Thursday, December 26, 2024

కాంగ్రెస్‌లోకి మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి

- Advertisement -
- Advertisement -
రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జీ మాణిక్ రావు ఠాక్రే , పిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో తీగల భేటీ
మల్లికార్జున ఖర్గే సమక్షంలో గురువారం కాంగ్రెస్ కండువా కప్పుకోనున్న వివిధ పార్టీల నేతలు

హైదరాబాద్: మహేశ్వరం మాజీ శాసనసభ్యుడు తీగల కృష్ణారెడ్డి త్వరలో కాంగ్రెస్‌లో చేరనున్నారు. ఆయనతో పాటు చాలామంది నేతలు కాంగ్రెస్‌లో చేరడానికి ముందుకొస్తున్నారు. వివిధ పార్టీలకు చెందిన నేతలు రెండు, మూడురోజుల్లో కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలోనే తీగల కోడలు, రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ అనితారెడ్డితో కలిసి తీగల కృష్ణారెడ్డి హస్తం గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జీ మాణిక్ రావు ఠాక్రే, పిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో హైదర్‌గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో తీగల కృష్ణారెడ్డి మంగళవారం సమావేశమయ్యారు. ఈ మేరకు ఆయన కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. పార్టీలో చేరికల విషయమై అధిష్టానానికి తెలియచేయడానికి నేడు (బుధవారం సాయంత్రం) మాణిక్‌రావు ఠాక్రే, రేవంత్ రెడ్డిలు ఢిల్లీకి వెళ్లనున్నారు. గురువారం ఖర్గే సమక్షంలో పలువురు నేతలు కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.
సబిత చేతిలో ఓటమి
తెలుగుదేశం పార్టీతో తన రాజకీయ ప్రయాణం ప్రారంభించిన తీగల హైదరాబాద్ మేయర్‌గా పనిచేశారు. అనంతరం హైదరాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హుడా) చైర్మన్‌గా పనిచేశారు. హైదరాబాద్ నగర అధ్యక్షుడిగా పనిచేసిన తీగల 2009లో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం ఏర్పడినప్పుడు టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి సబితా ఇంద్రారెడ్డి చేతిలో ఓడిపోయారు. 2014లో కాంగ్రెస్ అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డిపై పోటీ చేసి గెలుపొందారు. అనంతరం టిఆర్‌ఎస్‌లో చేరిన తీగల 2018లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగిన సబితా ఇంద్రారెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. అనంతరం సబితా ఇంద్రారెడ్డి బిఆర్‌ఎస్‌లో చేరి మంత్రి అయ్యారు.
కర్ణాటక ఎన్నికల అనంతరం మారిన సమీకరణాలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో తీగల కృష్ణారెడ్డి కోడలు అనితారెడ్డి మహేశ్వరం జడ్పీటిసిగా గెలిచి రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ అయ్యారు. సబితా ఇంద్రారెడ్డి, తీగల కృష్ణారెడ్డి మహేశ్వరం నియోజకవర్గం నుంచే ఉండటంతో వీరి మధ్య ఆధిపత్య పోరు నెలకొంది. ఈ క్రమంలో పార్టీలో తనకు ప్రాధాన్యత తగ్గుతూ వస్తోందని తీగల అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. సిట్టింగ్‌లకే బిఆర్‌ఎస్ పార్టీ మరోసారి టికెట్ ఇచ్చే అవకాశ ముందన్న సంకేతాలు రావడంతో పార్టీ మారడమే మేలని తీగల భావించినట్టుగా సమాచారం. కర్ణాటక ఎన్నికల అనంతరం రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాలు, పొంగులేటి, జూపల్లి లాంటి కీలక నేతలు హస్తం కండువా కప్పుకోవడంతో అదే దారిలో వెళ్లేందుకు తీగల నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది.
ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత సునీల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వీరేశం
ప్రస్తుతం తీగలతో పాటు వివిధ పార్టీలకు చెందిన నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అందులో వివిధ పార్టీలకు చెందిన నాయకుల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. పార్టీలో చేరే వారిలో మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, మందుల సామెల్, గద్వాల జెడ్పీ చైర్‌పర్సన్ సరిత, రామారావు పటేల్, శశిధర్ రెడ్డి , ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత సునీల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌కుమార్ తదితరులు ఉన్నట్టుగా సమాచారం. ఈనెలలో ప్రియాంకగాంధీ సభ కొల్లాపూర్‌లో జరుగనున్న నేపథ్యంలో మరింత మంది పార్టీలో చేరుతారని కాంగ్రెస్ నాయకులు పేర్కొంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News