విద్యాసంస్థల మూత నేపథ్యంలో పరీక్షలపై సందేహాలు
ఆల్ పాస్ చేస్తారా..? పరీక్షలు నిర్వహిస్తారా..?
మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైరస్ తీవ్రత నేపథ్యంలో రాష్ట్రంలో అన్ని విద్యాసంస్థలు బుధవారం మూత పడనున్నాయి. అన్ని పాఠశాలలు, కళాశాలలు మూసివేస్తున్నట్లు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. ఆన్‌లైన్ తరగతులు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. మరోసారి విద్యాసంస్థలు మూసివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో పరీక్షలు నిర్వహణపై ఎలాంటి ప్రకటన చేయలేదు.
ఈ నేపథ్యంలో పరీక్షలు జరుగుతాయా..? లేక గత ఏడాది మాదిరిగా అందరినీ పాస్ చేస్తారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కరోనా కేసులు, లాక్‌డౌన్‌తో గత ఏడాది మార్చి నుంచి దాదాపు 11 నెలల పాటు బడులు మూతబడి ఉన్నాయి. కరోనా కేసులు కొంచెం తగ్గడంతో ఈ ఏడాది ఫిబ్రవరి 1 నుంచి 9వ తరగతి ఆపైన తరగతులకు, ఫిబ్రవరి 24 నుంచి 6, 7, 8 తరగతులకు ప్రభుత్వం ప్రత్యక్ష తరగతులు నిర్వహించడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సుమారు 20 రోజులపాటు ఈ తరగతులకు ప్రత్యక్ష బోధన నిర్వహించారు.
కానీ పాఠశాలల్లో మళ్లీ కేసులు ఎక్కువగా నమోదు కావడంతో మళ్లీ బుధవారం నుంచి విద్యాసంస్థలు మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆన్‌లైన్ తరగతులు కొనసాగుతాయని విద్యామంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించిన నేపథ్యంలో అన్ని తరగతులకు పరీక్షలు నిర్వహిస్తారా..? లేక కొన్ని తరగతులకే నిర్వహిస్తారా..? అని విద్యార్థులు, తల్లిదండ్రుల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే 6,7,8 తరగతుల విద్యార్థులను పరీక్షలు లేకుండా పాస్ చేయాలని విద్యాశాఖ భావిస్తున్నట్లు తెలిసింది. నెల తర్వాత పరిస్థితులను బట్టి 9వ తరగతి విద్యార్థులకు ఇంటర్నల్ పరీక్షలు నిర్వహించే విషయంపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. మే నాటికి కరోనా కేసులు, ఇతర పరిస్థితులను పరిశీలించి 10వ తరగతి పరీక్షల నిర్వహణపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది.
ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ఎలా..?
సీనియర్ ఇంటర్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తారా..? లేదా ఇతర పద్దతుల్లో పరీక్షలు నిర్వహిస్తారా..? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇంటర్ బోర్డు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 7 నుంచి 20 వరకు ప్రాక్టికల్ పరీక్షలు జరుగనున్నాయి. మరో రెండు వారాలలో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్న నేపథ్యంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం సైన్స్ గ్రూపుల ఇంటర్ విద్యార్థులకు టెన్షన్ పెరిగిపోతోంది. కొవిడ్ కారణంగా ఈ విద్యాసంవత్సరంలో జనవరి 31 వరకు ఆన్‌లైన్ తరగతులే కొనసాగాయి. ఫిబ్రవరి 1 నుంచి జూనియర్ కళాశాలల్లో ప్రత్యక్ష బోధన ప్రారంభమైంది.
ప్రత్యక్ష తరగతులు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు ఎక్కువగా ఇంటర్ సిలబస్‌పైనే ప్రత్యక్ష బోధన కొనసాగించారు. కొన్ని కళాశాలల్లో అసలు ప్రాక్టికల్స్ చేయించకపోగా, మరికొన్ని కళాశాలల్లో చాలా తక్కువగా ప్రాక్టికల్స్ చేయించినట్లు తెలిసింది. సిలబస్ ప్రకారం విద్యార్థులు పూర్తిగా ప్రాక్టికల్స్ చేయకుండా ప్రాక్టికల్ పరీక్షలకు ఎలా హాజరవుతామని ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఎంపిసి,బైపిసి చదివే విద్యార్థులు దాదాపు 3 లక్షల వరకు ఉంటారు. ఈ విద్యార్థులందరూ తప్పనిసరిగా ప్రాక్టికల్ పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది.