అశోక్ తన్వర్ హర్యానాలోని సిర్సా మాజీ ఎంపీ. మహేందర్ గఢ్ లో గురువారం ఎన్నికల ర్యాలీ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, భూపేందర్ సింగ్ హుడా సమక్షంలో ఆయన తిరిగి కాంగ్రెస్ లో చేరారు.
ఒకప్పుడు తన్వర్ హర్యానా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. కానీ 2019లో పతనం అయ్యాక రాజీనామా చేశారు. తర్వాత ఆయన 2021లో తృణమూల్ కాంగ్రెస్ లో చేరారు. ఈ ఏడాది మొదటి భాగంలో భారతీయ జనతా పార్టీ(బిజెపి)లో చేరారు. బిజెపిలో చేరాక ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో దేశం ఓ మార్పును చూస్తోందని పొగిడారు.
విశేషమేమిటంటే జింద్ జిల్లాలోని సఫిదాన్ లో బిజెపి అభ్యర్థికి ప్రచారం చేశాక కాంగ్రెస్ లో చేరారు. రాహుల్ గాంధీ తన ప్రసంగాన్ని ముగించాక, ప్రేక్షకులను కొన్ని నిమిషాలు ఆగమని కోరారు. తర్వాత తన్వర్ వేదిక మీదికి వెళ్లారు. ‘‘నేడు ఆయన తిరిగి తన స్వంత గూటికి చేరుకున్నారు’’( ఆజ్ ఉన్కి ఘర్ వాపసీ హో గయీ) అని ప్రకటించారు. ఆయన రాహుల్ గాంధీ, భూపేందర్ సింగ్ హుడాతో కరచాలనం చేశారు.
తన్వర్ 2009 లోక్ సభ ఎన్నికల్లో ఐఎన్ఎల్ డి అభ్యర్థి సీతారామ్ ను 34499 ఓట్ల తేడాతో ఓడించారు. అయితే 2014లో ఐఎన్ఎల్ డి అభ్యర్థి చరణ్ జతీత్ సింగ్ రోరి చేతిలో 1.15 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయారు. తర్వాత 2019లో కూడా ఆయన బిజెపి అభ్యర్థి సునీతా దుగ్గల్ చేతిలో 3 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ విధంగా ఆయన పతనం కొనసాగింది. ఇప్పుడు ఆయన మళ్లీ కాంగ్రెస్ లో చేరడంతో కాంగ్రెస్ బలాన్ని తిరిగి పునరుద్ధరిస్తారని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపిస్తారని కాంగ్రెస్ ఆశాభావంతో ఉంది.