జనవరి 1న ఆనవాయితీగా అమలు
న్యూఢిల్లీ: మూడు దశాబ్దాల ఆనవాయితీని కొనసాగిస్తూ భారత్, పాకిస్తాన్ సోమవారం రెండు దేశాలు పరస్పరం దాడి చేసుకోవడాన్ని నిరోధించేందుకు కుదుర్చుకున్న ద్వైపాక్షిక ఒప్పందం కింద తమ అణు కేంద్రాల జాబితాలను పరస్పరం మార్పిడి చేసుకున్నాయి. అణు కేంద్రాల, స్థావరాలపై పరస్పర దాడిని నిషేధించే ఒప్పంద నిబంధనల కిద ఈ జాబితా మార్పిడి జరిగినట్లు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సోమవారం ప్రకటించింది.
న్యూఢిల్లీ, ఇస్లామాబాద్‌లోని దౌత్యపర వర్గాల ద్వారా ఈ కార్యక్రమం ఏకకాలంలో జరిగినట్లు తెలిపింది. 1998 డిసెంబర్ 31న భారత్, పాకిస్తాన్ మధ్య కుదిరిన ఈ ఒప్పందం 1991 జనవరి 27 నుంచి కార్యరూపం దాల్చింది. ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీన రెండు దేశాలు ఒప్పందం పరిధిలోకి వచ్చే అణు కేంద్రాలు, స్థావరాల జాబితాను పరస్పరం ఇచ్చి పుచ్చుకోవాల్సి ఉంటుంది. కశ్మీరు సమస్య, సీమాంతర ఉగ్రవాదం నేపథ్యంలో రెండు దేశాల మధ్య జాబితా మార్పిడి జరిగింది. జాబితా మార్పిడి మొట్టమొదటిసారి 1992 జనవరి 1న జరుగగా వరుసగా 33వ సంవత్సరంగా ఇప్పుడు జరిగింది.