బీహార్ మాజీ సిఎం, కేంద్ర మంత్రి జితిన్‌రామ్ మాంఝీ మనవరాలు సుష్మాదేవి (32) తన భర్త చేతిలోనే హత్యకు గురయ్యారు. ఈ సంఘటన బీహార్ లోని గయా జిల్లా టెటువా గ్రామంలో చోటు చేసుకుంది. భార్యాభర్తల మధ్య ఘర్షణే ఈ హత్యకు కారణమని అనుమానిస్తున్నారు. సుష్మాదేవి తన పిల్లలు, సోదరి పూనమ్ కుమారితో కలిసి ఇంట్లో ఉన్న సమయం లోనే ఈ దారుణం చోటు చేసుకుంది. ఈ సంఘటనపై పూనమ్ తెలిపిన వివరాల ప్రకారం …ఈ మధ్యాహ్నం 12 గంటల సమయంలో సుష్మాదేవి భర్త రమేష్, పని నుంచి ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో ఇద్దరి మధ్య గొడవ తలెత్తడంతో నాటు తుపాకీ తీసుకుని కాల్పులకు తెగబడ్డాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు.
సుష్మా దేవి, రమేష్‌కు 14 ఏళ్ల క్రితమే వివాహం జరిగింది. ఈ సంఘటన సమయంలో వేరే గదిలో ఉన్న పూనమ్ , సుష్మా పిల్లలు పరిగెత్తుకుని రాగా, అప్పటికే ఆమె రక్తపు మడుగులో పడి ఉండటాన్ని చూసి తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. కాల్పుల్లో సుష్మాదేవి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. తన సోదరిని చంపినందుకు నిందితుడు రమేష్‌ను ఉరి తీయాలని పూనమ్ డిమాండ్ చేశారు. మరోవైపు ఇంట్లో తుపాకీ పేలుడు శబ్దం వినబడడంతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. ఈ సంఘటనపై గయా ఎస్‌ఎస్‌పీ ఆనంద్ మాట్లాడుతూ నిందితుడిని పట్టుకొనేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఫోరెన్సిక్ బృందం , టెక్నికల్ నిపుణులను ఆధారాల సేకరణకు సంఘటన స్థలానికి పంపినట్టు తెలిపారు.