Friday, January 24, 2025

అమెరికా ఫలితాలపై ఉత్కంఠ

- Advertisement -
- Advertisement -

అగ్రదేశంగా పేర్కొంటున్న అమెరికా వైపు ప్రస్తుతం ప్రపంచంలోని అన్నిదేశాలు దృష్టి సారిస్తున్నాయి. అందుకు వారం రోజుల్లో జరుగబోతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ప్రపంచంలో ప్రధానంగా అధ్యక్ష తరహా పార్లమెంటరీ వ్యవస్థ, -ప్రజాస్వామ్య పార్లమెంటరీ పాలనా వ్యవస్థలు ఉన్నాయి. ఇందులో అమెరికన్లు అధ్యక్ష తరహా పాలన విధానాన్ని ఎంచుకున్నారు. ఫలితంగా అధ్యక్షుడే అక్కడ సర్వాధికారి. ఆయన నిర్ణయానికి తిరుగులేదు. ఎవరినీ అడగకుండానే నిర్ణయం తీసుకోగలిగే సూపర్ పవర్స్ ఉంటాయి. అందుకే అధ్యక్షుడు చేసిన ప్రతి ప్రకటన ప్రపంచ దేశాలపై ప్రభావం ఉంటుంది. మరి అంత శక్తివంతమైన అధ్యక్షుని ఎన్నిక కావడానికి నిర్వహించే ప్రక్రియ కూడా అత్యంత పకడ్బందీగా ఉంటుంది. అధ్యక్షుని ఎన్నిక కాలపరిమితి మాత్రం నాలుగు సంవత్సరాలే.

అక్కడ ఏ సంవత్సరంలో ఎన్నికలు జరగాలి? ఏ రోజు ఎన్నికలు నిర్వహించాలి? ఎప్పుడు ఫలితాలు ప్రకటించాలి? ఎప్పుడు కొత్త అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం చేయాలి? లాంటివన్నీ ముందుగానే నిర్ణయిస్తారు. ఆ విధంగానే ఎన్నికలు షెడ్యూల్ ఉంటుంది. 244 ఏళ్ల అమెరికా ప్రజాస్వామ్య విధానాన్ని పరిశీలించితే స్పష్టమవుతుంది. అమెరికాలో ప్రపంచ నలుమూలల నుండి వచ్చి స్థిరపడ్డ అనేక జాతుల సమ్మేళనం 41% వరకు ఉన్నారు. అమెరికా శ్వేతజాతీయులు 59% వరకు ఉన్నారు. ప్రధానంగా నాలుగు జాతులు ఎన్నికలను ప్రభావితం చేస్తుంటాయి. శ్వేత జాతీయులు అధిక సంఖ్యలో 58.9% ఉన్న ఆప్రో అమెరికన్లు -12.6%, లాటిన్ అమెరికా దేశాల నుంచి వచ్చి స్థిరపడ్డ స్పానిష్ మాట్లాడే హిస్మానియన్లు- 19.1%, ఆసియా దేశాల నుంచి వచ్చిన ఆసియన్లు -6.1%, వీరి ఓట్లే ఫలితాలను తారుమారు చేసే అవకాశం ఉంది. దేశంలో అత్యధిక సంఖ్యలో ఉన్న తెల్లవారిలో అత్యధికులు రిపబ్లికన్ పార్టీ వైపు మొగ్గు చూపుతుంటారు.

గత 15 సంవత్సరాలు అమెరికాలో వేగంగా విస్తరిస్తున్న వర్గం ఆసియా దేశాలవారు. 2010 నుంచి 2022 నాటికి వీరి జనాభా అమెరికాలో 27% పెరిగింది. ఇండియా నుంచి వచ్చిన వారి సంఖ్య 28 లక్షల వరకు ఉన్నారని తెలుస్తుంది. సాధారణంగా వలస వచ్చి స్థిరపడిన వారిలో ఎక్కువ భాగం డెమొక్రాట్ల వైపు మోగ్గు చూపుతూ వస్తున్నారు. దేశంలోని 50 రాష్ట్రాలు ఎన్నికల్లో పాల్గొంటారు. ప్రతి రాష్ట్రంలో జనాభా ఆధారంగా నిర్దిష్ట సంఖ్యలో ఎలక్ట్రోరల్ కాలేజీ ఓట్లు ఉంటాయి. మొత్తం 538 ఎలక్ట్రోరల్ కాలేజీ ఓట్లలో కనీసం 270 లేదా అంతకుమించి సాధించిన వారు విజేతలవుతారు. 18 ఏళ్లు నిండిన వారు ఓటుకు అర్హులవుతారు. ఈసారి 244 మిలియన్ల్ ఓటర్లు కొత్త అధ్యక్షుని నవంబర్ 5న ఎన్నుకుంటారు. కొత్త సంవత్సరం జనవరి 20న అధ్యక్షులు ప్రమాణ స్వీకారం చేస్తూ పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు. అమెరికా ప్రెసిడెంట్ రేసులో డెమొక్రాటిక్ పార్టీ తరపున ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హ్యారీష్, రిపబ్లికన్ పార్టీ తరపున మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మధ్య హోరాహోరీగా తలపడుతున్నారు. ప్రెసిడెంట్ రేస్‌లో దూసుకుపోతున్న భారత సంతతికి చెందిన కమలా హ్యారీష్ డెమొక్రాటిక్ పార్టీ సభ్యురాలు. రాజకీయవేత్త, న్యాయవాది.

కమలా హ్యారీష్ మొదటి ఆఫ్రికన్ అ-మెరికన్. మొదటి ఆసియా అమెరికన్, కాగా అమెరికా చరిత్రలో ఆమె గెలిస్తే అమెరికా మొదటి మహిళా అధ్యక్షురాలు అవుతారు. ప్రపంచంలో అగ్రరాజ్యంగా నిలిచిన అమెరికా పాలనా యంత్రాంగంలో కీలకమైన ఉపాధ్యక్ష పదవిని కైవసం చేసుకున్నారు. ప్రస్తుతం పోటీలో ఉన్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ పెద్ద పారిశ్రామికవేత్త. మాజీ దేశాధ్యక్షుడుగా కొంత అవినీతిని, నియంతృత్వాన్ని మూటగట్టుకున్న వ్యక్తిగా, గత పది ఏళ్లలో ఒకసారి ఓడిపోయి, మరొకసారి గెలుపునకు ప్రయత్నం చేస్తున్నారు. అక్రమ వలసదారుల విషయంలో ట్రంపు వైఖరి కఠినంగా ఉంటుంది. తన ప్రచారంలో భాగంగా ట్రంప్ దూకుడుగా, రెచ్చగొట్టే వాక్యాలు చేస్తుంటారు. ప్రత్యర్థిపై వీలైనంత అసభ్య పదజాలంతో విరుచుకు పడుతుంటారు. తాను ఎన్నికయ్యాక తన వ్యతిరేకుల సంగతి తేలుస్తానని హెచ్చరిస్తూ ఉంటారు.

అమెరికా ప్రెసిడెంట్‌ని నిర్ణయించేది స్వింగ్ స్టేట్స్ ఓటర్లే! అమెరికాలోని 50 రాష్ట్రాలలో 7 స్వింగ్ స్టేట్స్ కీలకంగా మారాయి. స్వింగ్ స్టేట్స్ అయినా పెన్సిల్వేనియా, మిచిగాన్, నార్త్ కరోలినా, ఆరిజోనా, విస్కాన్ సిస్, అరిజోనా, నేవాడా ఈ ఏడు రాష్ట్రాలలో తీర్పే విజేతను నిర్ణయించే అవకాశం ఉందని సర్వేలు తెలుపుతున్నాయి. ఈ ఏడు ప్రధాన రాష్ట్రాల్లో మూడు రాష్ట్రాలు మాత్రమే కమలా హ్యారీష్‌కు మద్దతుగా నిలుస్తున్నట్టు, మిగతా రాష్ట్రాల్లో స్వల్ప ఆధిక్యతతో రిపబ్లికం పార్టీ అధ్యక్ష అభ్యర్థి ట్రంప్ ఉన్నట్టు తెలుస్తుంది. దేశంలో వెలువడుతున్న సర్వేలను బట్టి చూస్తే ఇప్పటివరకు కమల, ట్రంపు మధ్యన 1-2% ఓట్లు తేడా ఉన్నట్లు వార్తలు వెలుబడుతున్నాయి. ఇంకా దాదాపు 5% మంది ఓటర్లు ఎవరికి ఓటెయ్యాలో నిర్ణయించుకోలేదని సర్వేలు వెల్లడిస్తున్నాయి.

అభ్యర్థుల ఉధృత ప్రచారం మధ్య అమెరికా అధ్యక్ష ఎన్నికల ముందస్తు పోలింగ్ ముమ్మరంగా కొనసాగుతుంది. రెండు నెలల ముందు నుంచే ఓటింగ్ నమోదు చేసుకుంటారు. అక్టోబర్ 22వ తేదీ నాటికి సుమారు రెండు కోట్ల ఓట్లు పోలయ్యాయి. ముందస్తు పోలింగ్‌లో ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నవారి సంఖ్య 4.35 కోట్లకు చేరింది. దాదాపు 35 రాష్ట్రాల్లో ముందస్తు పోలింగ్ ప్రారంభం గాక, రానున్న వారంలో మరో 12 రాష్ట్రాల్లో ముందస్తు పోలింగ్ జరగనున్నది. గత ఎన్నికలో 66% పోలింగ్ నమోదయింది. ఈ ఎన్నికల్లో పోలింగ్ పెరుగుతుందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. అమెరికా ఎన్నికల విధానంలో వేరువేరు రాష్ట్రాలకు వేరువేరు నియమాలు, నిబంధనలు ఉన్నాయి. మూడు రాష్ట్రాలు మినహా మిగిలిన రాష్ట్రాల్లో ఓటర్లు ముందస్తు పోలింగ్‌లో పాల్గొనవచ్చు. స్వయంగా గాని, పోస్టు ద్వారా గాని ఓట్లు వేయవచ్చు. ఇద్దరు అభ్యర్థుల మధ్య పోటీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నువ్వా.. నేనా అనే స్థాయికి మారింది. నవంబర్ 5వ తేదీన జరిగే ఎన్నికల్లో విజేత ఎవరో తేలిపోతుంది.

ఉజ్జిని రత్నాకర్ రావు
94909 52646

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News