కరోనా నేపథ్యంలో రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయం
గతంలో ఉన్న 11 పేపర్లకు బదులుగా టెన్త్ పరీక్షల్లో ఈ
ఏడాది ఆరు పేపర్లే పరీక్ష సమయం అరగంట పెంపు
ప్రశ్నాపత్రాల్లో మరింతగా ఛాయిస్ ఈ నిర్ణయాలు ఈ ఏడాదికి మాత్రమే పరిమితం ఫిబ్రవరి 28 ప్రీ ఫైనల్ పూర్తి మార్చి, ఏప్రిల్‌లో వార్షిక పరీక్షలు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో పదో తరగతిలో ఈ ఏడాది ఆరు పేపర్లకే పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు పది పరీక్షల విధానంపై విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. గతంలో ఉన్న 11 పేపర్లకు బదులుగా ఈసారి ఆరు పరీక్షలే నిర్వహించాలని, ఒక్కో సబ్జెక్టుకు ఒక పరీక్ష చొప్పున ఉండాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా ప్రభావంతో పాఠశాలల్లో ఇంకా పూర్తిస్థాయిలో తరగతులు నిర్వహించలేని పరిస్థితుల్లో పరీక్ష విధానంలో మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
గతేడాదే ఈ మార్పులు చేసింది. అయితే, చివరి నిమిషంలో పరీక్షలు నిర్వహించలేని పరిస్థితుల కారణంగా పరీక్ష రాయకుండానే అందరినీ ఉత్తీర్ణులను చేసింది. ఈ నేపథ్యంలో ఈసారి కూడా గతేడాది ప్రతిపాదించిన విధానాన్నే అమలు చేయాలని నిర్ణయించారు. కొత్త విధానం ప్రకారం పదో తరగతి విద్యార్థులకు ఆరు పరీక్షలే నిర్వహిస్తారు. గత ఏడాది ముందువరకు 11 పేపర్లు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ ఏడాది 168 రోజులు ప్రత్యక్ష బోధన నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ ఇంకా గురుకులాలు తెరుచుకోలేదు. రాష్ట్రంలో విద్యార్థులు కూడా పాఠశాలలకు పూర్తిస్థాయిలో రావడంలేదు. ఈ పరిస్థితులన్నింటిని దృష్టిలో పెట్టుకున్న విద్యాశాఖ అధికారులు పరీక్ష విధానంలో మార్పులు చేయాలని నిర్ణయించారు.
ఒక్కో పరీక్ష 3.15 గంటలు
పదో తరగతి పరీక్షలకు సమయం అరగంట పెంచాలని అధికారులు నిర్ణయించారు. పదో తరగతి విద్యార్థులకు ఒక్కో పరీక్ష 3 గంటల 15 నిమిషాల పాటు జరగమంది. సైన్సు పరీక్షలో భౌతిక, జీవశాస్త్రాలకు వేర్వేరు సమాధాన పత్రాలు ఉంటాయి. పశ్నల్లో మరిన్ని చాయిస్ ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. బోర్డు పరీక్షకు 80 మార్కులు,ఫార్మేటివ్ అసెస్‌మెంట్ పరీక్షలకు 20 మార్కులు చొప్పున కేటాయించనున్నట్టు అధికారులు వెల్లడించారు.
పాఠశాలల్లో సిలబస్ తగ్గింపు
పాఠశాల విద్యార్థులకు సిలబస్ తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. 1 నుంచి 10 తరగతులకు 70 శాతం సిలబస్ బోధించాలని నిర్ణయించారు. సిలబస్ తగ్గించేందుకు పాఠశాల విద్యాశాఖకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. గత ఏడాది ఉత్తర్వులను ఈ ఏడాది కూడా కొనసాగించాలని నిర్ణయించారు.
గతేడాదే ఈ మార్పులు చేశారు కానీ..
రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా ప్రభావంతో పాఠశాలల్లో ఇంకా పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదు. ఇప్పటికీ గురుకుల విద్యాసంస్థలు తెరుచుకోలేదు. పూర్తిస్థాయిలో తరగతులు నిర్వహించలేని పరిస్థితుల్లో పరీక్ష విధానంలో మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా పరిస్థితుల దృష్టా ప్రభుత్వం గత ఏడాదే ఈ మార్పులు చేసింది. అయితే, చివరి నిమిషంలో పరీక్షలు నిర్వహించలేని పరిస్థితుల కారణంగా పరీక్షలు లేకుండానే అందరినీ పాస్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈసారి కూడా పూర్తి స్థాయిలో విద్యాసంస్థల్లో తరగతులు నిర్వహించలేని పరిస్థితుల నేపథ్యంలో గత ఏడాది ప్రతిపాదించిన విధానాన్నే అమలు చేయాలని నిర్ణయించారు. కొత్త విధానం ప్రకారం పదో తరగతి విద్యార్థులకు ఆరు పరీక్షలే నిర్వహిస్తారు.
మార్చి, ఏప్రిల్‌లో టెన్త్ పరీక్షలు
ఒకటవ తరగతి నుంచి నుంచి 10 తరగతులకు ఫిబ్రవరి 28 నాటికి సిలబస్ పూర్తి చేసి.. మార్చి 1 నుంచి పునశ్ఛరణ తరగతులు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ అకడమిక్ క్యాలెండర్‌లో వెల్లడించింది.మార్చి, ఏప్రిల్‌లో పదో తరగతి వార్షిక పరీక్షలు ఉంటాయని తెలిపింది. ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు డిసెంబరు 1 నుంచి 8 వరకు ఎస్‌ఎ 1(సమ్మేటివ్ అసెస్‌మెంట్) పరీక్షలు జరుగుతాయి. ఒకటి నుంచి తొమ్మిది తరగతులకు అక్టోబరు 5న ఎఫ్ ఎ 1(ఫార్మేటివ్ అసెస్‌మెంట్), ఫిబ్రవరి 28న ఎఫ్1 2, ఏప్రిల్ 7 నుంచి 18 వరకు ఎస్‌ఎ 2 పరీక్షలు నిర్వహిస్తారు. పదో తరగతికి అక్టోబరు 5 నాటికి ఎఫ్‌ఎ 1, డిసెంబరు 31 వరకు ఎఫ్‌ఎ 2 పరీక్షలు పూర్తి చేసి.. ఫిబ్రవరి నెలాఖరు వరకు నిర్వహిస్తారు.
అకడమిక్ క్యాలెండర్ ప్రకారం పరీక్షల షెడ్యూల్
ఒకటి నుంచి 9వ తరగతి వరకు 2022 ఫిబ్రవరి 28 నాటికి సిలబస్ పూర్తి చేయాలి.
పదవ తరగతి విద్యార్థులకు 2022 జనవరి 10 నాటికి సిలబస్ పూర్తి చేయాలి.
ఫార్మేటివ్ అసెస్‌మెంట్ -1 (ఎఫ్‌ఎ) పరీక్షలకు గడువు : అక్టోబర్ 5
ఫార్మేటివ్ అసెస్‌మెంట్ -2 పరీక్షలకు గడువు: జనవరి 31
డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 8 వరకు ఎస్‌ఎ 1 పరీక్షలు
ఏప్రిల్ 7 నుంచి 18 వరకు ఎస్‌ఎ -2 పరీక్షలు
ఫిబ్రవరి 28 నాటికి పదో తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలు పూర్తి చేయాలి
మార్చి లేదా ఏప్రిల్ నెలలో పదో తరగతి వార్షిక పరీక్షలు
ఏప్రిల్ 24 నుంచి జూన్ 12 వరకు పాఠశాలలకు వేసవి సెలవులు ఉంటాయి.