ఎల్బీనగర్ నుంచి దండు మల్కాపూర్ వరకు ఆరు లైన్ల విస్తరణ
ఎన్‌హెచ్- 65 విస్తరణకు
వనస్థలిపురం సహా 9 చోట్ల అండర్‌పాస్‌లు
త్వరలో టెండర్లు ఖరారు
మనతెలంగాణ/హైదరాబాద్: ఔటర్ రింగ్‌రోడ్డు తరహాలో అద్భుతమైన ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణం కానుంది. హైదరాబాద్- టు విజయవాడ 65వ జాతీయ రహదారిపై ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణానికి త్వరలోనే ఆర్ అండ్ బి అధికారులు టెండర్లను పిలవనున్నారు. ఈ నిర్మాణం పూర్తయితే ఎల్బీనగర్ నుంచి దండు మల్కాపూర్ వరకు దెబ్బతిన్న రోడ్లపై వాహనాలు దెబ్బతినకుండా ప్రయాణం సాగించేలా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దీనికోసం కేంద్రం నిధులను సైతం విడుదల చేసింది. చింతల్‌కుంట చెక్‌పోస్టు దాటాక ప్రారంభమయ్యే ఈ ఎక్స్‌ప్రెస్ వే పైకి ఎక్కితే ఔటర్ రింగ్ రోడ్డు వరకు కిందకు దిగడానికి అవకాశం లేకుండా దీనిని నిర్మిస్తున్నారు. నగరవాసులు, స్థానిక కాలనీల ప్రజల కోసం ఎల్బీనగర్ నుంచి కొత్తగూడెం వరకు రెండువైపులా ఆరు వరుసల సర్వీసు రోడ్లతో పాటు ఎన్‌హెచ్-65పై నుంచి రోడ్డు దాటే అవకాశం లేకుండా గ్రేటర్ పరిధిలోనే తొమ్మిది ప్రాంతాల్లో అండర్‌పాస్‌ల నిర్మాణానికి అధికారులు ప్రతిపాదించారు. ఎల్బీనగర్ నుంచి మల్కాపూర్ వరకు ప్రస్తుతమున్న నాలుగు లైన్ల రోడ్డును ఆరు లైన్లుగా విస్తరించేందుకు ఎన్‌హెచ్‌ఏఐ పచ్చజెండా ఊపగా, ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులు టెండర్ల నిర్వహణకు కసరత్తు చేస్తున్నారు. టెండర్ ప్రక్రియ పూర్తయ్యేందుకు మరో రెండు నెలలు పడుతుందని అధికారులు తెలిపారు.
రెండేళ్లలో ప్రాజెక్టు పూర్తికి కసరత్తు
టెండర్ల ఖరారు తరువాత రెండేళ్లలో ప్రాజెక్టు పూర్తి చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. హైదరాబాద్- టు విజయవాడ రహదారి ఎన్‌హెచ్-65లోని ఎల్బీనగర్ నుంచి దండు మల్కాపూర్ వరకు 25 కిలోమీటర్ల మేర రోడ్డు చాలాచోట్ల దెబ్బతింది. హైవే మొత్తం నాలుగు లైన్లు కావడంతో చాలావరకు ట్రాఫిక్ జాం అవుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ టు -విజయవాడ జాతీయ రహదారిని విస్తరించాలని పలుమార్లు రాష్ట్రానికి చెందిన ఎంపిలు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కోరారు. దీనికి కేంద్రం అంగీకరించడంతో, రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ రూ.545 కోట్లతో రోడ్డు విస్తరణకు సంబంధించి డిపిఆర్‌ను అందజేసింది. దీనికి కేంద్రం అనుమతిస్తూ నిధులు మంజూరు చేసింది. ఎన్‌హెచ్ 65 జాతీయ రహదారి చైతన్యపురి నుంచి ఆరు లైన్లుగా ఉండడంతో పాటు ఇరువైపులా సర్వీసు రోడ్లు ఉన్నాయి. గతంలో రోడ్డు విస్తరణ సందర్భంలో ఎల్బీనగర్ నుంచి జాతీయ రహదారికి ఇరువైపులా మొత్తంగా 200 అడుగుల మేర భూమి ఉండడంతో ప్రస్తుతం భూసేకరణ చేయాల్సిన అవసరం లేదని అధికారులు పేర్కొంటున్నారు.
ఎల్బీనగర్ నుంచి చౌటుప్పల్ వరకు సిగ్నల్ లేకుండా….
ఎల్బీనగర్ నుంచి చౌటుప్పల్ వరకు ఎక్కడా సిగ్నల్ లేకుండా ఈ విస్తరణ పనులను చేపడుతున్నారు. చింతల్‌కుంట దాటిన తర్వాత ఎన్‌హెచ్- 65 ఎక్స్‌ప్రెస్ వే కోసం ప్రవేశద్వారాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అక్కడి నుంచి దండుమల్కాపూర్ వరకు జాతీయ రహదారిని ఆరు లైన్లతో నిర్మించనున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ఎక్స్‌ప్రెస్ వే మీదకు ఎక్కేందుకు, దిగేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. స్థానిక ప్రజలు జాతీయ రహదారిపైకి రాకుండా ప్రత్యేకంగా ఆరులైన్ల సర్వీసు రోడ్డును కొత్తగూడెం వరకు ఏర్పాటు చేయనున్నారు. పనామా, వనస్థలిపురం సుష్మ, హయత్‌నగర్, పెద్ద అంబర్‌పేట, కోహెడ జంక్షన్, కవాడిపల్లి జంక్షన్, అబ్దుల్లాపూర్‌మెట్, ఇనాంగూడ, బాటసింగారం ప్రాంతాల్లో అండర్ పాస్‌లు నిర్మించనున్నారు.
రూ.25 కోట్లతో బ్రిడ్జి పనులు
ఎన్‌హెచ్-65 రహదారి విస్తరణకు అనుగుణంగా ఇప్పటికే కొత్తగూడెం వద్ద వాగుపై బ్రిడ్జి నిర్మాణాన్ని 8 లైన్లతో చేపట్టారు. రూ.25 కోట్ల వ్యయంతో బ్రిడ్జి, 1.2 కిలోమీటర్ల మేర ఎనిమిది లైన్ల రోడ్డు నిర్మాణ పనులు సాగుతున్నాయి. ఒక వైపు నాలుగు లైన్లు బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తవగా, మరో వైపు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. డిసెంబరు కల్లా పనులు పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.