పూరీజగన్నాధ్, తరుణ్‌ల శాంపిల్స్‌లో డ్రగ్స్ ఆనవాళ్లు లేవు : ఎక్సైజ్ శాఖ
మన తెలంగాణ/హైదరాబాద్: చిత్ర పరిశ్రమలో తీవ్ర కలకలం రేపిన డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ శాఖ నిందితుడు కెల్విన్ వాంగ్మూలం నమోదు చేయడం తెలిసిందే. సినీ తారలు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు డ్రగ్స్ విక్రయించినట్లు కెల్విన్ తన వాంగ్మూలంలో వెల్లడించాడు. అయితే, ఇటీవల వచ్చిన ఫోరెన్సిక్ రిపోర్టులో పూరీ జగన్నాథ్, తరుణ్‌ల శాంపిల్స్‌లో ఎలాంటి డ్రగ్స్ ఆనవాళుల లేవని వెల్లడైంది. ఈ నేపథ్యంలో ఎక్జైజ్ శాఖ కెల్విన్ వాంగ్మూలం నమ్మశక్యంగా లేదని పేర్కొంది. కెల్విన్ చెప్పిన విషయాలను ఆధారాలుగా భావించలేమని వివరించింది. పూరీ జగన్నాథ్, తరుణ్ శాంపిల్స్‌లో డ్రగ్స్ ఆనవాళ్లు లేవన్నది ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదికలో స్పష్టమైందని వెల్లడించింది. సెలబ్రిటీలను నిందితులుగా చేర్చేందుకు కేవలం కెల్విన్ వాంగ్మూలం సరిపోదని ఎక్సైజ్ శాఖ స్పష్టం చేసింది. సెలబ్రిటీలు, అనుమానితుల వద్ద డ్రగ్స్ లభించలేదని తెలిపింది.
ఛార్జ్‌షీట్‌లో ఏం చెప్పిందంటే..!
డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖులపై బలమైన ఆధారాలు లేవని ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. రంగారెడ్డి జిల్లా కోర్టులో కెల్విన్‌పై ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన ఎక్సైజ్ శాఖ నటుల విచారణను ప్రస్తావించింది. కెల్విన్‌కు మంగళూరులో చదువుకుంటున్నప్పట్నించీ డ్రగ్స్ అలవాటు ఉందని, 2013 నుంచి మిత్రులకు డ్రగ్స్ విక్రయించేవాడని ఎక్సైజ్ శాఖ ఛార్జ్ షీట్‌లో పేర్కొంది. గోవా, విదేశాల నుంచి డార్క్ వెబ్ ద్వారా డ్రగ్స్ తెప్పించాడని, వాట్సాప్, మెయిల్ ద్వారా ఆర్డర్లు తీసుకుని డ్రగ్స్ సరఫరా చేశాడని వివరించింది. చిరునామాలు, ఇతర కీలక వివరాలు దర్యాప్తులో కెల్విన్ వెల్లడించలేదని ఎక్జైజ్ అధికారులు తెలిపారు. కెల్విన్, అతడి స్నేహితులు నిశ్చయ్, రవికిరణ్ ప్రమేయంపై ఆధారాలున్నాయని ఛార్జిషీట్‌లో పేర్కొన్నారు. సోదాల సందర్భంగా కెల్విన్ వంట గది నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడని ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. నటులపై కెల్విన్ వాంగ్మూలం దర్యాప్తును తప్పుదోవపట్టించేలా ఉందని పేర్కొంది. నిందితులు, సాక్షుల జాబితాలో సినీ తారల పేర్లు పొందుపర్చలేమని ఎక్సైజ్ శాఖ వివరించింది.
డ్రగ్స్ కథ కంచికేనా..?
డ్రగ్స్ కధ కంచికేనా…? 2017లో అనేక మంది సినీ ప్రముఖులను ఎక్సైజ్ శాఖ విచారించింది. ఇప్పుడు వారందరిలో 12 మందికి క్లీన్ చిట్ ఇచ్చింది. డ్రగ్స్ కేసులో పూరీ జగన్నాథ్, రవితేజ, ఛార్మి, ముమైత్‌ఖాన్, తనిష్, నవదీప్ తరుణ్ వంటి వారిని గంటలు గంటలు విచారించింది. వీరందరి రక్తం, గోళ్లు వంటి వాటిని సేకరించింది. టాలీవుడ్‌లో డ్రగ్స్ వాడకం ఎక్కువగా ఉందని అప్పట్లో ఎక్సైజ్ శాఖ పేర్కొంది. అయితే ప్రస్తుతం 12 మంది సినీ ప్రముఖులకు ఎక్సైజ్ శాఖ క్లీన్ చిట్ ఇవ్వడం రాజకీయ రంగు పులుముకుంది. కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టు ఆధారంగా వారెవ్వరూ డ్రగ్స్ తీసుకోలేదని కోర్టులో వేసిన ఛార్జిషీట్‌లో పేర్కొంది.
ఇన్నేళ్ల తర్వాత నివేదికను బయటపెట్టడం అనేక అనుమానాలకు తావిస్తోంది. నిజానికి గతేడాది డిసెంబర్‌లో ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి రిపోర్టు వచ్చిందన్నారు. పదినెలల తర్వాత దీనిని బయటపెట్టడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇంత హడావుడి ఎందుకు చేసినట్లు? వారి వద్ద సరైన ఆధారం లేకపోతే ఎందుకు ఇంత డ్రామా చేసినట్లు అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మొత్తం మీద టాలీవుడ్ డ్రగ్స్ కేసు అటకెక్కినట్లే. సినిమా మాదిరిగానే దీని కథ కూడా సుఖాంతమైనట్లే..!