వరంగల్ : అసెంబ్లీ ఎన్నికల్లో ఏజెన్సీ ప్రాంతంలోని మాజీ నక్సల్స్ కీలకంగా మారారు. ఒకప్పుడు నక్సల్స్ కు కంచుకోటగా ఉన్న ఏజెన్సీలోని పల్లెల్లో మాజీలదే హవా ఉద్యమంలో పనిచేసి అడవి బాట వీడి జనజీవన స్రవంతిలోకి వచ్చిన మాజీలే… ఈ ఎన్నికల్లో చర్చనీయాంశంగా మారారు. నక్సల్స్ ఉద్యమం ఉధృతంగా సాగిన సమయంలో ఊర్లలో ఇంటికో మిలిటెంట్ పనిచేసిన చరిత్ర ఉన్నది. పోలీస్ నిర్భందాన్ని ఎదుర్కొని నక్సల్స్ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారు. వీరంతా వివిధ కారణాలతో ఉద్యమం వీడి తమ పని తాము చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు. ఎన్నికల వేళ…మాజీలు మళ్లీ తెర మీదకు వచ్చారు.
ఒకప్పుడు వివిధ విప్లవ గ్రూపు కార్యకలాపాలకు ఉమ్మడి వరంగల్ జిల్లా పెట్టని కోట. ప్రతిసారి ఎన్నికల్లో మాజీల ప్రమేయం లేకపోయినా..ఈసారి అనివార్యం అయింది. జిల్లాలోని ములుగు నియోజకవర్గం ఎన్నికల్లో మాజీలు కేంద్ర బిందువుగా నిలుస్తున్నారు. రెండు విప్లవ పార్టీలకు చెందిన అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉండడమే ప్రధాన కారణం. ఇక్కడినుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే ధనసరి అనసూయ అలియాస్ సీతక్క పోటీ చేస్తున్నారు.
బిఆర్‌ఎస్ అభ్యర్థిగా జెడ్పీ ఇంచార్జి చైర్ పర్సన్ బడే నాగజ్యోతి పోటీలో ఉన్నారు. ఇద్దరు ఒకే సామాజికవర్గం కావడానికి తోడు ఇద్దరికి కూడా నక్సల్స్ నేపథ్యం ఉండడంతో మాజీల ప్రాధాన్యత పెరిగింది. కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క..జనశక్తి పార్టీలో అజ్ఞాతంలో దళ కమాండర్ గా పనిచేసారు. కొన్నేళ్ల తర్వాత రాజకీయ అరంగ్రేటం చేశారు. టిడిపి ఎమ్మెల్యేగా గెలిచారు. 2018లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచి ఈసారి కూడా పోటీలో నిలిచారు. జనశక్తి లో పనిచేసిన సమయంలో ప్రజా ఉద్యమాలను సక్సెస్ పుల్ గా నిర్వహించి ప్రజలకు చేరువయ్యారు. రాజకీయాల్లోకి వచ్చి కూడా నిరంతరం ప్రజల మధ్యనే ఉంటూ పనిచేస్తున్నారు. కరోనా సమయంలో ప్రజలకు అండగా ఉంటూ పనిచేసి ప్రత్యేకత చాటుకున్నారు. సోషల్ మీడియా ద్వారా ఫోకస్ గా నిలిచి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇమేజ్ పొందారు. ఇదంతా ఒక ఎత్తయితే…ఎన్నికల రణరంగం మరొకటి. ఈసారి సీతక్కను ఢీ కొనేందుకు బిఆర్‌ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. సీతక్క సామాజికవర్గానికే చెందిన జెడ్పీ చైర్ పర్సన్ బడే నాగజ్యోతిని రంగంలోకి దింపింది. ఇక్కడ నుంచే వ్యూహ, ప్రతి వ్యూహాలు మొదలయ్యాయి.
తాడ్వాయి మండలానికి చెందిన బడే నాగజ్యోతికి నక్సల్స్ నేపథ్యం ఉన్నది. రాజకీయాల్లోకి వచ్చిన అనతికాలంలోనే సర్పంచ్ గా, జెడ్పీటిసిగా గెలిచి వైస్ చైర్మన్ అయ్యారు. చైర్మన్ గా ఉన్న కుసుమ జగదీశ్ ఆకస్మిక మృతితో చైర్మన్ పదవి వరించింది. అయితే నాగజ్యోతి కుటుంబం మావోయిస్ట్ పార్టీలో పనిచేసింది. నాగజ్యోతి తల్లిదండ్రులు మావోయిస్ట్ ఉద్యమంలో అజ్ఞాతంలో పనిచేస్తూ ఎన్కౌంటర్ లలో నేలకొరిగారు. చిన్న వయసులో తల్లిదండ్రులను కోల్పోయి అమ్మమ్మ పర్యవేక్షణ లో పెరిగిన నాగజ్యోతికి రాజకీయ అవకాశం వచ్చింది. ఆమె బాబాయి బడే దామోదర్…ప్రస్తుతం మావోయిస్ట్ పార్టీలో కీలక స్థాయిలో ఉన్నారు. ఒకరు జనశక్తి…మరొకరు మావోయిస్ట్ పార్టీ కావడంతో ఆయా విప్లవ ఉద్యమంలో పనిచేసి జనజీవన స్రవంతిలో ఉన్న వ్యక్తులు ప్రచారంలో కీలకంగా మారారు. జనశక్తి కి చెందిన మాజీ నక్సల్స్ ఇప్పటికే ఒకచోట సమావేశమై తమ శక్తి మేరకు పరిచయాలను వినియోగించుకుని సీతక్క తరపున పనిచేయాలని నిర్ణయించుకున్నారు. మరోవైపు నాగజ్యోతి కోసం మావోయిస్ట్ పార్టీ మాజీలు కూడా నడుం బిగించి పనిచేస్తున్నారు.
మావోయిస్టుల మద్దతు కూడగట్టే దిశగా సీతక్క మరో ప్లాన్ అమలు చేస్తున్నారు. మావోయిస్ట్ ఉద్యమంలో రాష్ట్ర, కేంద్ర స్థాయిలో పనిచేసి లొంగిపోయిన గాజర్ల అశోక్ అలియాస్ ఐతును తెర మీదకు తెచ్చారు. ఇటీవల కాంగ్రెస్ లో చేరిన ఐతుకు ములుగు ఏజెన్సీలోని ఏటూరునాగారం, కన్నాయిగూడెం, తాడ్వాయి, గోవిందరావుపేట, మంగపేట మండలాల్లో మంచి సంబంధాలు ఉన్నాయి. ఇక్కడ ఐతు ప్రచారం చేయనున్నారు. ఉద్యమంలో ఇక్కడి వారితో ఉన్న పరిచయాలను వాడుకోవాలని కాంగ్రెస్ స్కెచ్ వేసింది. రెండు విప్లవ పార్టీలకు చెందిన మాజీ నక్సల్స్ ఎన్నికల రంగంలోకి దిగడంతో పోరు ఆసక్తి గొల్పుతున్నది.