Thursday, September 19, 2024

ఎన్‌సి, పిడిపి తరఫున మాజీ తీవ్రవాదుల ప్రచారం

- Advertisement -
- Advertisement -

జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కోసం నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సి), పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ (పిడిపి) మాజీ తీవ్రవాదుల మద్దతు తీసుకుంటున్నాయని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ బుధవారం ఆరోపించారు. ఆ రెండు పార్టీలు కేంద్ర పాలిత ప్రాంతాన్ని ‘కల్లోలిత కాలానికి’ తిరిగి తీసుకుపోజూస్తున్నాయని ఆయన అన్నారు. అబ్దుల్లాలు, ముఫ్తీలను బిజెపి జెకె ఇన్‌చార్జి రామ్ మాధవ్ ప్రస్తావిస్తూ, ఆ రెండు కుటుంబాలను ఇంటి దారి పట్టించాలని పిలుపు ఇచ్చారు. ‘మాజీ తీవ్రవాదులు ఎన్‌సి, పిడిపి అభ్యర్థుల తరఫున బాహాటంగా ప్రచారం చేస్తున్నారని నాకు సమాచారం అందింది. జెకెను తిరిగి పాత దుర్దినాల దశకు తీసుకువెళ్లాలని కోరుకుంటున్న పార్టీలను జనం ఓడించి, శాంతిని, పురోగతిని కోరుతున్న కొత్త నాయకత్వాన్ని సమర్థించవలసి ఉంటుంది’ అని రామ్ మాధవ్ శ్రీనగర్‌లో విలేకరులతో అన్నారు.

నామినేషన్ల దాఖలు సమయంలో లాల్ చౌక్ అసెంబ్లీ నియోజకవర్గం బిజెపి అభ్యర్థి ఐజాజ్ హుస్సేన్ వెంట మాధవ్ ఉన్నారు. 370 అధికరణం, రాష్ట్ర హోదా పునరుద్ధరణ, కాశ్మీర్ సమస్య పరిష్కారం, పాకిస్తాన్‌తో చర్చలు గురించిన వాగ్దానంతో ఎన్‌సి, పిడిపి విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోల గురించి మాధవ్ ప్రస్తావిస్తూ, ఆ రెండు ప్రాంతీయ పార్టీలు జెకెను మళ్లీ పూర్వపు, కల్లోలిత రోజులకు తీసుకువెళ్లాలని కోరుకుంటున్నాయని ఆరోపించారు. ‘ఎన్‌సి, పిడిపి, ఇతరులు జెకెను తిరిగి పాత, కల్లోలిత రోజులకు తీసుకువెళ్లేలా మేనిఫెస్టోలను వెలువరించాయని జెకె ప్రజలకు గుర్తు చేయదలిచాను’ అని ఆయన చెప్పారు. కాశ్మీర్ లోయలో కొత్త పార్టీలు, కొత్త నేతలు ఆవిర్భవించనున్నట్లు. జమ్మూ ప్రాంతంలో శాంతి, అభివృద్ధికి ప్రతినిధిగా బిజెపి అవతరించనున్నట్లు ఆయన తెలిపారు. జెకెలో బిజెపి సారథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పడగలదని మాధవ్ చెప్పారు.

యువ అభ్యర్థులు అనేక మంది ఎన్నికల్లో పోటీ చేస్తుండడం గురించి ప్రశ్నించగా, ఇది జెకె ప్రజల వ్యూహం అని, వారు కొత్త నాయకత్వాన్ని కోరుకుంటున్నారని ఆయన సమాధానం ఇచ్చారు. ‘గణనీయ సంఖ్యలో యువజనులు ముందుకు వస్తున్నారు. వారికి మద్దతు ఇవ్వాలి. ఈ రాష్ట్రం రెండు కుటుంబాల గుప్పిట్లో చిక్కుకుని ఉంది. ఆ రెండు కుటుంబాలను ఇంటి దారి పట్టించాలి. ఈ రాష్ట్రానికి ఆ కుటుంబాల బారి నుంచి విముక్తి కలిగించవలసిన అవసరం ఉంది’ అని మాధవ్ ఎన్‌సి అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా, పిడిపి చీఫ్ మెహబూబా ముఫ్తీ కుటుంబాలను ఉద్దేశించి అన్నారు. ఏ పార్టీకీ ఆధిక్యం రాని పక్షంలో బిజెపి ఏ పార్టీతోనైనా చేయి కలుపుతుందా అని ప్రశ్నించినప్పుడు, బిజెపి ఏకైక పెద్ద పార్టీగా అవతరిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అయితే, ‘అటువంటి పరిస్థితి వస్తే మేము తరువాత దానిపై చర్చిస్తాం’ అని మాధవ్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News