Friday, November 15, 2024

అజిత్ సింగ్ కన్నుమూత

- Advertisement -
- Advertisement -

కొవిడ్‌తో చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి
ఆరుసార్లు ఎంపిగా ఎన్నిక, కేంద్రమంత్రిగా సేవలు
ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి బాసట, రాష్ట్ర ఏర్పాటులో సహకారం
 ప్రధాని మోడీ, సిఎం కెసిఆర్ సంతాపం
అజిత్‌సింగ్ జ్ఞాపకాలను తెలంగాణ ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు : కెసిఆర్

న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, రైతు నేత, రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్‌ఎల్‌డి) నేత అజిత్ సింగ్ కన్నుమూశారు. ఉత్తరభారతంలో ప్రత్యేకించి యుపి లో ఆయన కు రాజకీయంగా విశేషమైన పేరుంది. మాజీ ప్రధాని సర్దార్ చరణ్‌సింగ్‌కు మారుడు అయిన అ జిత్ సింగ్ వయస్సు 82 సంవత్సరా లు. ఇటీవలే ఆయనకు కరోనా వైరస్ సోకింది. గుర్‌గావ్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వస్తున్న అజిత్ సింగ్ గురువారం ఉదయం పరిస్థితి విషమించడంతో మృతి చెందారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఎప్రిల్ 20వ తేదీ నుంచి ఆయన కరోనాకు చికిత్స పొందుతున్నారు. చివరి వరకూ కొవిడ్‌తో పోరుసల్పుతూ వచ్చినప్పటికీ వయోసంబంధిత సమస్యలూ తొడవడంతో చివరికి ప్రాణాలు వదిలారని కుమారుడు జయంత్ చౌదరి ట్వీట్ వెలువరించారు. ఆయన మృతి పట్ల పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేశారు. యుపి, హర్యానా, పంజాబ్ ఇతర ప్రాంతాలలో విషాదఛాయ లు నెలకొన్నాయి. ప్రజలు అజిత్‌ను ఆప్యాయంగా ఆత్మీయంగా జూనియర్ చౌదరి సాబ్ అని పిలుచుకుంటారు. దేశం లో పలు చోట్ల ప్రత్యేక రాష్ట్రాల ఏర్పాటు ఉద్యమాలకు వాటి ఆర్థిక సామాజిక వెనుకబాటు తనాల ప్రాతిపదికన రాజకీయ మద్దతు ఇచ్చి, దేశ రాజకీయాలలో అజిత్ సింగ్ ప్రముఖ స్థానం పోషించారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి బాసటగా నిలిచారు. కెసిఆర్‌కు అనేక దశలలో జాతీయ స్థాయిలో రాజకీయంగా సహకరించారు. తెలంగాణ ఆవిర్భావం దిశలో తన పా త్ర పోషించారు. జీవితాంతం ఆయన అందరిని ఆదరించారు. అందరి అభిమానం పొందారు. రాజీకి దిగని రాజకీయ నేతగా వ్యవహరించారని కుమారుడు తెలిపారు. ప్రస్తుత దశలో దేశం భయంకరమైన వైరస్‌తో పోరాడుతోంది. ఈదశలో అజిత్‌సింగ్‌కు నివాళులు అర్పించాలని అభిలషించే వారు దయచేసి ఇళ్ల లో ఉండి, ఆయన కోసం తమ ఆలోచనలను వ్యక్తం చేస్తే చాలునని కుమారుడు జయంత్ విజ్ఞప్తి చేశారు. ఇదే ఆయనకు, వేలాది మంది కొవిడ్ వారియర్స్‌కు నిజమైన గౌరవం అవుతుందని అన్నారు. కొవిడ్ చికిత్సకు ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన అజిత్‌సింగ్‌కు సరైన చికిత్స జరుగుతున్న దశలోనే బహుళ స్థాయి లో అవయవాల వైఫల్యం సంభవించింది. ఇదే ఆయనను కోలుకోలేకుండా చేసి ప్రాణాలను హరించివేసింది. అజిత్‌సింగ్ ఉత్తరప్రదేశ్‌లోని మేరఠ్‌లో 1933 ఫిబ్రవరి 12న జన్మించారు.
ఆరు పర్యాయాలు ఎంపి, కేంద్ర మంత్రి
రాజనీతిజ్ఞుడిగా పేరొందిన అజిత్ సింగ్ ఆరుసార్లు పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. కేంద్ర మంత్రిగా అనేక సార్లు కీలక బాధ్యతలు నిర్వర్తించారు. నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వ హయాంలో ఆ యన 1989లో పరిశ్రమల మంత్రి అయ్యారు. యుపిఎ ప్రభుత్వంలో 2011 దశలో పౌరవిమానయాన మంత్రిగా ఉన్నారు. ప్రాంతీయ పార్టీ ఆర్‌ఎల్‌డి స్థాపించిన అజిత్ సింగ్‌కు జాట్ నేతగా విశేషమైన పేరుంది. పశ్చిమ యుపిలో తిరుగులేని నేతగా ఉన్నారు. ఎన్నికలలో ఆయన ఇటీవలి కాలంలో ఆధిక్యతను ప్రదర్శించలేకపోయినా గ్రామీణ స్థాయిలో ఇప్పటికి అజిత్ సింగ్ పట్ల ఆదరణ ఉంది. అజిత్ సింగ్ మృతి పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కొవింద్, ప్రధాని మోడీ, తెలంగాణ సిఎం కెసిఆర్, చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్మోహన రెడ్డి, కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక, యుపి సిఎం యోగి ఆదిత్యానాథ్, ఎస్‌పి అధినేత అఖిలేష్ యాదవ్ ఇతరులు వ్యక్తం చేశారు.
ఐఐటి ఖరగ్‌పూర్ విద్యార్థి అజిత్
నలుగురు ప్రధానుల హయాంలో మంత్రి
ఐఐటి ఖరగ్‌పూర్, ఇలినాయిస్ ఇనిస్టూట్ ఆఫ్ టెక్నాలజీ పూర్వపు విద్యార్థి అయిన అజిత్ సింగ్ తండ్రి చరణ్‌సింగ్ అనారోగ్యం దశలో కంప్యూటర్ పరిశ్రమలో కీలక స్థానాన్ని వదులకుని ఇండియాకు తిరిగి వచ్చి రాజకీయ వారసత్వాన్ని కొనసాగించారు. మృధుస్వభావిగా, మితభాషిగా పేరుతెచ్చుకున్న అజిత్‌కు వివిధ రాజకీయ పార్టీలలో మంచి పేరుంది. 1986లో ఆయన రాజ్యసభ సభ్యులు అయ్యారు. మరుసటి సంవత్సరం చరణ్‌సింగ్ మరణం తరువాత అప్పటికి ఉన్న లోక్‌దళ్ అధినేతగా బాధ్యతలు స్వీకరించాల్సి ఉన్నప్పటికీ పార్టీలో అంతర్గత తగాదాలతో కుదరలేదు. దీనితో పార్టీ చీలింది. అజిత్ సింగ్ లోక్‌దళ్ బదులుగా రాష్ట్రీయలోక్‌దళ్( ఆర్‌ఎల్‌డి)ని స్థాపించారు. పశ్చిమ యుపిలోని భాగ్‌పట్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి విజేత అయ్యారు. ఇది చౌదరి చరణ్‌సింగ్ గెలుపొందుతూ వచ్చిన నియోజకవర్గం. భాగ్‌పట్ నుంచి రెండుసార్లు ఓటమి పాలయి, అనేకసార్లు గెల్చి తనకు ప్రజలలో ఉన్న అభిమానాన్ని చెక్కుచెదరకుండా చేసుకున్నారు. తరువాతి దశలో ఆయన ముజఫర్‌పూర్ నుంచి పోటీ చేశారు. బిజెపి చేతిలో ఓడారు. అధికారంలోకి వచ్చే బలమైన పార్టీలతో కూటమిల ఏర్పాటు దిశలో వ్యూహాత్మకంగా అడుగులు వేసే నేతగా అజిత్‌కు పేరుంది. ముందు ఆయన లోక్‌దళ్ (ఎ) అధ్యక్షులుగా కొంతకాలం ఉన్నారు. 1987లో జనతాపార్టీలో, 1988లో ఉన్నారు. విపి సింగ్ నాయకత్వంలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా రాజకీయ పోరు క్రమంలో ఆయన వెంట ఉన్నారు. తరువాత కాంగ్రెస్‌లో చేరారు. పివి ప్రధానిగా ఉన్నప్పుడు కేంద్ర ఆహార మంత్రిగా వ్యవహరించారు. 1996లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు. తరువాత అదే ఏడాది పార్టీ వీడారు. సొంతంగా రాష్ట్రీయ లోక్‌దళ్‌ను ఏర్పాటు చేశారు. వాజ్‌పేయి సారథ్యపు ప్రభుత్వంలో 2001 నుంచి 2003 వరకూ మంత్రిగా ఉన్నారు. 2011 లో ఆయన పార్టీ కాంగ్రెస్ సారథ్యపు యుపిఎలో చేరింది. అప్పుడు ఆయన పౌరవిమానయాన మంత్రి అయ్యారు. కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ శివార్లలో రైతుల నిరసనల స్థలికి నవంబర్‌లో అజిత్ సింగ్ వచ్చారు. కేంద్రం తీసుకువచ్చిన చట్టాలు రైతాంగ ప్రయోజనాలను దెబ్బతీసేవిగా ఉన్నాయని తెలిపి, రైతులకు పూర్తి స్థాయి సంఘీభావం వ్యక్తం చేశారు. భాగ్‌పట్‌లో జరిగిన రైతుల సభలో ప్రసంగించారు.
అజిత్ సింగ్ మృతి పట్ల సిఎం కెసిఆర్ సంతాపం
కేంద్ర మాజీమంత్రి, రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ అధ్యక్షుడు, చౌదరి అజిత్ సింగ్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. పలు దఫాలు కేంద్ర మంత్రిగా కీలక బాధ్యతలను చేపట్టిన అజిత్ సింగ్ మాజీ ప్రధాని చరణ్ సింగ్ వారసత్వాన్ని సమర్థవంతంగా కొనసాగించారని, రైతునేతగా భారత రాజకీయాల్లో తనదైన ముద్రవేశారని సిఎం తెలిపారు. తెలంగాణ ఉద్యమానికి, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం సాగిన రాజకీయ ప్రక్రియకు అజిత్ సింగ్ సంపూర్ణ మద్దతు ప్రకటించారని సిఎం గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు మద్దతు పలికిన వారి జ్ఞాపకాలను ప్రజలు ఎప్పటికీ గుర్తించుకుంటారని సిఎం అన్నారు. దివంగత అజిత్ సింగ్ కుటుంబ సభ్యులకు సిఎం కెసిఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Ex Minister Ajit Singh passes away due to Corona

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News