సంచలనం రేపుతున్న మాజీ మంత్రి ఈటల బావమరిది, పౌల్ట్రీ వ్యాపార భాగస్వాముల వాట్సాప్ చాట్
ఎస్‌సిలను కించపరిచే రీతిలో వ్యాఖ్యలు
ఎన్నికల్లో కోట్లాది రూపాయాలు పంచే ఎత్తుగడ
బిజెపి అగ్రనేతల నడుమ విభేదాలపై ఇరువురి నడుమ చర్చ
దళితబంధు పథకంపై మాజీ మంత్రి వర్గం గుండెల్లో దడ
మన తెలంగాణ/హైదరాబాద్: హుజురాబాద్‌లో ఓటర్లను ఎన్ని ప్రలోభాలకు గురి చేసైనా గెలిచేందుకు బిజెపి అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రయత్నిస్తున్నట్లు బట్టబయలైంది. ఈటల బావ మరిది, జమునా రెడ్డి సోదరుడు కొండవీటి మధుసూధన్ రెడ్డి, రాజేందర్ పౌల్ట్రీ వ్యాపారాల్లో ఓ కీలక భాగస్వామి నడుమ జరిగిన వాట్సప్ చాట్‌లో సంచలన విషయాలు వెలుగుచూశాయి. దళితులను బూతులు తిడుతున్న వైనం కూడా అందులో ఉంది. బిజెపి నేతల నడుమ తీవ్ర విభేదాలను కూడా ఇందులో బహిర్గతం అయ్యాయి. పెద్ద ఎత్తున వైరల్ అవుతోన్న ఈ వాట్సాప్ చాటింగ్ వ్యవహారం హుజురాబాద్‌లో ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు పెద్ద ఎత్తున డబ్బులు పంచే విషయం కూడా అందులో చర్చించుకున్నారు. ఫార్చునర్ కారులో హైదరాబాద్‌లోని నారాయణగూడకు వెళ్లి రూ.10 కోట్లు తీసుకొని, అందులో కమలాపూర్ కు రూ.4కోట్లు, జమ్మికుంటకు రూ.6కోట్లు ఇవ్వాలని వ్యూహం రచించుకున్నారు. అదే విధంగా డబ్బుల పంపిణీ విషయంలో నరేష్ పెత్తనం ఎక్కువవుతోందని ఓ వ్యక్తి గురించి వాట్సాప్ చాట్‌లో ఉంది. అదే సమయంలో ఇటీవల సిఎం కెసిఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన దళిత బంధు పథకంపై కూడా అందులో మాట్లాడుకున్నారు. హుజురాబాద్ ఎన్నికల్లో ఆ పథకం ప్రభావం ఎలా ఉండబోతోందని చర్చించుకుంటూనే ‘మాదిగ నా కొడుకులు చిన్న చిన్న వాటికే ఆశ పడతారని, వారిని నమ్మలేము’ అని దళితులను ఉద్దేశించి అభ్యంతరకమైన వ్యాఖ్యానాలు చాటింగ్‌లో ఉన్నాయి. ఈ పథకంతో పెద్ద ఎత్తున ఓట్లు టిఆర్‌ఎస్‌కు మళ్లే అవకాశం ఉందని బెంబేలెత్తారు. అదే విధంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సహకారం పూర్తి స్థాయిలో ఈటలకు ఉండడం లేదని, మాజీ ఎంపి వివేక్ నిత్యం ఈటల వెన్నంటి ఉండడం సంజయ్‌కి నచ్చడం లేదని చర్చించుకున్నారు. అదే సమయంలో వివేక్ సంబంధించిన ఛానల్‌లో ఈటలకు ప్రచారం కూడా లభించడం లేదని పెదవి విరిస్తూ బిజెపిలో అంతర్గత కలహాల గురించి వాట్సాప్‌లో చాట్ చేసుకున్నారు.
Ex Minister Etela Rajender brother in law whatsapp chat out