Monday, December 23, 2024

ఇది పరీక్షల సీజన్.. వద్దు టెన్షన్

- Advertisement -
- Advertisement -

ఇది పరీక్షల సీజన్.. ఒకటే టెన్షన్.. టెన్షన్ ఎక్కువైతే పిల్లలు చదివిందీ కూడా మర్చిపోతుంటారు. జవాబులు తెలిసినా పరీక్షలో తడబడుతుంటారు. పరీక్ష సమయంలో కొందరికి విపరీతంగా చెమటలు పడుతుంటాయి. కాళ్లూ చేతులూ వణకుతుంటాయి. కొన్ని సార్లు కళ్లు తిరిగి పడిపోతుంటారు. ఈ టెన్షన్ తగ్గించుకోడానికి ఆరోగ్య నియమాలు, ఆహారం చాలా తోడ్పడతాయి. ఎగ్జామ్ టెన్షన్‌లో పడి చాలా మంది భోజనం మానేస్తుంటారు. అది చాలా తప్పు. నిద్రాహారాలు మానేస్తే ఏమీ చేయలేరు. సమయానికి బలమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. సరిపడా నీళ్లు తాగుతుండాలి. దానిలో పుదీనా ఆకులు, నిమ్మకాయ ముక్కలు, కలిపితే చాలా బాగుంటుంది.

జ్ఞాపక శక్తి పెంచుకోడానికి మెదడు పనితీరు బాగుండాలి. దీనికి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అవసరం అవుతాయి. చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. అలాగే వాల్‌నట్స్, అవిసె గింజలు, గుమ్మడి గింజలు, నువ్వులు, సొయాబీన్ నూనె, లో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. పరీక్షల సమయంలో ఈ ఆహారం తీసుకుంటే మెదడు చురుగ్గా పనిచేస్తుంది. పరీక్షల ఒత్తిడిని తగ్గించడానికి శరీరానికి విటమిన్ బి కాంప్లెక్స్ విటమిన్ సి, జింక్ వంటి పోషకాలు బాగా పనిచేస్తాయి. ఈ పోషకాలు ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్ ఉత్పత్తిని తగ్గించి డోపమైన్, సెరోటోనిన్, ఎండార్సిన్, వంటి ఫీల్‌గుడ్ హార్మోన్లను పెంచడంలో తోడ్పడతాయి. పండ్లు, పాలకూర, అరటిపండ్లు, చాక్లెట్, అవకాడో, బాదం, గుడ్లు , బెర్రీస్ తీసుకోవడం చాలా మంచింది.

విటమిన్ ఎ, సి, ఇ వంటివి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. గుడ్లు, సాల్మన్ చేపలు, క్యారెట్లు, గుమ్మడికాయలు, ఆకు కూరలు, తాజా పండ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీని పెంచుతాయి. పరీక్షలు రాసేటప్పుడు అనారోగ్యానికి గురయ్యే ముప్పును తగ్గిస్తాయి. పరీక్షల సమయంలో మానసిక ప్రశాంతతను పెంపొందించడానికి సంగీతం అద్భుతమైన మార్గం. ముఖ్యంగా ధ్యానసంగీతం మానసిక స్థితిపై సానుకూల ప్రభావం చూపించి ఏకాగ్రత మెరుగుపర్చడానికి సహాయపడుతుంది. అలిసిపోవడం, నిస్సత్తువ వంటివి ఆవరించకుండా ఉండాలంటే వ్యాయామం , యోగా చాలా అవసరం. పరీక్షల్లో ఎవరు ఎంత చదివారు, ఎలా ప్రిపేర్ అయ్యార్నది ముఖ్యం కాదు.

పరీక్షలో ఎవరు బాగా రాశారన్నదే ముఖ్యం. అందువల్ల సాటి విద్యార్థి ఎవరో తమకంటే బాగా చదువుతున్నారన్న ఆలోచన మనసులోంచి తీసేయాలి. వేరొకరితో మిమ్మల్ని మీరు పోల్చుకోవద్దు. మీ శక్తిసామర్థాలేమిటో మీకు తెలుసుకాబట్టి మీరు మీ చదువుపైనే దృష్టి పెట్టండి. పరీక్షలు దగ్గరకొస్తున్న కొద్దీ మీ చదువు లోని మెళకువలను మెరుగుపర్చుకొంటుండాలి. విసుగు లేకుండా ఉండేందుకు కొంచెంసేపు విరామం తీసుకుంటే మళ్లీ రిఫ్రెష్ అవుతారు. ఉదయం లేదా సాయంత్రం కొంతదూరం నడిస్తే ఒత్తిడి తగ్గుతుంది. పగలూరాత్రీ అన్న తేడా లేకుండా చదవడం మంచిది కాదు. అందువల్ల తగినంత నిద్రకూడా మేలు చేస్తుంది.
photo :

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News