ఆయన తీరును విపక్ష నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. మరో వైపు భారతీయ ప్రజలతో తమ బంధం రాజకీయాలకు అతీతమని అక్కడి పర్యాటక సంఘాలు స్పందిస్తున్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News