Monday, January 20, 2025

ఢిల్లీపై ఉత్కంఠ

- Advertisement -
- Advertisement -

దేశ రాజధాని, దేశ పాలనకు కేంద్ర బిందువైన ఢిల్లీలో రాజకీయ పరిస్థితులు రోజురోజుకూ అనిశ్చితంగా మారుతున్నాయి. రేపు ఢిల్లీలో ఏమి జరుగబోతుందనే ఉత్కంఠ సర్వత్రా నెలకొన్నది. ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు లిక్కర్ స్కామ్‌లో ఇడి కస్టడి ఏప్రిల్ 1వ తేదీ వరకు పొడిగించారు. కస్టడీ నుంచే ఆయన ప్రస్తుతానికి పాలన సాగిస్తున్నారు. కస్టడీ తర్వాత జైలుకు వెళ్ళినా పరిపాలన అక్కడి నుంచే సాగిస్తారని ఆప్ నాయకులు గడిచిన మూడు రోజులుగా చేస్తున్న ప్రకటనలపై దేశ వ్యాప్తంగా రాజకీయంగా, న్యాయవాద వర్గాల్లో ఇది రాజ్యాంగబద్ధమా కాదా అనే చర్చలు సాగుతున్న తరుణంలోనే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా బుధవారం ఒక జాతీయ ఆంగ్ల దిన పత్రిక నిర్వహించిన సెమినార్‌లో బాంబు పేల్చారు.

ఒకవేళ కేజ్రీవాల్ ఇడి కస్టడీ నుంచి జైలుకు వెళ్ళిన తర్వాత కూడా అక్కడి నుంచే పరిపాలన సాగిస్తామంటే అది కుదరదని అవసరమైతే రాష్ట్రపతి పాలన విధిస్తామని సక్సేనా ప్రకటించడంతో ఢిల్లీ రాజకీయం మరింత వేడెక్కింది. కోర్టులో శిక్ష పడేదాకా ఎవరైనా దోషి కాదనే అనే న్యాయసూత్రం ఆధారంగా జైలు నుంచి అయినా పాలన సాగించవచ్చని కేజ్రీవాల్ అనుచరులు చెబుతుండగా, హైకోర్టు కూడా గురువారం ఈ అంశాన్ని ఉదహరిస్తూ కేజ్రీవాల్ పాలనపై జోక్యం చేసుకోలేమని వ్యాఖ్యానిం చింది. అయినా కేజ్రీవాల్ రాజకీయ అష్టదిగ్బంధనంలో చిక్కు కోవడంతో మున్ముందు ఢిల్లీలో ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయనే విషయంపై పలు రకాలుగా వాదనలు, కౌంటర్ వాదనలు వినిపిస్తున్నాయి. స్వతంత్ర భారత చరిత్రలో ముఖ్యమంత్రిగా పదవిలో ఉన్నప్పుడే కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడం మొదటిసారి అని అంతా అంటున్నారు.

అయితే గతంలో పలు సంక్షోభ సందర్భాల్లో వివిధ రాష్ట్రాల్లో ఏర్పడిన పరిస్థితులను న్యాయకోవిదులు గుర్తు చేస్తున్నారు. తమిళనాడులో అప్పటి దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలుకు వెళ్ళే పరిస్థితులు ఏర్పడినప్పుడు ఆమె తన తరపున పాలనా వ్యవహారాలు చక్కదిద్దేందుకు పన్నీరు సెల్వంను నియమించింది. ఆ తర్వాత ఆమె జైలులో ఊచలు లెక్కబెట్టింది. ఇటీవల జార్ఖండ్‌లో ముఖ్యమంత్రిగా ఉన్న హేమంత్ సోరెన్ తనను ఇడి అరెస్టు చేస్తుందన్న సమాచారం అందిన వెంటనే పదవికి రాజీనామా చేసి తన తరపున మెజారిటీ అభిప్రాయం ప్రకారం చంపై సోరెన్‌ను ముఖ్యమంత్రిగా నియమించారు. బీహార్‌లో లాలూ ప్రసాద్ యాదవ్ అరెస్టు అయ్యే పరిస్థితులు నెలకొనడంతో తన వారసురాలుగా భార్యను ముఖ్యమంత్రిగా నియమించి పదవికి రాజీనామా చేశారు.

కాని ఇప్పుడు ఢిల్లీలో ఎలాంటి పరిస్థితులు ఏర్పడుతాయనేది ఇప్పుడే ఊహించలేని పరిస్థితి నెలకొన్నది. అరెస్టు అయిన తర్వాత కూడా కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేయలేదు. వారసులను నియమించలేదు. అయినా కేజ్రీవాల్ పాలన సాగించడం రాజ్యాంగబద్ధమా కాదా అనే దానిపై అవునూ కాదూ అనే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితిలోనే మొదటి నుంచి నిప్పుఉప్పులా ఉన్న లెఫ్టినెంట్ గవర్నర్ ఇక్కడ కీలక పాత్ర వహించే అవకాశం ఉంది. మిగతా రాష్ట్రాల పరిస్థితులు వేరు, ఢిల్లీ వేరు. పేరుకు ఢిల్లీ రాష్ట్రమే గాని అక్కడ పాలనా నియంత్రణ అంతా కేంద్ర హోం శాఖ, లెఫ్టినెంట్ గవర్నర్ చేతిలోనే ఉంటుంది. కేజ్రీవాల్ జైలు నుంచి పాలన న్యాయబద్ధమా, నైతికమా అనే ప్రశ్నలు అటుంచితే ప్రస్తుతం ఇక్కడ లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఉన్న సక్సేనా అప్పుడే రాష్ట్రపతి పాలన రావచ్చునని చెప్పడం ఢిల్లీ రాజకీయ పరిస్థితులను మరింత అనిశ్చితం చేసింది. ఇప్పటికే లిక్కర్ స్కామ్‌లో ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ లాంటి వారు ఏడాది కాలంగా జైలులోనే ఉన్నారు.

అదే పరిస్థితి ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు వస్తుందని అంతా అంటున్నారు. అప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా చక్రం తిప్పి శాంతి భద్రతల పేరుతో రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేసే అవకాశాలున్నాయి. కాని ప్రజాస్వామ్య బద్ధంగా ఏర్పడిన ప్రభుత్వాన్ని బిజెపి కూలదోసిందనే అపప్రధ ఆ పార్టీకి తప్పదు. కాని బిజెపికి ప్రభుత్వాలు కూలదోయడం, పార్టీలను చీల్చడం, మెజారిటీలను తలకిందులు చేయడం వెన్నతో పెట్టిన విద్య. అధికారమే అంతిమ లక్షంగా ఎంతకైనా తెగించడానికి బిజెపి ముందుకు వెళుతుందని ఇప్పటి వరకు పలు రాష్ట్రాల్లో కూలిన ప్రభుత్వాల ఉదంతాలు తెలియజేస్తున్నాయి. ఈ కోణంలో చూస్తే కేజ్రీవాల్ మిగతా ముఖ్యమంత్రులు లాగా రాజీనామా చేపి తన పదవిని మరొకరికి అప్పజెప్పి ప్రభుత్వాన్ని కాపాడుకుంటారా? ప్రభుత్వ భవితవ్యాన్ని సక్సేనాకు అప్పజెపుతారా అనేది అత్యంత ఆసక్తికర అంశంగా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News