Monday, January 20, 2025

మూడు స్థానాలపై అదే ఉత్కంఠ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: మూడుస్థానాలకు (ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్) పార్లమెంట్ నియోజకవర్గాలకు కాం గ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించకపోవడంతో ఆ నియోజకవర్గాల్లోని కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈనెల 25వ తేదీన నామినేషన్‌ల గడువు చివరితేదీ కావడంతో శ్రేణుల్లో టెన్షన్ పె రుగుతున్నది. ఈలోగా ఈ మూడు నియోజకవర్గాల్లో ఎవరికీ వా రే ప్రచారాన్ని చేసుకోవడం విశేషం. అందులో భాగంగా కరీంనగర్ ఎంపి అభ్యర్థిగా సోమవారం వెలిచాల రాజేందర్ రావు నా మినేషన్ వేశారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ తరపున అభ్యర్థిని ప్రకటించకున్నా రాజేందర్ రావు నామినేషన్ వేయడం, ఈ నామినేషన్ కార్యక్రమానికి మంత్రి పొన్నంతో పాటు కాంగ్రెస్ శ్రేణులు భారీగా హాజరు కావడం విశేషం. శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించి జోష్ మీదున్న కాంగ్రెస్, లోక్‌సభ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని వ్యూహాలు రచిస్తోంది.

ఇందులో భాగంగా ఇప్పటికే తెలంగాణలోని 17పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించిం ది. మరోవైపు బహిరంగ సభలు, ర్యాలీలు, రోడ్ షోలతో ప్రచారాన్ని హోరెత్తిస్తూ జనంలోకి వెళ్తోంది. ప్రజలకు ఆరు హామీలను వివరిస్తూ బిఆర్‌ఎస్, బిజెపిలపై విమర్శలు చేస్తూ ఓట్లను అభ్యర్థిస్తోంది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ 17 స్థానాలకు గాను 14 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా, మరో మూడింటిని పెండింగ్‌లో ఉంచడంతో కేడర్‌లో గందరగోళం నెలకొంది. ఈ క్రమంలోనే ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థుల ఎంపిక కాంగ్రెస్‌కు పెనుసవాల్‌గా మారింది. తమ వారికి టికెట్లు ఇప్పించుకోవడానికి ముఖ్య నాయకులు ఇప్పటికే రంగంలోకి దిగారు. దీంతో రాష్ట్ర స్క్రీనింగ్ కమిటీ, అటు కేంద్ర ఎన్నికల కమిటీ పలుమార్లు సమావేశాన్ని నిర్వహించినా ఈ మూడు సీట్లపై చర్చలు కొలిక్కి రాకపోవడంతో ఈ సీట్ల అభ్యర్థుల ఎంపికపై వాయిదాల పర్వం సాగుతోంది. రోజుకో పేరు తెరపైకి వస్తుండటంతో ఆశావహులకు, పార్టీ కార్యకర్తలకు ఏఐసిసి నుంచి నిరీక్షణ తప్పడం లేదు.

బెంగళూరులో ఖర్గేతో డిప్యూటీ సిఎం భట్టి, మంత్రి పొంగులేటి భేటీ
ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా రామసహాయం రఘురామ్ రెడ్డి పేరు దాదాపు ఖరారైనట్లు విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు సోమవారం బెంగళూరులో మల్లికార్జున్ ఖర్గేతో జరిగిన సమావేశంలో డిప్యూటీ సిఎం భట్టి, మంత్రులు పొంగులేటి, తుమ్మల నాగేశ్వరరావులకు ఈ విషయం మీద ఖర్గే స్పష్టత ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. మల్లికార్జున్ ఖర్గేతో పాటు డికె శివకుమార్‌ల సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుల అభిప్రాయాలు విడివిడిగా సేకరించాక ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అభిప్రాయభేదాలకు తావు లేకుండా, పార్టీకి నష్టం జరగకుండా మధ్యే మార్గంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

ఇంతకాలం సస్పెన్స్‌కు గురి చేసిన ఖమ్మం సీటు వ్యవహారం సోమవారం ఓ కొలిక్కి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఖమ్మం పార్లమెంట్ హాట్ సీటు కావడం, కాంగ్రెస్ అభ్యర్థి కచ్చితంగా గెలుస్తారన్న ధీమా నెలకొన్న నేపథ్యంలో జిల్లాకు చెందిన మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు తమ కుటుంబ సభ్యులకు ఈ టికెట్‌ను ఇప్పించుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేశారు. ఒకే సీటుపై ముగ్గురు మంత్రులు పట్టుబడుతుండటంతో పార్టీ అధిష్టానానికి అభ్యర్థి ఎంపిక కష్టతరమయ్యింది. ఈ కారణంతో ఇన్ని రోజులు ఆలస్యమయ్యింది. నామినేషన్ల స్వీకరణ దగ్గర పడుతుండటంతో ఈ విషయమై సత్వర పరిష్కారం దిశగా కాంగ్రెస్ అధిష్టానం మంత్రుల అభిప్రాయాలు సేకరించి రామసహాయం రఘురామ్ రెడ్డిని ఎంపిక చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది.

రఘురామ్ రెడ్డిది పాలేరు నియోజకవర్గమే..
రామసహాయం రఘురామ్ రెడ్డి తల్లిదండ్రులు సురేందర్ రెడ్డి, జయమాల దంపతులది కూసుమంచి మండలం చేగొమ్మ. 1961 డిసెంబర్ 19న రఘురామ్ రెడ్డి హైదరాబాద్‌లో జన్మించారు. నిజాం కళాశాలలో బికాం, అనంతరం పిజి డిప్లొమా విద్యను అభ్యసించారు. ప్రస్తుతం వ్యాపార రీత్య ఆయన హైదరాబాద్‌లో ఉంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడైన సురేందర్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని డోర్నకల్ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎంపిగా పనిచేసిన అనుభవం ఉంది. దివంగత ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, పివి నర్సింహారావులతో వీరి కుటుంబానికి ఎంతో సాన్నిహిత్యం ఉంది. రఘురామ్ రెడ్డికి ఇద్దరు కుమారులు. అందులో పెద్ద కుమారుడు వినాయక్ రెడ్డి సినీ హీరో వెంకటేశ్ పెద్ద కుమార్తె ఆశ్రితను వివాహం చేసుకోగా చిన్న కుమారుడు అర్జున్ రెడ్డి మంత్రి పొంగులేటి కుమార్తె సప్నిరెడ్డిని వివాహం చేసుకున్నారు.

ఖమ్మం నుంచి రాయల నాగేశ్వరరావు, మండవ వెంకటేశ్వరరావుల పేర్లు కూడా….
ఇప్పటికే కాంగ్రెస్ తరఫున ఖమ్మం లోక్‌సభ స్థానానికి రఘురామిరెడ్డి, మండవ వెంకటేశ్వరరావుల పేర్లు ఇప్పటికే తెరపైకి రాగా తాజాగా ఇదే జిల్లాకు చెందిన రాయల నాగేశ్వరరావు పేరును కూడా కొందరు ప్రతిపాదించినట్లు తెలిసింది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఆయన్ను గిడ్డంగుల సంస్థ చైర్మన్‌గా నియమించింది. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడం వల్ల రాయల నాగేశ్వరరావు ఇంకా బాధ్యతలు తీసుకోలేదు. ఈ స్థానానికి తీవ్ర పోటీ నెలకొని పేరు ప్రకటించడంలో జాప్యం జరుగుతున్న నేపథ్యంలో తాజాగా కొందరు ఆ పేరును కూడా తెరపైకి తెచ్చినట్లు తెలిసింది. గతంలో రాయల నాగేశ్వరరావు ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో హస్తం పార్టీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు.
హైదరాబాద్ పాతబస్తీ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు?
ఇక హైదరాబాద్ పాతబస్తీ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరన్నది కాంగ్రెస్ కేడర్‌లో వినిపిస్తున్న ప్రశ్న?. ఇప్పటివరకు హైదరాబాద్ అభ్యర్థిని ప్రకటించకపోవడంపై పార్టీలోని కొందరు సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా సమాచారం. అయితే ఇక్కడ మొదటగా మస్కతి పేరు వినిపించినా ఆ తర్వాత సమీరుల్లా పేరు తెరపైకి వచ్చింది. మరోవైపు కాంగ్రెస్ నేత ఫిరోజ్‌ఖాన్ కూడా హైదరాబాద్ టికెట్ ఆశిస్తున్నట్లుxe తెలుస్తోంది. దీంతో ఈ సీటుపై కూడా సందిగ్థత నెలకొనడం విశేషం. ఈ నేపథ్యంలోనే కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్ స్థానాలకు కాంగ్రెస్ అధిష్టానం నేడు అభ్యర్థులను ప్రకటించవచ్చని కాంగ్రెస్ వర్గాల సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News