న్యూఢిల్లీ: భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) అధ్యక్ష, కార్యదర్శుల పదవి కాలం పొడిగింపుపై ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం సౌరవ్ గంగూలీ బిసిసిఐ అధ్యక్షుడిగా ఉన్నాడు. జై షా బిసిసిఐ ప్రధాన కార్యదర్శి విధులు నిర్వర్తిస్తున్నారు. త్వరలోనే వీరి పదవి కాలం ముగియనుంది. కాగా, వీరి పదవీకాలం పొడిగింపు అంశంపై వచ్చే వారంలో స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. బిసిసిఐ రాజ్యంగ సవరణపై వేసిన పిటిషన్‌ను విచారించాలని బిసిసిఐ సర్వొన్నత న్యాయం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. కాగా, బిసిసిఐ అభ్యర్థనను సుప్రీం కోర్టు అంగీకరించింది. వచ్చే వారం దీనిపై విచారణ జరుపుతామని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం హామీ ఇచ్చింది. ఇదిలావుండగా జస్టిస్ ఆర్.ఎం.లోధా కమిటీ సిఫార్సుల మేరకు ఎవరైనా బిసిసిఐ లేదా రాష్ట్రాల క్రికెట్ సంఘాల పాలక గరిష్ఠంగా ఆరేళ్లకు మించి పని చేయకూదు. ఒక వేళల అలా చేయాల్సి వస్తే మధ్యలో కనీసం మూడేళ్ల విరామం తప్పని సరి అనే నిబంధన ఉంది. కాగా నిబంధనను తొలగిస్తూ 2019 డిసెంబర్‌లో జరిగిన బిసిసిఐ వార్షిక సమావేశంలో ప్రతిపాదనలు చేశారు.
సవరించిన ప్రతిపాదనల ప్రకారం పాలక మండలిలోనూ సభ్యులు ఆరేళ్లు దాటినా ఆ పదవిలో కొనసాగేందుకు అవకాశం ఉంటుంది. అంటే గంగూలీ, జై షాలు మరికొంత కాలం పాటు తమ పదవుల్లో కొనసాగేందుకు వీలు కలుగుతుంది. మరోవైపు ఈ ప్రతిపాదనలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ బిసిసిఐ 2020 ఏప్రిల్‌లో సుప్రీం కోర్టులో పిటిషన్‌ను ధాఖలు చేసింది. కాగా, కరోనా కారణంగా ఇది విచారణకు రాలేదు. ఇలాంటి స్థితిలో అత్యవసర విచారణ చేపట్టాలంటూ బిసిసిఐ శుక్రవారం అత్యున్నత కోర్టును అభ్యర్థించింది. దీనికి సుప్రీం కోర్టు సానుకూలంగా స్పందించింది. కాగా గంగూలీ 2019 అక్టోబరులో బిసిసిఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. అయితే అంతకుముందే గంగూలీ బెంగాల్ క్రికెట్ సంఘంలో సుదీర్ఘ కాలంగా పని చేశారు. దీంతో గంగూలీకి ఇలాంటి పరిస్థితి ఎదురైంది. కాగా, జైషా కూడా గతంలో సుదీర్ఘ కాలం పాటు గుజరాత్ క్రికెట్ సంఘంలో వివిధ పదవులను నిర్వహించారు. మరోవైపు గంగూలీ, జైషాల పదవీ కాలం 2020 జులైలోనే ముగిసింది. అయితే అంతకుముందే రాజ్యంగ సవరణ కోరుతూ సుప్రీం కోర్టులో కేసు వేయడంతో గంగూలీ, జైషా తమ పదవుల్లో కొనసాగుతున్నారు.