హైదరాబాద్: తెలంగాణలో కరెంటు బిల్లులు షాక్ కొడుతున్నాయి. కరెంటు చార్జీలను 5శాతం మాత్రమే పెంచామని డిస్కమ్‌లు చెబుతుండగా… వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. 100 యూనిట్లలోపు విద్యుత్తును వినియోగించే వాడేవారికి ఏకంగా 60 శాతానికి పైగా చార్జీలు పెరిగాయి. దీంతో పేద, మధ్యతరగతి ప్రజలపై తీవ్ర భారం పడుతోంది. ఇక 200 యూనిట్లలోపు వినియోగించేవారికి 27 శాతం పెరిగాయి. రాష్ట్రంలో విద్యుత్తు చార్జీల పెరుగుదల ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రాగా.. బిల్లులు వారం రోజులుగా వినియోగదారుల చేతికొస్తున్నాయి. మార్చి నెలలో 83 యూనిట్ల విద్యుత్తును వినియోగించిన ఒక వినియోగదారుడికి రూ.188 బిల్లు రాగా, ఏప్రిల్‌లో 89 యూనిట్లు వాడినందుకుగాను ఏకంగా రూ.307 బిల్లు వచ్చింది. మరో వినియోగదారుడు మార్చి నెలలో 123 యూనిట్ల విద్యుత్తును వినియోగించినందుకు రూ.476 బిల్లు రాగా, ఏప్రిల్‌లో 127 యూనిట్ల వినియోగానికి ఏకంగా రూ.639 బిల్లు వేశారు.
వాస్తవానికి కరెంటు చార్జీల పెంపునకుగాను డిస్కమ్‌లు తెలంగాణ రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి (టీఎస్ ఈఆర్ సీ)కి సమర్పించిన పిటిషన్లలో గృహ వినియోగదారులకు 800 యూనిట్ల వరకు వినియోగానికిగాను యూనిట్‌కు 50 పైసలు చొప్పున పెంచుతామని పేర్కొన్నాయి. అయితే దీనికితోడు గతంలో ఎప్పుడూ లేని స్థిర చార్జీలను కొత్తగా వసూలు చేస్తున్నాయి. ఈ స్థిర చార్జీలను రూ.15 చొప్పున వసూలు చేస్తామని ఈఆర్‌సీకి డిస్కమ్‌లు తెలుపగా.. రూ.10 వసూలు చేయాలని ఈఆర్‌సీ ఆదేశించింది. అయినా.. కొన్ని శ్లాబ్‌లకు సంబంధించి రూ.14 దాకా వేశారు. మరోవైపు వినియోగదారుల చార్జీలను కూడా పెద్దమొత్తంలో పెంచారు. అయితే 200 యూనిట్లకు పైగా వినియోగించుకునే వారి విషయంలో మొత్తం బిల్లులో గతంతో పోలిస్తే పెద్దగా తేడా ఉండటంలేదు. కానీ, 100 యూనిట్ల లోపు విద్యుత్తును వినియోగించుకునే పేద, మధ్య తరగతి ప్రజలపైనే అదనపు భారం పడుతోంది. కరెంటు చార్జీల పెంపు వల్ల చివరికి ఈ వర్గమే భారాన్ని మోయాల్సివస్తోంది.