హైదరాబాద్ : భాగ్యనగర చరిత్రకు ప్రతిబింబమైన చార్మినార్ రక్షణ చర్యల్లో భాగంగా ఆర్కియాలజీ అధికారులు చేపట్టిన చర్యలు వివాదానికి దారి తీశాయి. చార్మినార్ అంతర్భాగంలో ఎలక్ట్రికల్ కండక్టర్ల ఏర్పాటు కోసం తీసిన గోతుల్లో చార్మినార్ అంతర్గతంగా ఉన్న సొరంగమార్గంలో మెట్లు కనిపించాయంటూ ఎంఐఎం నాయకులు ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న ఆర్కియాలజీ ఉన్నతాధికారుల బృందం హుటాహుటిన చార్మినార్‌కు చేరుకున్ని పరిశీలించారు. చార్మినార్ కట్టడం పరిరక్షణలో భాగంగా చార్మినార్ నాలుగు మినార్‌లతో పాటు మరిన్ని అంతర్గత నిర్మాణాలకు ప్రకృతి పరంగా, ఇతర ప్రమాదాల కారణంగా ఎలాంటి నష్టం వాట్లికుండా పలు చర్యలు చేపట్టామని ఆర్కియాలజీ అధికారులు ఎస్.ఎ.సిత్మ, ఎస్. కుమార్, రాజేశ్వరీలు తెలిపారు.
వర్షాలు కురిసే సమయంలో కొన్ని సందర్భాల్లో పిడుగులు పడే అవకాశం ఉండడం, అనేక కట్టడాలు కూలిపోతుండడం తెలిసిన విషయమేనన్నారు. భవిష్యత్తులో చార్మినార్ అలాంటి ముప్పులేకుండా మినార్‌పై అంతస్తుల నుంచి చార్మినార్ పునాదుల వరకు అమరుస్తున్నామని తెలిపారు. చార్మినార్ పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉంటే ఈ కాపర్ కేబుల్స్ ఆకర్షించి భూమిలోకి చేర్చుతాయని వెల్లడించారు. ఎలక్ట్రికల్ కండక్టర్ల కోసం తవ్విన గుంతల్లో కొన్ని రాళ్లు కనిపించడంతో అవి మెట్లుగా భావించి సోషల్ మీడియాలో ప్రచారం చేయడంతో స్థానికంగా కలకలం రేగిందని అధికారులు వెల్లడించారు. తమ పరిశీలనలో చార్మినార్ వద్ద ఎలాంటి మెట్లు ఉన్నట్లు గుర్తించలేదని తెలిపారు.