Sunday, January 19, 2025

ఇమ్రాన్ అరెస్టు అక్రమం: పాక్ సుప్రీంకోర్టు

- Advertisement -
- Advertisement -

ఇస్లామాబాద్: పాక్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్‌ఎ ఇన్సాఫ్ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్‌కు అక్కడి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఇమ్రాన్‌ను అవినీతి నిరోధక విభాగం(నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో) అక్రమంగా అరెస్టు చేసిందన్న సుప్రీంకోర్టు ఆయనను తక్షణమే విడుదల చేయాలని గురువారం ఆదేశించింది. కోర్టు ప్రాంగణంలో ఎవరినీ అరెస్టు చేయడానికి వీల్లేదన్న న్యాయస్థానం .. దేశంంలో శాంతి నెలకొనాలని కోరుకుంటున్నామని పేర్కొంది. అలాగే శుక్రవారం ఇస్లామాబాద్ హైకోర్టును ఆశ్రయించాలని, కోర్టు ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోవాలని ఇమ్రాన్ ఖాన్‌కు సూచించింది.

గత మంగళవారం ఇస్లామాబాద్ హైకోర్టు ఆవరణలో తన అరెస్టును వ్యతిరేకిస్తూ ఇమ్రాన్ ఖాన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై చీఫ్ జస్టిస్ ఉమర్ అతా బండియాల్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం గురువారం విచారణ జరిపించింది. ఈ సందర్భంగా హైకోర్టు ప్రాంగణంనుంచి ఇమ్రాన్‌ను అరెస్టు చేసిన తీరుపై ఎన్‌ఎబిపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రిజిస్ట్రార్ అనుమతి లేకుండా కోర్టు ప్రాంగణంలోకి ప్రవేశించి ఇమ్రాన్‌ను అరెస్టు చేయడం కోర్టు ధిక్కరణే అని మండిపడింది. గంటలోగా ఇమ్రాన్‌ను న్యాయస్థానం ముందు హాజరుపరచాలని ఎన్‌ఎబిని ఆదేశించింది.

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆయనను కోర్టు ముందు హాజరుపరిచారు. భారీ భద్రత మధ్య ఇమ్రాన్‌ను కోర్టు తీసుకువచ్చారు. ఇమ్రాన్ కోర్టు గదిలోకి ప్రవేశించగానే గది తలుపులు మూసివేశారు. ‘90 మంది అక్రమంగా కోర్టు ఆవరణలోకి ప్రవేశిస్తే అప్పుడు కోర్టు మర్యాద ఏమవుతుంది? కోర్టు లోపలే ఓ వ్యక్తిని ఎలా అరెస్టు చేస్తారు? అరెస్టుకు ముందు వారు రిజిస్ట్రార్ అనుమతి తీసుకోవాలి కానీ వారు అలా చేయలేదు. ఇది పూర్తిగా కోర్టు ధిక్కరణే. అరెస్టు క్రమంలో న్యాయస్థానం సిబ్బంది కూడా వేధింపులను ఎదుర్కొన్నారు’ అని విచారణ సందర్భంగా సుప్రీకోర్టు ఎన్‌ఎబిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా తాను బయోమెట్రిక్ హాజరు కోసం సిద్ధమవుతుండగా కోర్టునుంచి తనను కిడ్నాప్ చేశారని, చిత్రహింసలకు గురి చేశారని విచారణ సందర్భంగా ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. ఆందోళకారులు చేస్తున్న హింసాకాండను ఖండించాలని చీఫ్ జస్టిస్ ఇమ్రాన్‌ను కోరగా, ఆందోళనకు తన బాధ్యత ఏమీ లేదని ఆయన అన్నారు.

‘నేను కస్టడీలో ఉన్నప్పుడు రక్తపాత నిరసనలకు ఎలా బాధ్యుడినవుతాను?’ అని ప్రశ్నించారు. అయితే తాను ఎప్పుడూ హింసను సమర్థించలేదన్న ఆయన ప్రభుత్వ ఆస్తులను ధ్వసం చేయడాన్ని ఆపాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నానని చెప్పారు. కాగా అన్ని నిరసనలను ఆపేయాలని ఇమ్రాన్ కోరినట్లు ఆయన లాయర్లు సైతం కోర్టు బయట చెప్పారు. అల్ ఖదీర్ ట్రస్టుకు అక్రమంగా భూములు కేటాయించి 5,000 కోట్ల రూపాయలను దోచుకున్నారని ఆరోపిస్తూ దాఖలైన కేసులో పారామిలిటరీ రేంజర్లు ఇమ్రాన్‌ను మంగళవారం బలవంతంగా అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కేసు విచారణ నిమిత్తం ఇస్లామాబాద్ హైకోర్టుకు వచ్చిన ఆయనను రేంజర్లు చుట్టుముట్టి బలవంతంగా లాక్కెళ్లారు. అనంతరం ఇమ్రాన్ అరెస్టుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగడంతో పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Also Read: లైంగిక ఆరోపణల కేసులో ట్రంప్‌కు భారీ షాక్..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News