ఇస్లామాబాద్ : బందీగా జైలులో ఉన్న పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ భార్య 49 ఏళ్ల బుష్రా బీబీ సమీప భవిష్యత్తులో పెద్ద చిక్కుల్లో ఇరుక్కోనున్నారు. అవినీతి ఆరోపణల కేసులో ఆమె జైలుపాలయ్యే అవకాశం కనిపిస్తోందని మీడియా కథనం శనివారం వెల్లడించింది. బుష్రా బీబీ కొన్ని ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పెద్ద మొత్తంలో నగదు పొందినట్టు నేషనల్ అకౌంటబులిటీ బ్యూరో (ఎన్‌ఎబి) కొన్ని సాక్షాధారాలను సేకరించిందని అంతర్జాతీయ పత్రిక “ది న్యూస్”లో కథనం వెలువడింది. దీనిపై అవినీతి నిరోధక శాఖ తాజాగా ఆధారాలు సేకరించింది. అవే కాని నిర్ధారణ అయితే బుష్రాబీబీ స్థాయి సాక్షి నుంచి నిందితురాలుగా మారిపోతుందని ఆయా వర్గాలు భావిస్తున్నాయి.
ఎన్‌ఎబికి నిందితురాలు కావడమే కాక, అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. పాకిస్థాన్ తెహ్రీక్ ఇఇన్సాఫ్ (పిటిఐ) పార్టీ ఛైర్మన్ అయిన మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వాషింగ్టన్ లోని పాక్ దౌత్యకార్యాలయం పంపిన రహస్య సమాచారాన్ని వెల్లడి చేసినందుకు ఈ ఏడాది ఆగస్టులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈలోగా ఇమ్రాన్‌పై నమోదైన తోషాఖానా, బ్రిటన్ ఎన్‌సిఎ జిబిపి 190 మిలియన్, అల్ ఖాదిర్ ట్రస్ట్ కేసులపై ఎన్‌ఎబి దర్యాప్తులను ముమ్మరం చేసింది. ఈ దర్యాప్తులన్నీ వేగంగా పూర్తి చేసి కేసులు నమోదు చేయడానికి ఎన్‌ఎబి సిద్ధమౌతోంది.