హైదరాబాద్: మాజీ మంత్రి, బిఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ సర్పంచ్‌ల నిరసనకు ఆయన మద్దతు తెలిపారు. హైదరాబాద్‌లోని తిరుమలగిరి రోడ్డుపై హరీశ్ రావు, బిఆర్ఎస్ నాయకులు నిరసనకు దిగారు. విషయం తెలియడంతో అక్కడకు చేరుకున్న పోలీసులు హరీశ్ రావును, ఇతర బిఆర్ఎస్ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. వారిని పోలీసులు స్టేషన్‌కు తరలించారు. తమను అన్యాయంగా అరెస్ట్ చేశారంటూ వారు స్టేషన్ ఎదుట కూడా వారు నిరసనకు దిగారు.
ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ… మాజీ సర్పంచ్‌లను అరెస్ట్ చేసి నిర్బంధించడం దుర్మార్గమైన చర్య అన్నారు. అర్ధరాత్రి దొంగలను, టెర్రరిస్టులను అరెస్టు చేసినట్లు మాజీ సర్పంచ్‌లను అరెస్ట్ చేయడమేమిటని ప్రశ్నించారు. సర్పంచ్‌ల మీద కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పులు చేసి, భార్య పిల్లల ఒంటి మీదున్న బంగారం అమ్మి మరీ వారు పనులు పూర్తి చేశారన్నారు.
పెండింగ్ బిల్లులు చెల్లించాలని అడిగితే ప్రభుత్వం మొద్దు నిద్ర నటిస్తోందని ధ్వజమెత్తారు. కెసిఆర్ సిఎంగా ఉన్నప్పుడు గ్రామాల అభివృద్ధికి సర్పంచ్‌లు ఎంతో కృషి చేశారని ప్రశంసించారు. ఉత్తమమైన గ్రామాలకు తెలంగాణ కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిందన్నారు. ఆయా గ్రామాలు అవార్డులు సాధించాయంటే అందులో సర్పంచ్‌ల భూమిక ఎంతో ఉందన్నారు.