Monday, January 20, 2025

బిసిల అణచివేతను అడ్డుకుంటాం: బూర

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్రంలో బిసిల అణచివేతను అడ్డుకునేందుకు.. వారిలో చైతన్యం నింపేందుకు పల్లె పల్లెకు ఒబిసి.. ఇంటింటికి బిజెపి కార్యక్రమం చేపడుతున్నామని మాజీ ఎంపి బూర నర్సయ్యగౌడ్, బిజెపి ఒబిసి మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆలె భాస్కర్‌రాజ్ వెల్లడించారు. గురువారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో బిసిల అణచివేతను కొనసాగిస్తున్న బిఆర్‌ఎస్ ప్రభుత్వం తీరును ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఒబిసి మోర్చా ఇంటింటికి కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ఏప్రిల్ 6వ తేదీ నుంచి 14వ తేదీ వరకు బిసిలను చైతన్యపర్చే కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో బిసిలపై ఎనిమిదేళ్లుగా అణచివేత కొనసాగుతుందన్నారు. నిజాయితీగా పనిచేసే బిసి అధికారులను ఎలాంటి పోస్టింగ్‌లు ఇవ్వకుండా అవమానానికి గురిచేశారని ఆరోపించారు.

రాష్ట్రంలో ఏనాడూ కార్యకర్తలకు దగ్గరకు తీయని బిఆర్‌ఎస్ ప్రభుత్వం తాజాగా ఆత్మీయ సమావేశాలలో వారితో నిర్వహించడం.. ఆత్మ వంచన చేయడమే అన్నారు. గతంతో నిర్వహించిన ప్రభుత్వ ఉద్యోగాల భర్తీల్లో అవకతవకలు జరిగినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని బూర నర్సయ్యగౌడ్ తెలిపారు. పేపర్ లీకేజీలో ఇద్దరు వ్యక్తుల ప్రమేయం మాత్రమే ఉందన్నారని.. ఇప్పుడేమో సిట్ 50మందికి నోటీసులిచ్చిందని ఆరోపించారు. పేపర్ లీక్ వ్యవహారాన్ని సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తే ప్రభుత్వానికి వచ్చే నష్టమేమిటని ఆయన ప్రశ్నించారు. సిట్ ప్రభుత్వ కిట్ గా మారిపోయిందని ధ్వజమెత్తా రు. సామాన్య కార్యకర్త అత్యున్నత స్థాయికే చేరే అవకాశం బిజెపిలో ఉందని.. ఇలాంటి అవకాశం బిఆర్‌ఎస్‌లో ఉందా? అని ప్రశ్నించారు.

రెడ్డి సామాజికవర్గంలో బలమైన వ్యక్తుల ఆర్థిక మూలలను దెబ్బ తీసే కుట్ర జరుగుతోందన్నారు. మాజీ ఎంపిలు పొంగులేటి, జితేందర్‌రెడ్డి, కొండా విశ్వేశ్వరరెడ్డి, రాజగోపాల్ రెడ్డి ఆర్థిక మూలాలను దెబ్బ తీస్తున్నారని ఆరోపించారు. సూర్యాపేట కలెక్టర్ గా పనిచేసిన బిసి వర్గానికి చెందిన ఐఎఎస్ అధికారి సురేంద్రమోహన్ ప్రభుత్వ స్థలంలో ఎన్నికల ప్రచారం చేయవద్దని మంత్రికి చెప్పినందుకు అతడిని గవర్నర్ కార్యాలయానికి బదిలీ చేశారని అన్నారు. సమావేశంలో బిజెపి రాష్ట్ర నాయకులు హరిశంకర్‌గౌడ్, లింగాచారి, భాగ్యలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News