Friday, December 27, 2024

అలవికాని హామీలు… వారెంటీలేని గ్యారెంటీలు

- Advertisement -
- Advertisement -
తుక్కుగూడ హామీలు దేశవ్యాప్తంగా ఎందుకు అమలుచేయరు?
కాంగ్రెస్ హామీలపై మంత్రి హరీశ్‌రావు విసుర్లు

మనతెలంగాణ/హైదరాబాద్ : అలవికాని హామీలు, అబద్ధాల ఆరోపణలు, చరిత్ర వక్రీకరణలు.. కాంగ్రెస్ సభ సాంతం ఆత్మవంచన, పరనిందగా సాగిందని బిఆర్‌ఎస్ నాయకులు, రాష్ట్ర ఆర్ధిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ట్విట్టర్ వేదికగా విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చే గ్యారంటీలు దేవుడెరుగు, అసలు కాంగ్రెస్‌కు ఓట్లు పడతాయనే గ్యారంటే లేదని ఎద్దేవా చేశారు. గాలికి పోయే పేల పిండి కృష్ణార్పణం అన్నట్టుంది కాంగ్రెస్ పార్టీ విజయభేరి సభలో ఇచ్చిన హామీలు అని పేర్కొన్నారు. నెత్తి నాది కాదు.. కత్తినాది కాదు… అధికారంలోకి వచ్చేది ఉందా, ఇచ్చేది ఉందా అనుకుంటూ బూటకపు హామీలు ఇస్తున్నారని మండిపడ్డారు. పైగా మీరు చెప్పిన గ్యారెంటీలు కూడా మా కెసిఆర్ అమలు చేస్తున్న పథకాల్లో నుంచి కాపీ కొట్టినవే అని ఆరోపించారు.

మీది జాతీయ పార్టీనా? లేక ప్రాంతీయ పార్టీనా? రాష్ట్రానికో మేనిఫెస్టో ఎందుకు? అని నిలదీశారు. దేశవ్యాప్తంగా హైదరాబాద్‌లో చెప్పిన గ్యారెంటీలు అమలు చేస్తామని ఎందుకు చెప్పలేకపోతున్నారు..? అని ప్రశ్నించారు. మీ సీడబ్ల్యూసీలోనే తీర్మానం చేయవచ్చు కదా..? ఎందుకు చేయలేదు..? మీరిచ్చింది వారెంటీలు లేని గ్యారెంటీలు అని ఎద్దేవా చేశారు. కర్నాటకలో మీరు ఇట్లానే ఇచ్చి, ఇప్పుడు వాటిని అమలు చేయలేక వంద రోజుల్లోనే ఆగం ఆగం అవుతున్నారని విమర్శించారు. కరెంటు లేదని రైతులు, పారిశ్రామికవేత్తలు ధర్నాలు చేస్తున్నారని, ఛార్జీలు పెంచి ప్రజల నడ్డి విరిచారని అన్నారు. అక్కడ మీరు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నారా..? అని నిలదీశారు. ఏరుదాటక తెప్ప తగలబెట్టేరకం మీరు..అంటూ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఇచ్చినట్టు మీరు దేశవ్యాప్తంగా రైతుబంధు, రైతు బీమా, దళితబంధు పథకాలు ఇస్తారా..? అలా ఎందుకు చెప్పలేకపోతున్నారు..? ఎన్నికలపుడు వచ్చుడు.. నోటికి వచ్చింది చెప్పుడే తప్ప మీరు ఇచ్చే గ్యారెంటీలను అమలు చేసేది ఎవరు? అని నిలదీశారు. 2014లో కాంగ్రెస్ ఇట్లనే భూటకపు హామీలు ఇస్తే 44 ఎంపీ సీట్లు వచ్చాయని, 2019లో 52 వచ్చాయని పేర్కొన్నారు.
రాహుల్ గాంధీ.. అవగాహన పెంచుకోండి…
రాహుల్ గాంధీ అజ్ఞానానికి జోహార్లు అంటూ హరీశ్‌రావు ఎద్దేవా చేవారు. రాష్ట్రపతి ఎన్నికల్లో తాము బిజెపికి మద్దతు ఇవ్వలేదని, కావాలంటే మీరు పేపర్లు తిరగేసి చూడండి అంటూ రాహుల్ గాంధీకి సూచించారు. తాము యశ్వంత్ సిన్హాకు మద్దతు ఇచ్చామని, బాజాప్తా ఆయనకు తమ పార్టీ ఓటేసిందని స్పష్టం చేశారు. తెలంగాణాకు యశ్వంత్ సిన్హాను పిలిచి భారీ సభ పెట్టాం… మీ నేతలనే అడగండి అని పేర్కొన్నారు. అవగాహన పెంచుకోండి అని సూచించారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా తాము బిజెపికి మద్దతు ఇవ్వలేదని చెప్పారు. జిఎస్‌టి బిల్లును తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని.. కాంగ్రెస్ జిఎస్‌టి బిల్లుకు మద్దతు ఇవ్వడం లేదా..? మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో జిఎస్‌టి ఉన్నదా.. లేదా? ఎవరి చెవిలో పువ్వులు పెడుతున్నారు? ఎందుకీ నయవంచక ముచ్చట్లు అని విమర్శించారు. ఎవరు ఎవరితో కుమ్మక్కయ్యారో తెలియదా? అని నిలదీశారు.

గుజరాత్ ఎన్నికలపుడు నీ జోడో యాత్ర గుజరాత్‌కు ఎందుకు వెళ్లలేదని రాహుల్‌గాంధీని ప్రశ్నించారు. తమ దగ్గర హుజురాబాద్, మునుగోడు అసెంబ్లీకి ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ నేరుగా.. సిగ్గులేకుండా బిజెపికి సపోర్టు చేయడం మీకు తెలియదా..? అని రాహుల్‌గాంధీని నిలదీశారు. ఇడి, సిబిఐలు వేటకుక్కల్లా తమ నేతలను వేధిస్తున్నాయని, అది రాహుల్‌గాంధీకి కనిపిస్తలేదా..? అని ప్రశ్నించారు. తమ మంత్రులు మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్, ఎంఎల్‌సిలు కల్వకుంట్ల కవిత, ఎల్.రమణ, ఎంఎల్‌ఎ మంచి రెడ్డి కిషన్ రెడ్డి తదితరులపై బిజెపి ఇడి, సిబిఐల పేరుతో వేధించినది మీకు కనిపిస్తలేదా..? అని నిలదీశారు. మీకు సంబంధించిన నేషనల్ హెరాల్డ్ కేసు ఎందుకు అటకెక్కిందో చెప్పగలరా? రాబర్ట్ వాద్రా కంపెనీల అక్రమాలపై బిజెపి సర్కారు ఎందుకు చర్యలు తీసుకోలేదు?… తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు ఒక్క కాంగ్రెస్ నేతపై కూడా ఇడి, సిబిఐల కేసులు ఎందుకు లేవు..? అంటూ ప్రశ్నలు సంధించారు. బిజెపి, కాంగ్రెస్ మిలాఖాత్ కావడం ప్రపంచానికి తెల్సిన విషయమే అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
మీది కాంగ్రెస్ కాదు.. స్కాంగ్రెస్
అవినీతి గురించి మీరు మాట్లాడడమంటే గొంగట్లో కూర్చొని తింటూ వెంట్రుకలు ఏరినట్టుందని కాంగ్రెస్ పార్టీని ఉద్దేశిస్తూ హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. మీ హయాంలో జరిగిన కుంభకోణాల గురించి చెప్పాలంటే.. వేలున్నాయని, స్కాంల సంస్కృతిని ప్రవేశపెట్టిందే మీరని పేర్కొన్నారు. మీది కాంగ్రెస్ కాదు.. స్కాంగ్రెస్ అని…బోఫోర్స్ నుంచి దాణా, చక్కర కుంభకోణాలు …ఒకటా.. రెండా.. దేశంలో అవినీతికి కేరాఫ్ అడ్రెస్సే మీరు అని విమర్శించారు. ఏ కోణంలో చూసినా కాంగ్రెస్‌లో కుంభకోణమే కనిపిస్తుందని అన్నారు. అవినీతి గురించి కాంగ్రెస్ మాట్లాడితే తోడేలు శాకాహారం గురించి మాట్లాడినట్టు ఉంటదని పేర్కొన్నారు. తెలంగాణ ఎవరి దయతోనూ రాలేదు….ప్రజలు పోరాడి గెలుచుకున్నరని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ దయతో తెలంగాణ ఇచ్చి ఉంటే వందలాది మంది యువకులు ఎందుకు బలిదానం చేసుకున్నరని మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News