సిటిబ్యూరోః బాలికలపై వరుసగా అత్యాచారాలు చేస్తున్న మాజీ సిపాయికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.2,00,000 జరిమానా విధిస్తూ హైదరాబాద్ పోక్సో కోర్టు జడ్జి బుధవారం తీర్పు చెప్పారు. బ్రిజేష్ మిశ్రా(32) సిగ్నల్ రెజిమెంట్‌లో సిపాయిగా పనిచేసి విరమణ పొందాడు. నిందితుడు నిర్మానుష్య ప్రాంతాల నుంచి వెళ్తున్న యువ దంపతులను టార్గెట్‌గా చేసుకుని నేరాలు చేస్తున్నాడు. అమ్ముగూడ రైల్వే స్టేషన్ సమీపంలో నుంచి వెళ్తున్న యువజంటను ఆపి తాను ఇన్‌ఛార్జ్ ఆఫీసర్‌నని చెప్పి యువకుడిపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చేవాడు, అంతటితో ఆగకుండా యువతిని పొదల్లోకి తీసుకుని వెళ్లి అత్యాచారం చేసేవాడు.
నిందితుడిపై 2017,2018లో తిరుమలగిరి పోలీసులు కేసులు నమోదు చేశారు. డిసెంబర్ 21,2017లో బాలిక(15)పై అత్యాచారం చేయడంతో పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. 2018లో స్నేహితుడితో కలిసి వెళ్తున్న బాలికపై అత్యాచారం చేయడంతోపాటు యువకుడిని కొట్టి తీవ్రంగా గాయపర్చాడు. అదే సమయంలో పోలీసుల పెట్రోలింగ్ వాహనం అటురావడంతో పారిపోయేందుకు ప్రయత్నించాడు. పోలీసులు ఛేజ్ చేసి నిందితుడిని పట్టుకున్నారు. 376,511,354,332,353,506 ఐపిసి సెక్షన్లు, పోక్సో కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టులో సాక్షాలు ప్రవేశపెట్టారు. వాటిని పరిశీలించిన కోర్టు నిందితుడికి శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.