భారత్, మారిషస్ తమ సంబంధాలను బుధవారం ‘వ్యూహాత్మక భాగస్వామ్యం’ స్థాయికి పెంచుకున్నాయి. వాఱిజ్య, సాగరప్రాంత భద్రత సహా పలు రంగాల్లో సహకారం పెంపునకు ఎనిమిది ఒప్పందాలపై రెండు దేశాలు సంతకాలు చేశాయి. గ్లోబల్ సౌత్ అభివృద్ధి కోసం ఆశావహ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించారు. సంతకాలు జరిగిన ఒప్పందాల వల్ల సీమాంతర లావాదేవీలకు సంబంధించి జాతీయ కరెన్సీల వాడకాన్ని ప్రోత్సహించడానికి, సాగరప్రాంత డేటా పంచుకోవడానికి, మనీ లాండరింగ్‌పై పోరాటంలో సంయుక్తంగా కృషి చేయడానికి, ఎంఎస్‌ఎంఇ రంగంలో సహకారం పెంపొందించడానికి వీలు కలుగుతుంది. పోర్ట్ లూయిస్‌లో తన రెండు రోజుల పర్యటన రెండవ, ఆఖరి రోజు ప్రధాని మోడీ మారిషస్ జాతీయ దినోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భారత నౌకాదళం యుద్ధ నౌక, భారత వైమానిక దళం (ఐఎఎఫ్) ఆకాశ్ గంగ స్కైడైవింగ్ బృందంతో పాటు భారత సాయుధ దళాల బృందం కూడా ఆ ఉత్సవాల్లో పాల్గొన్నది.
మారిషస్ ప్రధాని నవీన్‌చంద్ర రామ్‌గూలామ్‌తో చర్చల అనంతరం ప్రధాని మోడీ గ్లోబల్ సౌత్ కోసం భారత కొత్త ధ్యేయాన్ని ప్రకటించారు. ఆయన దానికి ‘మహాసాగర్’ లేదా ‘మ్యూచువల్ అండ్ హోలిస్టిక్ అడ్వాన్స్‌మెంట్ ఫర్ సెక్యూరిలీ అండ్ గ్రోత్ అక్రాస్ రీజియన్స్’ ‘ప్రాంతాల వ్యాప్తంగా భద్రత, వృద్ధి కోసం పరస్పర, సంపూర్ణ ఆధునికీకరణ) అని నామకరణం చేశారు. హిందూ మహాసముద్రంలో తన ప్రభావం విస్తరణకు చైనా అవిశ్రాంతంగా ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో దానిని కట్టడి చేసేందుకు విధానపరమైన దృక్పథంగా ఆ ధ్యేయాన్ని అభివర్ణించారు. స్వేచ్ఛాయుత, సార్వత్రికమైన, భద్రమైన, సురక్షితమైన హిందూ మహాసముద్ర ప్రాంతం భారత్, మారిషస్‌లకు ఉమ్మడి ప్రాధాన్యం అని, రక్షణ సహకారం, సాగరప్రాంత భద్రత రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంలో ముఖ్యమైన భాగం అని తాను, రామ్‌గూలామ్ అంగీకరించామని మోడీ వెల్లడించారు. ‘మారిషస్ ప్రత్యేక ఆర్థిక మండలం భద్రతలో పూర్తి సహకారం అందించేందుకు మేము నిబద్ధులమై ఉన్నాం’ అని ప్రధాని మోడీ తన మీడియా ప్రకటనలో తెలియజేశారు.
2015లో మారిషస్‌లో తన పర్యటన సమయంలో న్యూఢిల్లీ ‘సాగర్’ లేదా ‘సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ది రీజియన్’ (ఈ ప్రాంతంలో అందరికీ భద్రత, వృద్ధి) విధానాన్ని ప్రకటించిన పది సంవత్సరాల అనంతరం కొత్త పథకం ఆవిష్కరణ చోటు చేసుకున్నది. హిందూ మహాసముద్ర ప్రాంతంతో భారత్ సంబంధాలకు ఆ విధానం మూల స్తంభంగా నిలచింది. ‘ఈ మొత్తం ప్రాంతం సుస్థిరత, సౌభాగ్యం కోసం సాగర్ ధ్యేయాన్ని ముందుకు తీసుకువెళ్లాం. దీనిని సాగర్‌ను మించి మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు గ్లోబల్ సౌత్ కోసం మా ధ్యేయం ‘మహాసాగర్’ అవుతుందని చెప్పాలని అనుకుంటున్నాను’ అని ప్రధాని మోడీ తన మీడియా ప్రకటనలో తెలిపారు. మారిషస్‌లో పార్లమెంట్ కొత్త భవనం నిర్మాణంలో న్యూఢిల్లీ సహకరిస్తుందని, అది ‘ప్రజాస్వామ్య మాతృభూమి’ నుంచి ఈ ద్వీప దేశానికి ఒక కానుక అని కూడా భారత ప్రధాని తెలియజేశారు. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సహకారం గురించి మోడీ ప్రస్తావిస్తూ, మారిషస్ కోస్ట్ గార్డ్ అవసరాలు తీర్చడానికి సాధ్యమైన సహాయం అందజేయనున్నట్లు, మారిషస్‌లో ఒక పోలీస్ అకాడమా,
జాతీయ సాగరప్రాంత సమాచార పంపిణీ కేంద్రం ఏర్పాటులో న్యూఢిల్లీ సాయపడనున్నట్లు తెలిపారు. చాగోస్ విషయంలో మారిషస్ సర్వసత్తాక ప్రతిపత్తిని తాము పూర్తిగా గౌరవిస్తామని మోడీ తెలియజేశారు. హిండూ మహాసముద్రంలో చాగోస్ దీవులపై యుకెతో పరస్పర ప్రయోజనకర ఒప్పందానికి రావడంలో మారిషస్ కృషికి భారత్ మద్దతు ఇస్తున్నది. పశ్చిమ హిందూ మహాసముద్రంలో ద్వీప దేశమైన మారిషస్‌తో భారత్‌కు దీర్ఘకాలంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆ ద్వీప దేశం జనాభా 12 లక్షల్లో సుమారు 70 శాతం వరకు భారత సంతతివారే ఉండడం భారత్ ప్రత్యేక సంబంధాలకు కీలక కారణం. కాగా, 2005 నుంచి భారత్ మారిషస్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామ్య దేశాల్లో ఒకటిగా ఉన్నది.