దివాళి రోజే అమలులోకి: కేంద్రం
న్యూఢిల్లీ : దేశంలో దివాళి దశలో కేంద్రం పెట్రోధరల మంటల చల్లార్పు దిశలో అడుగేసింది. పెట్రోలు డీజిల్ ధరలపై ఎక్సైజ్ సుంకాలను తగ్గించింది. పెట్రోలుపై రూ 5, డీజిల్‌పై రూ 10 మేరకు ఈ సుంకం తగ్గింపు గురువారం నుంచి అమలులోకి వస్తుందని ప్రకటించింది. వావాహనదారులకు ఊరట కల్గించేందుకు రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని కోరింది. పెట్రో ఉత్పత్తులపై వ్యాట్‌ను తగు విధంగా తగ్గించడం ద్వారా ఈ ధరలకు కళ్లెం వేయవచ్చునని వివరించింది. ఈ మేరకు తగు అధికారిక ప్రకటన వెలువరించింది. చాలా కాలంగా పెట్రోలు డీజిల్ ధరల పెంపుదలతో వినియోగదారులు ఇక్కట్లకు గురవుతున్నారు. ఇప్పుడు ఎక్సైజ్ సుంకం తగ్గింపుతో ఇందుకు అనుగుణంగా ధరలు తగ్గుతాయని అధికార వర్గాలు తెలిపాయి. డీజిల్‌పై పదిరూపాయల సుంకం ఎత్తివేతతో రబీసీజన్‌లో రైతాంగానికి మేలు జరుగుతుందని తెలిపారు.
వారు ట్రాక్టర్లు, మోటార్ల వినియోగానికి వాడే డీజిల్ తక్కువ ధరకు దక్కుతుందని తెలిపారు. అయితే దేశవ్యాప్తంగా పెట్రో ఉత్పత్తుల ధరలు విపరీత స్థాయికి చేరిన తరువాతి దశలో ఇప్పుడు ఉపశమన చర్యలు చేపట్టారని, దీని వల్ల ఎటువంటి ఫలితం ఉంటుందనేది చూడాల్సిందేనని వినియోగదారులు వాపోతున్నారు. తగ్గింపు అంటూ ఉంటే అది నామమాత్రమే అవుతుందని భావిస్తున్నారు. దేశంలో బుధవారం పలు పన్నులు సుంకాల భారంతో పెట్రో ఉత్పత్తుల ధరలు మరింత పెరిగాయి. ఢిల్లీలో లీటరు పెట్రోలు రూ 110 కి చేరింది. ఇక డీజిల్ ధర రూ 98.42 పైసలు దాటింది. ఇతర నగరాలలో కూడా ఇదే విధమైన ధరలుఉన్నాయి. గత ఏడాది పెట్రోలుపై ఎక్సైజ్ డ్యూటీని లీటరుకు భారీగా పెంచారు. అంతకు ముందు రూ 19.98 ఉండగా ఇది ఏకంగా రూ 32.9 పైసలుకు చేరింది.