డివిసి తీరుపై మమత ఫిర్యాదు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో భారీ వర్షాలతో జనం నానా బాధలకు గురయ్యారు. మహానగరం కోల్‌కతాలో పలు ప్రాంతాలు నీటమునిగాయి. గత కొద్దిరోజులుగా రాష్ట్రంలో పలు ప్రాంతాలలో కుండపోత వానలు పడుతున్నాయి. రవాణా సౌకర్యాలు స్తంభించాయి. ఆరు జిల్లాలో వర్షం కల్లోలం సృష్టించింది. ఇప్పటికి వరద సంబంధిత ఘటనలతో 15 మంది మృతి చెందారు. లక్షలాది మంది నిరాశ్రయులు అయ్యారు. బెంగాల్‌లో భారీ వర్షాలు వరదల పరిస్థితిపై రాష్ట్ర ముఖ్యమంత్రి మమత బెనర్జీతో ప్రధాని మోడీ బుధవారం ఫోన్‌లో మాట్లాడారు. పూర్తి స్థాయిలో కేంద్రం సాయం అందుతుందని ప్రకటించారు.ఈ సందర్భంగా మమత ప్రధానితో దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ ( డివిసి) వైఖరిపై తీవ్రంగా మండిపడ్డారు. ఈ కార్పొరేషన్ వైఖరితో జరిగిన నష్టం పూర్తిగా మానవ తప్పిదం అయిందన్నారు. డ్యాం ల నుంచి నీటిని సరైన పద్థతిలో వదలకుండా, అసమగ్రరీతిలో పంపించారని, దీనితో ఆకస్మిక వరదలకు ప్రజలు గురయ్యారని ఆరోపించారు.